BJP- Janasena Alliance: ఏపీలో 2014 కాంబినేషన్ రిపీట్ చేయాలని జనసేనాని పవన్ ప్రయత్నాలు ప్రారంభించారు. 2014లో త్యాగం చేసి ఎన్డీఏకు మద్దతు పలికారు. 2019లో ప్రయోగం చేసి ఓటమి చవిచూశారు. 2024 ఎన్నికలను మాత్రం పక్కా వ్యూహంతో ఎదుర్కొని అనుకున్నది సాధించాలని చూస్తున్నారు. అందుకుగాను ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అయితే చంద్రబాబు కూడా అదే ప్లాన్ తో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ వ్యూహం అమలుచేయగల అవకాశం పవన్ కు ఉన్నట్టు చంద్రబాబుకు లేదు. ఎందుకంటే తన చర్యల కారణంగా ఏపీలో బీజేపీని దెబ్బతీశారు. తానూ దెబ్బతిన్నారు. తిరిగి బీజేపీ మద్దతు కూడగట్టడానికి వీలులేని పరిస్థితిని చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్నారు. అందుకే తమ కూటమిలోకి బీజేపీని తెచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం జనసేన వరకూ ఓకే చెబుతున్నా టీడీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీడీపీ, వైసీపీలకు సమదూరం పాటించాలని రాజకీయ తీర్మానం చేసింది.

అయితే వైసీపీ విముక్త ఏపీ కోసం పవన్ గట్టి పోరాటం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను అధికారం నుంచి దూరం చేయాలన్న కసితో ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీతో కలిసి నడిస్తేనే అది సాధ్యమని బలంగా నమ్ముతున్నారు. అదే పరిస్థితిలో బీజేపీ కానీ కలిసివస్తే మార్గం సుగమమని భావిస్తున్నారు. కానీ బీజేపీ రూట్లోకి రావడం లేదు. జనసేన వరకూ ఓకే చెబుతోంది. పోనీ జనసేన, బీజేపీ కూటమిగా వెళ్లి టీడీపీ ఒంటరి పోరుతో వైసీపీకి రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతోంది. అందుకే పవన్ వీలైనంత వరకూ బీజేపీని ఒప్పించి.. నప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు వైసీపీ మతపరంగా చేస్తున్న రాజకీయాలను బీజేపీకి గుర్తుచేస్తున్నారు.
మరో 30 సంవత్సరాలు అధికారం మనదేనంటూ జగన్ తరచూ చెబుతుంటారు. ఆయన పక్కా వ్యూహంతోనే ఈ మాట అనగలుగుతున్నారు. 30 ఏళ్ల అధికారం మాట అటుంచి.. అన్నేళ్లు రాజకీయం చేయాలన్నదే జగన్ అభిమతం. అందుకు ఆయన ఎత్తుకున్న అజెండా హిందూ వ్యతిరేక భావన. దానిని ఎక్కడా బయటపడకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, ఇతర రాజకీయ నిర్ణయాలతో హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చుకుంటూనే శాశ్వత ఓటు బ్యాంక్ ను మతపరంగా పొందడానికి గ్రౌండ్ లెవల్ లో ప్లాన్ ను ఆచరణలో పెట్టారు. ప్రధాన క్రైస్తవ సంఘాలను, ముస్లిం ఓటు బ్యాంక్ ను పదిలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే అంశాన్ని పవన్ బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇప్పుడు కానీ జగన్ ను పవర్ నుంచి దూరం చేయకుంటే సమీప భవిష్యత్ లో కొరకరాని కొయ్యగా మిగులుతారని.. హిందూ వ్యతిరేకతతో రాజకీయ విధ్వంసాలకు తెగపడతారని బీజేపీ పెద్దలకు గుర్తుచేసినట్టు సమాచారం.

అయితే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానం చేసినా పవన్ లైట్ తీసుకున్నట్టు సమాచారం. బీజేపీ పెద్దలు ఎలక్షన్ ముందే తమ యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకుంటారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. పైగా హైకమాండ్ పెద్దలు ఇంతవరకూ పొత్తులపైఎటువంటి ప్రతికూల ప్రకటనలు చేయలేదు. ఈ నేపథ్యంలో పవన్ కొన్నిరకాల వ్యూహాలను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అటు ప్రధాని మోదీని కలిసిన సమయంలో సైతం పవన్ ఇవే అంశాలను ప్రస్తావించినట్టు తెలిసింది. ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వచ్చాయి. పవన్ బాటలోకి బీజేపీ హైకమాండ్ రావాల్సిన తప్పని పరిస్థితి ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.