
BRS Focus On AP: ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు ఉంది ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితి. పార్టీ కార్యాలయం లేదు.. నాయకత్వ విస్తరణ లేదు.. కనీసం కార్యకర్తలు కూడా లేని ఆ పార్టీ ఏపీలో బలపడేందుకు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. మైండ్ గేమ్ ప్రారంభమైందని, ఇక కాచుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం సంకేతాలిస్తుంది.
ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ సాధ్యమయ్యేనా?
బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆరంభించి, కేంద్రంలో పాతుకు పోవాలని ఎత్తులు వేస్తున్నారు. అంతకంటే ముందుగా రాష్ట్రాల్లో విస్తరించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆర్భాట ప్రకటన చేసేశారు. అంతేగాక 165 స్థానాలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటు కూడా చేస్తామని అన్నారు.
సవాలుగా నాయకత్వ లేమి
ఈ ప్రకటనతో రాజకీయ పార్టీల చూపు బీఆర్ఎస్ వైపు తిప్పుకునేలా చేసినా, ఏ మాత్రం ఫలితం ఇస్తుందోనన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆ పార్టీలో ఉన్న ప్రధాన నేతల్లో రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్ మాత్రమే ఉన్నారు. ఇరువురికి అంతగా జనాదరణ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఏపీలో విస్తరింపజేయడం వీరికి పెద్ద సవాలుగా మారింది.

డిపాజిట్లు కూడా రాని స్థితిలో బీజేపీ
ఏపీలో బీజేపీకి ప్రస్తుతం డిపాజిట్లు కూడా రాని స్థితిలో ఉంది. ప్రధానంగా ఈ పార్టీపైనే పోరు సాగిస్తున్న కేసీఆర్.. ఇక్కడ ఎవరిపై పోటీ చేయనున్నారనేది ప్రశ్నగా మారింది. మిత్రపక్షాలపై పోరు సాగిస్తే ఆ ఫలితం భవిష్యత్తు కార్యకలాపాలపై పడుతుంది. ఒకవేళ అనుకున్నట్లుగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఎవరిపై ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తికరంగాను ఉంటుంది. అప్పుడు ఏపీలోని ఏదో ఒక పార్టీని శత్రువుగా మార్చుకునే ప్రమాదం లేకపోలేదు. ఏమో చూద్దాం.. ఏమవుతుందో…