
Amritpal Singh: ఖలిస్థానీ ఏర్పాటు వాది, “వారీస్ పంజాబ్ దే” చీఫ్ అమృత్ పాల్ సింగ్ అరెస్టు అయ్యాడు. పోలీసులు అతడిని పంజాబ్ లోని రోడే లో అదుపులోకి తీసుకున్నారు.: ఖలిస్థానీ ఏర్పాటు వాది, “వారీస్ పంజాబ్ దే” చీఫ్ అమృత్ పాల్ సింగ్ అరెస్టు అయ్యాడు. పోలీసులు అతడిని పంజాబ్ లోని రోడే లో అదుపులోకి తీసుకున్నారు. వర్చువల్ అజ్నాలా జడ్జి ముందు ప్రవేశపెట్టారు.. ప్రత్యేక విమానంలో అస్సాంలోని దిబ్రూగడ్ జైల్ కు తరలించారు. అయితే అమృత్ పాల్ ను పంజాబ్లో కాకుండా దిబ్రూగడ్ జైలుకు ఎందుకు తరలించారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి అమృత్ పాల్ సింగ్ విద్వేష వ్యాఖ్యలకు పాల్పడుతున్నాడు. పైగా వారిస్ పంజాబ్ దే పేరుతో సంస్థ ఏర్పాటు చేసి ప్రత్యేక ఖలిస్తాన్ కావాలి అని పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆజ్నాలా పోలీస్ స్టేషన్ పై తన అనుచరులతో దాడి చేయించాడు. ఇందుకు కారణం లేకపోలేదు అతడి అనుచరుడిని ఆ ప్రాంత పోలీసులు అరెస్టు చేయడంతో, అతడి ని విడిపించేందుకు అమృత్ పాల్ సింగ్ తన అనుచరులతో ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడికి దిగాడు. అంతేకాదు ఇందిరా గాంధీకి పట్టిన గతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పడుతుందని హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అటు పంజాబ్ ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా అతడు పరారయ్యాడు. మార్చి 18 నుంచి అతడు అజ్ఞాతంలో ఉన్నాడు.
ఆదివారం అతడిని అరెస్టు చేసిన తర్వాత అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి ఘటన తర్వాత అమృత్ పాల్, అతడి అనుచరులను పంజాబ్, చండీగఢ్ జైళ్ళల్లో ఉంచడం సరికాదని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తీహార్ జైలులోనూ ఖలిస్తానీ ఏర్పాటు వాదులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన మూకలు, జైలు పై దాడి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అస్సాంలోని దిబ్రూగడ్ కేంద్ర కారగారాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దిబ్రూగడ్ నుంచి వైపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ దేశాల బలగాలు మోహరించి ఉంటాయి. అన్నింటికీ మించి ఈ జైలులో భద్రత, బాధ్యతలను స్థానిక పోలీసులు, జైళ్ళ శాఖ కాకుండా సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వర్తిస్తాయి. ఇక జైలు బయట కూడా కమాండోలతో రాష్ట్ర పోలీసుల భద్రత ఉంటుంది. 57 హెచ్డి సీసీ కెమెరాలు ఉండగా.. అమృత్ పాల్, అతడి అనుచరులు రాక నేపథ్యంలో పోలీసులు మరో 12 కెమెరాలు ఏర్పాటు చేశారు.
దిబ్రూగడ్ ఈశాన్య ప్రాంతంలోని పురాతనమైన జైలు.. ఈ జైలుకు 170 ఏళ్ల చరిత్ర ఉంది. అత్యంత పటిష్టమైన భద్రత ఇక్కడ ఉంటుంది. పైగా కేంద్ర బలగాలు నిరంతరం పహారా కాస్తూ ఉంటాయి. పైగా ఈ జైలుకు మూడు అంచల భద్రత ఉంటుంది. జైలు కాంపౌండ్ ను అస్సాం పోలీస్ విభాగానికి చెందిన ఎలైట్ బ్లాక్ క్యాట్ కమాండోలు, సిఆర్పిఎఫ్, ఇతర భద్రత సిబ్బంది పహారా కాస్తు ఉంటారు. ప్రస్తుతం ఈ జైల్లో 680 మంది ఖైదీలు ఉన్నారు. అస్సాం రాష్ట్రంలో గౌహతి, తేజ్ పూర్ తర్వాత దిబ్రూగడ్ మూడవ అతిపెద్ద జైలు.. ఉల్ఫా తీవ్రవాదులను ఇక్కడికే తరలించారు. జాతీయ భద్రత చట్టం కింద అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేసి దిబ్రూగడ్ తీసుకొచ్చారు. అయితే అమృత్ పాల్ సింగ్, అతడి అనుచరులపై నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇంతవరకు ఎటువంటి చార్జ్ షీట్ దాఖలు చేయలేదు. కానీ ఒక్కసారి ఎన్ఐఏ కింద అరెస్టు చేస్తే సంవత్సరం వరకు ఎలాంటి చార్జ్ షీట్ ఫైల్ చేయనవసరం ఉండదు. అమృత్ పాల్ సింగ్ కూడా ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందే.

అమృతపాల్ సింగ్ కు పాకిస్తాన్ ఐఎస్ఐ ఆయుధాలు సరఫరా చేస్తోందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ నుంచి వేరుచేసి పాకిస్తాన్లోని పంజాబ్లో కలిపేయాలని కుట్ర ఉంది. దీనికి పాకిస్తాన్ తో పాటు కెనడా, బ్రిటన్, అమెరికా దేశాలలోని ఖలిస్తాని మద్దతుదారుల సహకారం ఉంది. మరీ ముఖ్యంగా బ్రిటన్, వంటి దేశాలు ఖలిస్తాని మద్దతుదారుల మీద చీరలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. కానీ ఎప్పుడైతే పంజాబ్లో అమృత్పాల్ సింగ్ మీద పోలీస్ యాక్షన్ మొదలైందో.. ఇప్పటి నుంచే అమెరికా, బ్రిటన్ దేశాలలో భారత రాయబార కార్యాలయాల మీద ఖలిస్తాని మద్దతుదారులు దాడులు చేయడం మొదలుపెట్టారు. మార్చి 19న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులెట్ కార్యాలయం మీద ఖలిస్తాని మద్దతు దారులు దాడి చేసి, నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అక్కడి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాన్సులేట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు అరగంట తర్వాత అక్కడికి చేరుకున్నారు. ఈ పరిణామాలు మొత్తం చూసిన భారత్.. అమృత్ పాల్ సింగ్ ను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసింది. దిబ్రూగడ్ జైల్ కు తరలించిన అనంతరం అమృత్ పాల్ సింగ్ ను విచారణ చేసి అసలు విషయాలు బయటపెడతామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు.