Homeజాతీయ వార్తలుMunugodu by-election Result: మునుగోడులో మునిగేది ఎవరో? తేలేది ఎవరో?

Munugodu by-election Result: మునుగోడులో మునిగేది ఎవరో? తేలేది ఎవరో?

Munugodu by-election Result : గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. నల్లగొండలోని అర్జాలబావిలోని గోదాంలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రక్రియ కూడా ప్రారంభమైంది.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు నేపథ్యంలో మునుగోడు ఫలితం అన్ని పార్టీలకూ కీలకం కానుంది. ఈ ఉప ఎన్నిక ఫలితం పైనే బిజెపి విస్తరణ ఆశలు పెట్టుకుంది. బిజెపి గెలిస్తేనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని ఉప ఎన్నికలకు ఈ ఫలితం ముడిపడి ఉంటుంది.. ఇప్పటికే జరిగిన సంప్రదింపుల్లో మరింత వేగం పెరిగే అవకాశం ఉంటుందని, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయి అని అంచనాలు ఉన్నాయి.. ఇక సానుభూతి పవనాలు తమను గట్టెక్కిస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అనంతరం రాజకీయాల్లోకి చేరి బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తమ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించారు. రాజకీయాల్లో చేరిక అనంతరం ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక ఇదే. అయితే బీఎస్పీ గెలవకపోయినా గెలుపు ఓటమిలను శాసించే స్థాయిలో దీని ప్రభావం ఉంటుందని సమాచారం. ఇక ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా బరిలో ఉన్నారు. ఆయన రాజకీయా కామెడీ వర్కవుట్ కాలేదు.

-ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుస్తానని అత్యధిక సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడించాయి. తాజాగా మిషన్ చాణక్య అనే ఎన్నికల సర్వే సంస్థ మాత్రం బిజెపికి అనుకూలంగా ఫలితం వస్తుందని చెప్పింది.. ఈ మేరకు ఎగ్జిట్ పోల్ వివరాలను శనివారం విడుదల చేసింది.. టిఆర్ఎస్ పై 1.78 శాతం స్వల్ప మెజారిటీతో కమలం పార్టీ విజయం సాధిస్తుందని ప్రకటించింది. బిజెపికి 40.16% దాకా ఓట్లు పోల్ అయ్యాయని, టిఆర్ఎస్కు 38.38% దాకా ఓట్లు వచ్చాయని తెలిపింది. ప్రధానంగా చౌటుప్పల్ అర్బన్, మునుగోడు, చండూరు అర్బన్, చండూరు రూరల్ లో బిజెపికి ఎక్కువ ఓట్లు పడ్డాయని పేర్కొంది.. ఇక గట్టుప్పల్, మరి కూడా ప్రాంతాల్లో మాత్రం టిఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. చౌటుప్పల్ అర్బన్ లో బిజెపికి 50.23% ఓట్లు, టిఆర్ఎస్ కు 33.66% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. మునుగోడులో బిజెపికి 42.41%, టిఆర్ఎస్కు 39.02%, చండూరు అర్బన్ లో బిజెపికి 44.81%, టిఆర్ఎస్ కు 36.07%, చండూరు రూరల్ లో బిజెపికి 41.71%, టిఆర్ఎస్కు 38.51% ఓట్లు పోల్ అయ్యాయని వివరించింది. ఇక మొత్తం చూస్తే బిజెపి 40.16%, టిఆర్ఎస్ పార్టీ 38.38%, కాంగ్రెస్ 14.93%, బీఎస్పీ 4.29%, ఇతరులు 1.90 % ఓట్లు సాధిస్తారని తెలిపింది.

-కారుదే గెలుపు?
మునుగోడులో విజయం అధికార టీఆర్ఎస్ దేనిని రాష్ట్ర, ఆపరేషన్ చాణక్య సంస్థలు వెల్లడించాయి. శనివారం తమ ఎగ్జిట్ పోల్ వివరాలను విడుదల చేశాయి.. తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో టిఆర్ఎస్ కు 42%, బిజెపికి 35% ఓట్లు వస్తాయని తెలిపాయి. టిఆర్ఎస్ 7% ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తాయని వెల్లడించాయి.. కాంగ్రెస్ కు 15%, బి ఎస్ పి కి 4%, ఇతరులకు 4% ఓట్లు వస్తాయని వెల్లడించింది. టిఆర్ఎస్ 9 నుంచి 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

-విజయోత్సవ ఏర్పాటల్లో టిఆర్ఎ స్, బిజెపి

మునుగోడు ఫలితం పై ఎవరి ధీమా వారిదే. మరి కొద్ది గంటల్లో ఫలితం వెల్లడి అవుతుండడంతో టిఆర్ఎస్, బిజెపి నాయకులు విజయ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అత్యధికంగా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని చెప్పగా, మరో రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం బిజెపి అభ్యర్థి గెలుస్తారని పేర్కొన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు విజయోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.. టిఆర్ఎస్ నేతలు నల్లగొండలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ ఫంక్షన్ హాల్లో సభకు ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం ఉదయం ఈ ఫంక్షన్ హాల్ కు చేరుకొని అక్కడ నుంచే కౌంటింగ్ తీరును, ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఫలితం వెలువడగానే మంత్రి జగదీష్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని చేరుకొని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయానికి వెళ్లేలా నేతలు ఏర్పాటు చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించిన వెంటనే టపాకాయల మోతలు డప్పు చప్పుల మోతలు, కార్యకర్తల నృత్యాల మధ్య పార్టీ కార్యాలయానికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థి అంతా కలిసి అక్కడికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక బిజెపి నాయకులు కూడా జిల్లా కేంద్రంలోని రెండు లాడ్జిల్లో రూములు తీసుకోవడంతో పాటు ఫంక్షన్ హాల్ ని కూడా బుక్ చేశారు. హైదరాబాదులోని సరూర్ నగర్ లో సైతం విజయోత్సవ ఏర్పాట్లు చేసుకున్నారు. రంగులు, టపాకాయలను తెచ్చిపెట్టారు. గత ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన గార్లపాటి జితేందర్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని కార్పొరేట్ కార్యాలయంలో బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు.

-నెల రోజుల్లో రూ. 37.38 కోట్ల మద్యం తాగారు

మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో గత నెల రోజుల్లో 37.38 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.. గత ఎడాది ఇదే నెలలో 28.23 కోట్ల రూపాయల మేర విక్రయాలు జరిగాయి. దీని ప్రకారం సుమారు 9 కోట్ల రూపాయల మేర అదనపు విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. ఒక్క చౌటుప్పల్ మండలంలోని 17.31 కోట్ల రూపాయల మేర మద్యం విక్రయాలు జరిగాయి. నాంపల్లి మండలంలో అత్యల్పంగా 3.8 కోట్ల రూపాయల విక్రయాలు జరిగాయి. పోలింగ్ చివరి మూడు రోజుల్లోనే విక్రయాలు జోరు అందుకున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version