Pawan kalyan: రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. సరిగ్గా టైం చూసి అధికారంలోకి వచ్చే పార్టీని గెస్ చూసి దూకితే రాజ్యాధికారం ప్రాప్తిస్తుంది. ఈ విషయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందరికీ స్ఫూర్తి అంటారు. ఆయన సరిగ్గా అంచనావేసి ఎన్నికల ముందుర అధికార పార్టీలోకి దూకి మంత్రి పదవిని కొల్లగొడుతారు. ఇక దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబును చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో మోడీ ఓడిపోతాడని తెలిసి తన బద్దశత్రువైన కాంగ్రెస్ కు సపోర్టు చేసి ఓడిపోయాడు. అందుకే అంటారు. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే మేధావి నేత అని.. అలాంటి తప్పటడుగులు వేయొద్దని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట.. 2023 ఎన్నికల్లో గెలిచే పార్టీతో వెళ్లాలని డిసైడ్ అయ్యాడట.. ఈ మేరకు జనసేన వర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోందట..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు ఉన్నాయా..? లేవా..? అంటే చెప్పలేం అనే సమాధానమే ఎక్కువ వస్తోంది. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు, నిర్ణయాలు బీజేపీని కాదని పవన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు బీజేపీ సైతం జనసేనను పట్టించుకోకుండా తమ దారి చూసుకుంటోంది. అయితే బీజేపీ నాయకులు మాత్రం పవన్ ఇమేజ్ ను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బద్వేల్ లో జరిగిన ఉప ఎన్నికలో పవన్ వచ్చి ప్రచారం చేస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. కానీ పవన్ ప్రచారం చేయలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉన్న సంబంధమేంటో అర్థం కావడం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అందుకు ప్లాన్ కూడా వేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం పవన్ తమతోనే ఉంటారని అంటున్నారు.
2014 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్.. టీడీపీ, బీజేపీ అలయన్స్ తరుపున ప్రచారం చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి కలిసి వచ్చింది. ఆ తరువాత టీడీపీతో విభేదించిన పవన్ సొంతంగా 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగారు. అటు టీడీపీ సైతం ఒంటరిగానే పోటీ చేయడంతో ఇద్దరికీ ఘోర పరాభావం ఎదురైంది. దీంతో ఇరు నాయకులకు కలిసి రానట్లేనని భావించారు. అయితే 2019 ఎన్నికల తరువాత పవన్ బీజేపీకి దగ్గరగా ఉంటూ వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను తరుచూ కలుస్తూ వారికి దగ్గరయ్యారు. ఆ తరువాత దేవాలయాల విగ్రహాల ధ్వంసం, అంతర్వేది రథం సంఘటన్లో బీజేపీ, జనసేనలు కలిసి ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో బీజేపీ, జనసేన నాయకులు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
అయితే తిరుపతి ఉప ఎన్నిక సమయంలో పవన్ తాను పోటీ చేస్తానని పట్టుబట్టారు. కానీ కేంద్ర పెద్దలు పవన్ ను ఒప్పించి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టారు. అయితే పవన్ కూడా ఆ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. కానీ అక్కడ బీజేపీ అభ్యర్థి సెకండ్ ప్లేస్ కూడా రాలేకపోయాడు. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో కొన్ని చోట్ల విజయం సాధించింది. ఇక విజయవాడ లాంటి పరిసర ప్రాంతాల్లో బీజేపీ, జనసేనలు పోటీ చేస్తే జనసేన నాయకులకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో కొందరు నాయకులు బీజేపీతో పొత్తు వద్దని నివేదికలు అందించారట.. దీంతో పవన్ సైతం బీజేపీకి దూరంగా ఉండాలని భావించారు.
ఆ తరువాత పలు కార్యక్రమాల్లో పవన్ ఒంటరిగానే ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు రోడ్ల ధ్వంసం శ్రమదానం లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వం దిగి రావడంతో పాటు ప్రజల్లోనూ జనసేనను ఆదరించినట్లు తెలిసింది. దీంతో జనసేన ఒంటరిగానే ముందుకు వెళ్లేదుకు నిర్ణయించుకున్నట్లు సమచారం. ఇదే కాకుండా ఇటీవల జరిగిన బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయదని పవన్ ముందుగానే ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం తాము వారసత్వ రాజకీయాలకు విరుద్ధమని తమ అభ్యర్థిరి బరిలోకి దించారు. అంతేకాకుండా పవన్ వచ్చి ప్రచారం చేస్తారని చెప్పారు. కానీ పవన్ వెళ్లలేదు.
ఈ క్రమంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ టీడీపీ నేత పవన్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ తనతో పాటు బీజేపీని కూడా టీడీపీతో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడా..? అన్నచర్చ కూడా సాగుతోంది. కానీ టీడీపీ నాయకులు జనసేన వస్తే చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం పవన్ ను విడిచిపెట్టేది లేదని వచ్చే ఎన్నికల్లోనూ తమతోనే కలిసి ఉంటారని, అవసరమైతే కేంద్ర నాయకులతో ఒప్పిస్తామని అంటున్నారు. అయితే ఎవరికీ అర్థం కాకుండా పవన్ అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. దీంతో పవన్ టీడీపీతో ఉంటారా..? బీజేపీతో ఉంటారా..? అనేది ఆసక్తిగా మారింది.