Konaseema Agitation : ‘కోనసీమ’ జిల్లా పేరు మార్పు మంటలు అంటుకున్నాయి. ఆ ఆగ్రహ జ్వాలల్లో వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు తగలబడ్డాయి. మొత్తం ఖాళీ బూడదయ్యాయి. కానీ విశేషం ఏంటంటే.. ఒక్క సీఎం జగన్ ఫొటో మాత్రం చెక్కుచెదరలేదు. జగన్ ను మంటలు ఏమీ చేయలేకపోయాయి. దీంతో ఆ మంటల్లో ఠీవీగా ఉన్న జగన్ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘అంతా కాలిపోయినా గోడమీద వేలాడుతున్న జగనన్న ఫోటో కాలిపోలేదా ? ఆయన నిప్పునా?’ అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అక్కడి ప్రజలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే ఇళ్లు, కార్యాలయాలను తగులబెట్టారు. ఈసందర్భంగా మంత్రి విశ్వరూప్ కార్యాలయం మొత్తం దగ్ధమైనా కూడా ఆయన ఆఫీసులోని సీఎం జగన్ నవ్వుతున్న ఫొటో మాత్రం కాలిపోకుండా చెక్కుచెదరకుండా ఉండడం విశేషమే మరీ.. ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్, ఇతర సామగ్రి అంతా బూడిదయ్యాయి. గోడకున్న జగన్ ఫొటో మీదనున్న ఏసీ కూడా కాలిపోయింది. కానీ దాని కిందనే ఉన్న జగనన్న ఫొటో మాత్రం అలానే ఉండడం విశేషం.
ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జగనన్న మజాకా.. నిప్పు కూడా మా జగన్ ను ఏమీ చేయలేకపోయింది?’ వైసీపీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కానీ దీన్ని వైసీపీ ప్రత్యర్థులు ఊరుకుంటారా? సెటైర్లు వేస్తున్నారు.
‘నిప్పు అంటించిందే జగన్ అని.. అందుకే ఆ నిప్పుకు ఈ నిప్పు అంటుకోలేదని’ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఇన్ని కాలిపోయినా జగన్ ఫొటో మాత్రం కాలిపోకపోవడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశంగా మారింది.