AP Kapu Politics: వంగవీటి మోహన్ రంగా.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. కాపులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. బడుగు బలహీన వర్గాలు పొలిటికల్ లెజెండ్ గా అభివర్ణిస్తారు. ఆయన అకాల మరణం తరువాత ఆ స్థాయిలో ఉన్న స్ట్రాంగ్ లీడర్ కాపులకు లభించలేదు. అయితే మోహన్ రంగా భౌతికంగా లేకున్నా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రంగా పేరు మార్మోగుతుంది. అతడు మావాడంటే మావాడు అని పొలిటికల్ పార్టీలు ఓన్ చేసుకునేందుకు ఆరాటపడుతుంటాయి.ఆయన పేరు చెప్పి కాపులు, బడుగు బలహీనవర్గాల వారి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే రంగా పేరును వాడుకొని.. ఆయన తమవాడిగా చూపుకున్న పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఎన్నికల్లో గెలుపొందాయి. రంగా హత్య జరిగి 34 సంవత్సరాలుకాగా… అటు తరువాత వచ్చిన ఆరేడు ఎన్నికలు రంగా పేరునే పొలిటికల్ పార్టీలు వాడుకున్నాయి. ఇప్పటికీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమ పార్టీ మేనిఫెస్టో కంటే మోహన్ రంగా పేరును వినియోగించుకుంటే వర్కవుట్ అవుతుందన్న ఆలోచనకు వచ్చాయంటే ఏపీలో వంగవీటి అన్న పేరు ఏ స్థాయిలో బ్రాండ్ సంపాదించుకుందో అర్ధం చేసుకోవచ్చు.

1988లో వంగవీటి మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన మోహన్ రంగాను కిరాతకంగా చంపేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. విజయవాడ రాజకీయాల్లో ఆధిపత్య పోరు రంగా హత్యకు పురిగొల్పినా.. ప్రత్యర్థులకు అప్పటి ప్రభుత్వం సహకరించిందని.. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. 45 రోజుల పాటు విజయవాడ అట్టుడికింది. నిఘా నీడలోకి వెళ్లింది. సుదీర్ఘ కాలం కర్ఫ్యూ సాగింది. రంగా హత్య పర్యవసానం నాటి ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ పై పెను ప్రభావం చూపింది. 1989 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమైంది. అయితే రంగా హత్యకు టీడీపీయే కారణమన్న అపవాదు.. అప్పటికీ ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. అటు రంగా హత్యలో ఆరోపణలను ఎదుర్కొన్న వారికి అన్ని రాజకీయ పక్షాలూ అక్కున చేర్చుకోవడం విశేషం.
సాధారణంగా రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం కొంతమంది వ్యక్తులను అక్కున చేర్చుకుంటాయి. నాడు మోహన్ రంగా హత్యకు గురైనప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. అటు ప్రత్యర్థులుగా ఉన్న దేవినేని కుటుంబం కూడా అదే పార్టీలో కొనసాగేది. అయితే టీడీపీ ఆవిర్భావంతో దేవినేని కుటుంబం ఆ పార్టీ వైపు మొగ్గుచూపింది. కానీ రంగా హత్య తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అదే దేవినేని కుటుంబం అటు వైపు చూడడం ప్రారంభించింది. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ ఏలుబడి సాగడంతో నాడు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో చిరుప్రాయంలో ఉన్న వంగవీటి రాధాక్రిష్ణ పై వైఎస్ కన్నుపడింది. ఆయనకు కాంగ్రెస్ లోకి రప్పించి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రాధాక్రిష్ణను వైఎస్ పెద్దగా పట్టించుకోలేదు. పైగా నాటి వంగవీటి ప్రత్యర్థులు.. దేవినేని నెహ్రూ కుటుంబానికి ప్రాధాన్యమిచ్చారు. దీంతో రాధా 2009లో పీఆర్పీలో చేరారు. వైసీపీ ఆవిర్భావంతో కష్టాల్లో ఉన్న జగన్ వెంట అడుగులేశారు. అక్కడ కూడా రాధా దగా పడ్డారు. ఆయన రాజకీయ జీవితానికి జగన్ చెక్ చెప్పారు. పైగా ప్రత్యర్థి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను వైసీపీలో చేర్చుకున్నారు. ఇలా వంగవీటి ప్రత్యర్థులను అన్ని పార్టీలు అక్కున చేర్చుకున్నాయి. విషయమేమిటంటే ఎన్నికల్లో మాత్రం వంగవీటి మావాడంటే మావాడు అని పోటీ పడుతున్న పార్టీలు తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ కుటుంబాన్ని, కాపు జాతిని అణగదొక్కుతుండడం రివాజుగా మారింది.

ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో వంగవీటి మోహన్ రంగాను వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. విశాఖలో కాపునాడును వేదికగా చేసుకొని రంగా, రాధా రాయల్ అసోసియేషన్ భారీగా ప్లాన్ చేసింది. ఇది జనసేనకు మద్దతుగా చేస్తున్నారన్న ప్రచారం ఉంది. దీంతో తామెక్కడ వెనుకబడిపోతామన్న భయం టీడీపీ, వైసీపీని వెంటాడుతోంది. ఇప్పటికే వైసీపీ వంగవీటి పేరును ఎత్తేందుకు కూడా వీలుపడనట్టుగా చేసుకుంది. వంగవీటి కుమారుడు రాధాను పార్టీ నుంచి సాగనంపింది. గత ఎన్నికలకు ముందు రంగా వర్ధంతి, జయంతి నాడు ఆయన విగ్రహాలకు పూలమాలు వేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖం చాటేశారు. రంగాను తూలనాడుతూ మాట్లాడిన గౌతంరెడ్డికి రాష్ట్రాస్థాయిలో నామినేట్ పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేరుగా రంగా వర్థంతి నిర్వహించలేని పరిస్థితి. అటు టీడీపీ సైతం రంగా వర్ధంతి నిర్వహణకు ముందుకొచ్చింది. కానీ రంగాను హత్యచేసిన పార్టీగా వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. దీంతో గుడివాడతో పాటు కోస్తా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగా అభిమానులు, కాపులు మాత్రం సంఘటితంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా జనసేన వైపే టర్న్ అవుతారని.. మిగతా రాజకీయ పక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ అయ్యే చాన్స్ మాత్రం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.