Ambani Adani: ప్రతి దేశంలో వారి వారి అగ్ర కంపెనీలు, బడా ధనవంతులపై ఆ దేశ ప్రజలకు ప్రేమ నమ్మకం ఉంటాయి. కానీ మనదేశంలోకి వచ్చేసరికి ట్రెయిన్ రివర్స్. ఇక్కడ సంపద పోగేసుకుంటున్న ధనవంతులను చూసి.. వారు ప్రభుత్వాలతో కలిసి ఎదుగుతున్న తీరు చూసి చాలా మంది విమర్శలు చేస్తుంటారు. టాటాలు, బిర్లాలు కష్టపడి సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రజలకు తక్కువకే వస్తువులు అమ్మి, ఆవిష్కరణలు చేసి న్యాయంగా వ్యాపారం చేశారు. ఇప్పటికే టాటా సంస్థ, రతన్ టాటా సేవలు, ఫౌండేషన్ల పేరిట కోట్లు విరాళంగా ఇచ్చి సమాజ సేవ చేస్తున్నారు. అందుకే టాటాపై జనాల్లో వ్యతిరేకత లేదు. మరి ఇదే పనిచేయని అంబానీ, అదానీలపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. మోడీ సర్కార్ హయాంలో వ్యూహాత్మకంగా ప్రభుత్వ సంస్థలు, 5జీ స్పెక్ట్రమ్, గనులు, ఎయిర్ పోర్టులు, ఓడరేవులు వీరికి మాత్రమే దక్కేలా చేయడం కూడా ఈ రెండు కంపెనీలపై వ్యతిరేకత పెరగడానికి కరణం. 5జీ అంబానీకి పోవడం.. గనులు, పోర్టులు అదానీకే దక్కడం.. ఆఖరుకు విశాఖ స్టీలును కూడా అదానీకే దక్కేలా చూడడం వల్లే వారిపై వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నది కాదనలేని వాస్తవం. ఇందులో మోడీ సర్కార్ ప్రభుత్వ ఒత్తిడి ఉందని.. వీరికి పోటీగా ఎవరు వచ్చినా ఈడీలు,సీబీఐలు దాడులతో వారిని వెనక్కి తగ్గేలా చేస్తున్నారన్న ఆరోపణలు పారిశ్రామికవర్గాల్లో ఉన్నాయి. అందుకే అంబానీ, అదానీలపై ఇంతటి వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. విదేశాలకు, భారతీయుల మధ్య తేడా ఏంటన్న దానిపై స్పెషల్ స్టోరీ..

ప్రతి జాతికీ ఒక ప్రత్యేక లక్షణముంటుంది. ప్రతి దేశానికి ఒక లక్ష్యం ఉంటుంది. మన రాజ్యాంగంలో “సోషలిస్ట్” అనే గొప్ప పదం రాసుకున్నాం. అంటే దోచుకోవడానికి వీల్లేకుండా, సంపద అంతా ఒకరి చేతుల్లో ఇమిడిపోకుండా అందరూ సమానంగా పంచుకుని జీవించాలి అని. లిస్టులో చూపిన దేశాలు ప్రాధమికంగా పెట్టుబడి దేశాలు. అంటే అణగారిన జనపు శ్రమని దోచుకుని బలవంతుడు ఆస్తి పోగేసుకునే వెసులుబాటు వుంటుంది.
ఈదేశాల్లో ధనవంతులు తమకోసం ప్రభుత్వాలు నడుపుకుంటారు. ప్రపంచాన్ని దోచుకోవడం కోసం పంచుకునే గొడవల్లో ఈ దేశాలు రెండు ప్రపంచ యుద్దాలు చేశాయి. బ్రిటన్ కేవలం తన దేశంలోని ఈస్టిండియా అనే కంపెనీకోసం సర్వస్వం ఒడ్డింది. జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఇందుకోసం రెండు ప్రపంచ యుద్దాలు చేశాయి. రెండో ప్రపంచ యుద్దానంతరం ప్రతిదేశపు పతనంలో అమెరికా పాత్ర వుంది. తన ఆయుధాలు అమ్ముకొవడంకోసం ఎన్నో ప్రభుత్వాల్ని కూల్చింది. వ్యవస్థల్ని కుప్ప కూల్చింది. ఇటువంటి దేశాల్ని పోలికపెట్టడం అర్థంలేదు.
ఈ దేశాల్లోని ఆయా కంపెనీలు స్వదేశంలో జనాన్ని దోచుకోవు, విదేశాల్లో జనం సొమ్ముని దోచుకొని ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులు, అమ్మకాల మీద దోచుకొచ్చిన డబ్బుని దేశంలోకి తీసుకొచ్చి తమ సొంత దేశంలోని జనాలకి ఉపయోగపడతాయి.

ఇండియాలో మాత్రం ఇందుకు విరుద్దం. ఉత్పత్తి రంగమ్మీద, ఆయిల్ మీద, గనుల మీదా, నిర్మాణరంగం మీదా అంబానీ, అదానీ వంటి సంస్థలు గుత్తాధిపత్యంతో జనాల్ని దోచుకుని కోట్లకు పడగలెత్తాయన్న ఆరోపణలున్నాయి. ప్రజల సొమ్మంతా నగదు రద్దు చేసి అదానీకి అప్పజెప్పడం, కరోనాతో ప్రపంచమంతా అట్టుడుకుతోంటే సెంట్రల్‌విస్టా పేరుతో అతిపెద్ద దేశీయ నిర్మాణ కాంట్రాక్ట్ టాటాకు అప్పగించడం, విద్య, వైద్యంమ్మీద పెట్టాల్సిన ఖర్చుని ఆయుధాల తయారీ కోసమంటూ అనిల్అంబానీకి రాఫెల్ కాంట్రాక్టు, యుద్దవాహనాల కాంట్రాక్టు మహీంద్రాకీ అప్పగించడం ఈ దేశంలోనే జరుగుతోంది.
