Telangana BJP CM candidate : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా.. బీజేపీ మొదటి నుంచి బీసీ మంత్రాన్ని జపిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మిర్యాలగూడలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తాజాగా సీఎం అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే బీసీ నేత సీఎం అవుతారని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ సమీకరణలు మారిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించాయి. అగ్రవర్ణాలకే పెద్దపీట వేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. తాజాగా సీఎం కూడా బీసీ నేత అని ప్రకటించడంతో ఇటు బీజేపీలోనూ హాట్ డిస్కషన్‌కు తెరలేపింది. ప్రస్తుతం బీజేపీలో బలమైన బీసీ నేతలుగా కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు సీఎం అవుతారన్న చర్చ జరుగుతోంది.
మొదటి నుంచి బీసీ నినాదం..
బీజేపీ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ముందు నుంచే బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. కేంద్రంలో బీసీ ప్రధాని అయ్యారు. 20 మంది బీసీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని కమలం నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగానే.. తెలంగాణలో బీజేపీ బీసీ కార్డ్ ప్లే చేసింది. సూర్యాపేట బీజేపీ జనగర్జన వేదికగా తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. ఈ ప్రకటన ద్వారా బీసీలకు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు అమిత్‌షా బీసీ పాచిక వేశారు.
అందరి చూపు ఆ ముగ్గురి వైపు..
మిర్యాలగూడ సభలో అమిత్ షా చేసిన ప్రకటనతో తెలంగాణ పొలిటికల్ లీడర్స్‌తో పాటు.. రాష్ట్ర ప్రజల దృష్టి ఆ ముగ్గురి నేతలవైపే మళ్లింది. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న వారిలో ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉండగా, తర్వాత స్థానాల్లో బండి సంజయ్, డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి.
‘ఈటల’కు అపారమైన అనుభవం..
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నాటి టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఈటల రాజేందర్‌కు పరిపాలనా పరంగా ఎంతో అనుభవం ఉంది. 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరిన ఈటల రాజేందర్.. 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటిచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది. 2009 ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు పోటీ చేసిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 తరువాత కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పని చేశారు. అయితే, వివిధ కారణాల చేత ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం, ఆయన బీఆర్ఎస్ను వీడటం, బీజేపీలో చేరడం చకచకా జరిగిపోయాయి.
కేసీఆర్ ఓటమే లక్ష్యంగా..
కేసీఆర్‌పై ఆగ్రహంతో బీజేపీలో చేరిన ఈటల.. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. అంతేకాదు.. వచ్చే నెలలో జరుగన్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక బీజేపీలోనూ మంచి పట్టు సాధించారు ఈటల. ఆయనకు బీజేపీ అధిష్టానం.. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. అమిత్‌షా ప్రకటించినట్లు బీసీని సీఎం చేస్తే.. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు అయితే.. ఈటల వైపే అధిష్టానం మొగ్గు చూసే అవకాశం ఉంది.
పార్టీని పట్టాలెక్కించిన ‘బండి’..
ఇక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన బండి సంజయ్.. కరీంనగర్ కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి.. కరీంనగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే, ప్రతీసారి ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే, గత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ఏకంగా ఎంపీగా గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంపీగానే కాదు.. తన వాక్చాతుర్యంతో పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించిన బండి సంజయ్.. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తన వ్యూహాలు, దూకుడు, మాటల ధాటితో యావత్ తెలంగాణ సమాజాన్ని బీజేపీ వైపు ఆకర్షించేలా చేశారు. ఆయన అధ్యక్షతన ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ చేసేవారు. బండి సంజయ్ దూకుడు చూసి.. ఈసారి తెలంగాణలో బీజేపీదే అధికారం అన్నంత హైప్ క్రియేట్ అయ్యింది. ఆయన అధ్యక్షత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయాలతో బండి సంజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో బండి విజయవంతం అయ్యారు. బీజేపీ అంటే పట్టణానికే పరిమితం అన్న స్థితిని మార్చేశారు.
అనూహ్యంగా అధ్యక్షుడి మార్పు..
అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, గ్రూప్ రాజకీయాలు, తదితర కారణాల వల్ల బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది అధిష్టానం. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దీంతో బండి అభిమానులు, పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశకు లోనైంది. ప్రజలు కూడా నిరుత్సాహానికి లోనయ్యారు. సంజయ్ మార్పుతో పార్టీ గ్రాఫ్ కూడా క్రమంగా పడిపోతూ వచ్చింది. పరిస్థితిని గమనించిన అధిష్టానం బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే పదవి మారినా.. బండి సంజయ్ దూకుడు మాత్రం తగ్గలేదు. క్షేత్రస్థాయిలో ఆయన గుర్తింపు తగ్గలేదు. ఈ కారణంగానే.. ఇవాళ అమిత్ షా ప్రకటించిన బీసీ సీఎం క్యాండిడేట్ లిస్ట్‌లో సంజయ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.
సీనియర్ నాయకుడు లక్ష్మణ్..
బీజేపీ సీనియర్ నాయకుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన అధ్యక్షతనే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ స్థానాలను గెలుపొందింది. ఇది ఆయనకు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని సమాచారం. ఈ కారణంగానే ఆయన సీఎం అభ్యర్థిత్వంపై సందేహాలు ఉన్నాయి. అయితే సీనియారిటీకి, విధేయతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తే.. లక్ష్మణ్ పేరు కూడా చివరి నిమిషంలో సీఎం క్యాండిడేట్‌గా తెరపైకి రావొచ్చు అని తెలుస్తోంది.
ఓవరాల్ గా చూస్తే అమిత్ షా అన్న బీసీ సీఎం రేసులో బీజేపీ తరుఫున ప్రధానంగా అయితే ఈటల రాజేందర్ లేదంటే బండి సంజయ్ కు సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. అదీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే.. చూడాలి మరీ ఏం జరుగుతుందో..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Who is in the telangana bjp cm candidate race
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com