Udayanidhi Stalin : ఉదయనిది ” సనాతన వ్యాఖ్యలు” అసలు లక్ష్యం వేరే.. అది పక్కాగా పక్కదారి పట్టించే ప్లానింగ్!

అట్ట హాసపు జీవితాలలో ఆరితేరిన స్టాలిన్ కుటుంబం గురించి రకరకాల కథలు తమిళనాడులో వ్యాప్తిలో ఉన్నాయి. అయినప్పటికీ ఆ జనం వారిని గెలిపిస్తుండడం విశేషం.

Written By: Bhaskar, Updated On : September 13, 2023 10:32 pm

Udayanidhi Stalin

Follow us on

Udayanidhi Stalin : సనాతన ధర్మం కుష్టు, డెంగ్యూ, మలేరియా వంటిది. దాన్ని నిర్మూలించాలి. అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి..ఇవి కదా మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు. చివరికి ఈ వ్యాఖ్యల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించాల్సి వచ్చింది. అంతటి ప్రభావం చూపించాయి మరి. టీవీలలో డిబేట్లు, న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్.. దీనిపైనే చర్చ మొదలైంది. ఫలితంగా అసలు వ్యవహారాలు మొత్తం పక్కకు పోయాయి. వాస్తవానికి డీఎంకే ఆశించింది కూడా ఇదే. ఎందుకంటే స్టాలిన్ తన ప్రభుత్వ ముఖ్యుల అక్రమాలపై చర్చను విజయవంతంగా తన కొడుకు ద్వారా దారి మళ్ళించాడు. కొడుకును ముందు పెట్టి కథ మొత్తం నడిపిస్తున్నాడు.

తమిళనాడులో కూడా ప్రతిపక్షం ఏఐడీఎంకే బాగా బలహీన పడిపోయింది. మరో ప్రధాన ప్రతిపక్షం బలం పుంజుకోలేకపోయింది. బిజెపికి అక్కడ తగినంత కార్యవర్గం లేదు. కాంగ్రెస్ తన గూటిలోనే ఉండిపోవడం, లెఫ్ట్ కూడా తన కూటమిలోనే ఉండటం స్టాలిన్ ప్రభుత్వానికి బాగా కలిసి వస్తోంది. ఇంకేముంది అధికార డిఎంకె పార్టీ పెద్దలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి అన్ని దారుల్లోనూ తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఈ అరాచకాన్ని చూసి అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి పి.టి.ఆర్.పి తొలుత స్టాలిన్ వేటు వేశాడు. అతడి స్థానంలో తను చెప్పినట్టు తల ఊపే తంగం తెన్నెరుసును తెచ్చి పెట్టుకున్నాడు. ఇది జరుగుతుండగానే సెంథిల్ బాలాజీ దొరికిపోయాడు. పలు అక్రమాల్లో అతని పాత్ర ఉందంటూ ఈడి కొరడా తీసి చెల్లుమనిపించింది. జైలుకు పంపించింది. అయినప్పటికీ అతని మంత్రి పదవి అది పదిలంగానే ఉంది. ఎందుకంటే బాలాజీ చూస్తున్న శాఖ డిఎంకె పార్టీకి కీలకమైన ఆదాయ వనరు కాబట్టి. అందు గురించే అతడిని క్యాబినెట్లో కొనసాగిస్తూ స్టాలిన్ కాపాడుకుంటున్నాడు. దీనిపై దేశవ్యాప్తంగా స్టాలిన్ మీద విమర్శలు వస్తున్నప్పటికీ.. వినిపించుకోవడం లేదు.

ఇక విద్యాశాఖలో మంత్రి పొన్ముడి అడ్డగోలుగా సంపాదించాడు. ఈడి దాడులు చేయడంతో అతని బొక్కలు బోలెడు కనపడ్డాయి. అయితే కావాలని కేంద్ర ప్రభుత్వం తమ మీద కక్ష కట్టిందని డీఎంకే శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. తాజాగా ఈడి రాష్ట్రంలో ఇసుక మాఫియా పై విరుచుకుపడింది. దాదాపు 40 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసింది. ఈ ఇసుక యవారంలో మొన్న సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేసిన ఉదయనిది స్టాలిన్ పాత్ర ఉందని తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే అవి బయటికి రాకుండా స్టాలిన్ ముందుగానే అడ్డు కట్ట వేశాడు. కానీ తమిళనాడు నీటి వనరుల శాఖ మంత్రి, డీఎంకే జనరల్ సెక్రెటరీ దురై మురుగన్ పాత్రను ఈడీ తవ్వుతోంది. గతంలో మురుగన్ కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. అయితే ఈ ఇసుక మాఫియా నుంచి ఎన్నికల కోసం డీఎంకే నిధుల సేకరణ జరుపుతోందని ఈడి సందేహం.

తమిళనాడులోని పలు నదీ పరివాహక ప్రాంతాల్లో (15 జిల్లాల్లో) ఇసుక మాఫియా అక్రమాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా తిరుచ్చి, కరూరు, వెల్లూరు, పదుకొట్టయి జిల్లాలోని 40 ప్రాంతాల్లో సాగిన దాడుల్లో ఇసుక మాఫియా ప్రముఖులు రామచంద్రన్, దుండిగల్ రత్నం, కరికాలన్ తదితరుల అక్రమాలలో ఈడి తవ్వితీసింది. వీరందరిలోనూ ప్రముఖుడు రామచంద్రన్. అతడి ఆఫీసులోనూ, ఈడి దాడులు జరిగాయి. భారీగా పన్ను ఎగవేత ఆధారాలు కూడా ఈడి పట్టుకుంది. ఈ దాడి లో 15 బృందాలు ఉన్నట్టు సమాచారం.

సనాతన ధర్మం మీద వీరలెవల్లో వ్యాఖ్యలు చేసిన ఉదయం తండ్రి స్టాలిన్ గవర్నమెంట్లో ముగ్గురు మంత్రులపై ఈడి కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఒక మంత్రి జైల్లో ఉన్నారు. అవినీతి అనేది తారాస్థాయికి చేరింది. అయినప్పటికీ ప్రజల్లో చర్చను, అవినీతిపై వారి దృష్టిని మళ్లించేందుకు సనాతన ధర్మ నిర్మూలన అనే వ్యాఖ్యలు ఉదయనిది చేశాడు. అస్తవానికి డీఎంకేకు మొదటి నుంచి ఇదే అలవాటు. జనం కూడా అవినీతిని మర్చిపోయి ఉదయనిధి వ్యాఖ్యల గురించే చర్చించుకుంటున్నారు. ఖరీదైన దుస్తులు, వాచీలు, కార్లు, విలాసాలు, అట్ట హాసపు జీవితాలలో ఆరితేరిన స్టాలిన్ కుటుంబం గురించి రకరకాల కథలు తమిళనాడులో వ్యాప్తిలో ఉన్నాయి. అయినప్పటికీ ఆ జనం వారిని గెలిపిస్తుండడం విశేషం.