అసలు కరోనా తర్వాత ప్రపంచంలోని అన్ని కంపెనీల ఆదాయాలు పడిపోయాయి, కానీ ఈ దేశంలోని అంబానీ, అదానీ, టాటాలకు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఎలా పెరిగాయి? ఏం చేస్తే పెరిగాయి? ఎయిరిండియా వంటి ఆస్తుల్ని కట్టబెట్టినందుకా? బ్యాంకుల రుణాలు పారుబాకీలుగా ప్రకటించినందుకా?…
అభివృద్ది చెందిన దేశాల్లో ఇలాంటి వైషమ్యాలు, వివక్ష వ్యాపారంలో, ప్రభుత్వాల్లో ఉండవు.. విద్య, వైద్యం, నివాసం, జీవన ప్రమాణాల్లో వెనుకబడిన దేశమైన ఇండియా ఎందులోనూ పోటీ పడలేదు. ఏదో సినిమాలో అన్నట్లు ఇండియాని టేప్‌రికార్డులో పెట్టి 100సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే తప్ప ఆదేశాల స్థాయి చేరుకోలేదు.
మన దేశంలో టాటాలు, బిర్లాలు వాళ్లంతట వాళ్లు సంపాదించుకుంటే అభ్యంతరం చెప్పడానికి విమర్శించడానికి ఏం లేవు. కానీ కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వాలను మేనేజ్ చేసి తీసుకుంటే మాత్రం విమర్శలు పడక తప్పదు. ఇప్పుడు ఇదే భారత్ లోని కార్పొరేట్ కంపెనీలకు, మోడీ సర్కార్ పంచిపెడుతున్న ప్రభుత్వ సంస్థల వల్ల చెడ్డపేరు వస్తోంది. వాటిని తక్కువకు కొని కంపెనీలు లాభపడుతున్నాయా? మోడీ సర్కార్ అమ్మి వారికి లాభం చేస్తోందా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక ఉదాహరణ చూస్తే.. దేశంలోని ముంబై ఎయిర్ పోర్టును ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ మొగ్గు చూపింది. పారదర్శకంగా టెండర్లలో పాల్గొని దక్కించుకుంటే విమర్శించడానికి ఏం ఉండదు. కానీ మోడీ సర్కార్ ఇక్కడ చేసిన పనితో విమర్శలకు కారణమైంది. జీవీకే వారు టెండర్లో పాల్గొనగానే వారిపై కేంద్రదర్యాప్తు సంస్థలు దాడి చేశాయి. దీంతో వారు ముంబై ఎయిర్ పోర్టు డీల్ నుంచి వెనక్కి తగ్గారు. అది మోడీ సర్కార్ సన్నిహిత కార్పొరేట్ కంపెనీకి వెళ్లిందన్న విమర్శ ఉంది. ఇలా తమ వాళ్ల కోసం ఎదుటివాళ్లను ప్రభావితం చేయడం వల్లే దేశంలో ఆ కార్పొరేట్ కంపెనీలపై వ్యతిరేకత వస్తోంది. ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.
పాశ్చాత్య దేశాలకు, మనకు ఇక్కడే తేడా కొడుతోంది. అక్కడ అన్నిరకాలుగా అభివృద్ది చెందిన మనుషుల్లో, కొందరు ఎక్కువ అభివృద్ది చెందుతారు. కానీ ఇక్కడ దానికి భిన్నం. ఎంతోమందిని పేదరికంలోకి నెడితే గానీ ఒక వ్యక్తి గొప్పగా ఎదగలేడు. ఆ జనసమూహాల వనరులు కొల్లగొడితే తప్ప వాడు ముందుకుపోలేడు. ఇది ఇండియాతోపాటు అన్ని మూడోప్రపంచ దేశాలకు వర్తిస్తుంది.
టెస్లా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టయోటా, సోనీ, సామ్ సంగ్, బీఎండబ్ల్యూ, మెర్సిడేస్, లాంటి కంపెనీలన్నీ అయా రంగాలలో అత్యున్నత సాంకేతికత, నైపుణ్యం, శ్రమ, ఎదుగుదల వుంది. మరి అదానీ ఎదుగుదల వెనక ఏముంది?
కనీసం పిల్లల కోసం విమానాల బొమ్మలు కూడా తయారుచేయని కంపెనీకి రాఫెల్ విమానాల తయారీకి కాంట్రాక్ట్ అప్పగించడమంటే దాని అర్థం ఏమిటి?
బిల్ గేట్స్ సంపద వెనకాల మైక్రోసాఫ్ట్ వుంది, జెఫ్ బెజోస్ సంపద వెనకాల అమెజాన్ వుంది, టిం కుక్ వెనకాల ఆపిల్ కంపెనీ వుంది, ఎలన్ మస్క్ వెనకాల టెస్లా కంపెనీ వుంది.. మరి అదానీ వెనకాల ఏముంది?
చివరికి దోపిడీపెట్టుబడిదారుల్ని కూడా దేశభక్తి అని వెనకేసుకొచ్చే బరితెగింపు తనం మొదలైంది. దేశమంటే మూడు నాలుగు కంపెనీల విలువ పెరగడం కాదు. వందకోట్ల జనాభా కనీస జీవన స్తితి మెరుగుపడడం. అదే నిజమైన సంపద, గర్వకారణం. అది అర్థంకావాలంటే చాలా చదవాలి, ఆలోచన ఎదగాలి.