Pawan Kalyan: చేసేది ఒకరు.. చేయించేది ఒకరు.. విమర్శలు మాత్రం మరొకరిపై.. అసలు ఏంటీ పక్షపాత రాజకీయాలో అర్థం కావడం లేదు.. విశాఖ ఉక్కు రగలడానికి అసలు కారణం కేంద్రంలోని బీజేపీ సర్కార్. ప్రైవేటీకరణలో భాగంగా ఏపీ ప్రజలు, పార్టీలు ఎంత మొత్తుకుంటున్నా తగ్గేదేలే అన్నట్టుగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామంటూ స్పష్టం చేస్తోంది. ఎంత ఒత్తిడి చెప్పినా మాట వినడం లేదు.. స్వయంగా పార్లమెంట్ లో అడిగినా ప్రైవేటీకరిస్తామంటూ ఓపెన్ గా చెప్పేసింది. అధికార వైసీపీని, ప్రతిపక్షాల ఆందోళనను లైట్ తీసుకుంది. పట్టించుకోవడం లేదు.

విశాఖ ఉక్కు పోరాటం ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ దీనిపై ‘డిజిటల్’ ఉద్యమాన్ని రగిలించాడు. ఏపీలోని అధికార వైసీపీ ఎంపీలను, కీలక నేతలను ట్యాగ్ చేసి నిలదీసే పర్వాన్ని మొదలుపెట్టాడు. ట్విట్టర్ లో సహజంగానే పవన్ కళ్యాణ్ కు అభిమాన గణం ఎక్కువ. ట్విట్టర్ పులిగా పేరుగాంచిన పవన్ పిలుపునకు సోషల్ మీడియాలో బాగానే స్పందించారు. వైసీపీ నేతల వెంటపడుతున్నారు..
-పవన్ నే ప్రశ్నిస్తున్నారే?
అయితే సోషల్ మీడియాలో అందరూ పవన్ భక్తులే ఉండరు కదా.. వ్యతిరేకులు కూడా ఉంటారు. జగన్ అభిమానులు.. బీజేపీ అసమ్మతివాదులు కూడా ఉంటారు. అందుకే ట్విట్టర్ లో ఇప్పుడు ప్రశ్నించే పవన్ నే ప్రశ్నిస్తున్నారు. అసలు ‘విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నది ఎవరు? మీరు ప్రశ్నిస్తున్నది’ ఎవరిని అని కాస్త గట్టిగానే పవన్ ను ట్యాగ్ చేస్తూ ఇప్పుడు ట్విట్టర్ లో కడిగేస్తున్నారట.. అయితే పవన్ అభిమానులతో పోల్చితే ఈ అసమ్మతివాదులు తక్కువగా ఉండడంతో వారి కామెంట్లు, ప్రశ్నలు పెద్దగా పేలడం లేదు. అయినా కానీ తరిచిచూస్తే మాత్రం పవన్ కు ఈ కామెంట్లు కాకపుట్టడం ఖాయం.
-వైసీపీ సైతం పోరాడింది పవన్..
విశాఖ ఉక్కు కోసం కేవలం పవన్ మాత్రమే బట్టలు చింపుకోలేదు. ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సైతం కాస్త గట్టిగానే పోరాడింది. కానీ వారి పోరాటంకంటే అమావాస్య పౌర్ణమికి వచ్చే పవన్ పోరాటమే కాస్త ఫోకస్ అయ్యింది. నిజానికి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అధికార వైసీపీ ఖండించింది. విశాఖ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు స్వయంగా రోడ్డెక్కారు. సీఎం జగన్ దీనిపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు దీన్ని నిరసించాడు. టీడీపీ నేతలు ఆందోళన చేశారు. కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన జనసేనాని విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపారు. అప్పట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ముందు.. తాజాగా మంగళగిరిలో పోరాటం చేశాడు. ఇప్పుడు వైసీపీ ఎంపీలను టార్గెట్ చేసి ‘డిజిటల్ క్యాంపెయిన్’ మొదలుపెట్టాడు. ఓవైపు ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని మరో వైపు ఆ పార్టీ వ్యతిరేకించిన విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడమేంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. బీజేపీతో పవన్ విడిపోతున్నారంటే అదీ స్పష్టత లేదు. అయినా ఎవరి లోపాయికారి రాజకీయాలు వారివి..
-ప్రైవేటీకరిస్తున్న బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్?
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చాలా ఆలస్యంగా రంగంలోకి దిగినా వారికి మద్దతుగా బహిరంగ సభలో.. తాజాగా మంగళగిరిలో పవన్ పోరాటం చేశాడు. ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్న కేంద్రాన్ని.. బీజేపీ సర్కార్ ను పవన్ అస్సలు ప్రశ్నించలేదు. కానీ ఏపీ ప్రభుత్వం.. అధికార వైసీపీపై మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడడమే ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. విశాఖ ఉక్కుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందని పవన్ విమర్శించారు. ఏపీలో బంద్ చేసి ఢిల్లీలో మద్దతిస్తారని.. వైసీపీ సర్కార్ దీనికి సహకరిస్తోందని పవన్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వానిదే తప్పు అని తేల్చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలని వారం రోజులు డెడ్ లైన్ పెట్టేశారు.. తాజాగా ‘డిజిటల్ క్యాంపెయిన్’లో ట్విట్టర్ లో ట్యాగ్ లు చేస్తూ వైసీపీ నేతలను టార్గెట్ చేశాడు.విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం ఆపమన్నా కూడా వినకుండా తనకిష్టం వచ్చినట్టుగా చేస్తోంది. కానీ కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ వెనకేసుకు వచ్చినట్టుగా మాట్లాడడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న కేంద్రాన్ని అనకుండా వైసీపీ ప్రభుత్వాన్నే పూర్తిగా దోషిగా నిలబట్టేలా పవన్ మాట్లాడుతుండడం విశేషం.
ఇలా పవన్ కళ్యాణ్ ‘విశాఖ ఉక్కు పోరాటం’ ఫక్తు వైసీపీ సర్కార్ టార్గెట్ గానే సాగింది. ఉక్కును ప్రైవేటీకరిస్తున్న కేంద్రాన్ని ఏమీ అనక.. ప్రతిపక్షాన్ని పొగిడేసి.. అసలు దీంతో సంబంధం లేని వైసీపీ సర్కార్ ను ఆడిపోసుకోవడం కనిపించింది.