కొంతమంది శాఖాహారులు మాంసం వాసనను అస్సలు ఇష్టపడరు. స్నేహితుల, బంధువుల ఇళ్లకు వెళ్లినా మాంసం తినబోమని ముందుగానే చెబుతూ ఉంటారు. పొరపాటున వాళ్లు తినే ఆహారంలో మాంసం కలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళకు వెజ్ పిజ్జాకు బదులుగా నాన్ వెజ్ పిజ్జా డెలివరీ అయింది. మాంసంతో ఉన్న పిజ్జా డెలివరీ కావడంతో మహిళ పిజ్జా డెలివరీ చేసిన అమెరికన్ ఔట్ లెట్ రెస్టారెంట్ పై కేసు వేసి ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసింది.
చాలా నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా సదరు మహిళ రెస్టారెంట్‌ను కోర్టుకు లాగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్ కు చెందిన్ దీపాలి త్యాగి గతేడాది హోలీ పండుగ రోజున పిల్లల కొరకు అమెరికన్ పిజ్జా రెస్టారెంట్ నుంచి వెజ్ పిజ్జాను ఆర్డర్ చేయగా ఆర్డర్ రావాల్సిన సమయం కంటే అరగంట ఆలస్యంగా వచ్చింది. ఆలస్యమైనా ఆమె పట్టించుకోకుండా తను తినడంతో పాటు పిల్లలకు పిజ్జా ఇచ్చింది.
అయితే మాంసం ముక్కలు పంటికి తగడంతో ఆ మహిళకు పిజ్జా నాన్ వెజ్ పిజ్జా అని అర్థమైంది. ఆచారాలు, మత విశ్వాసాలను పాటించే మహిళ కోపోద్రిక్తురాలే రెస్టారెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వినియోగదారుల వివాద పరిష్కార కోర్టులో రెస్టారెంట్ యాజమాన్యం కోటి రూపాయలు చెల్లించాలని కేసు వేసింది. ఇది చిన్న విషయం కాదని.. తన సంప్రదాయాలను దెబ్బతీయడమేనని మహిళ పేర్కొంది.
రెస్టారెంట్ యాజమాన్యం నాన్ వెజ్ పిజ్జాను డెలివరీ చేసి తనను మానసిక క్షోభకు గురి చేసిందని మహిళ పేర్కొంది. ఈ నెల 17వ తేదీన ఈ అంశంపై విచారణ జరగనుంది. కోర్టు ఈ కేసులో తీర్పు ఏమని ఇస్తుందో చూడాల్సి ఉంది.