Pawan Kalyan : మాట తప్పం, మడమ తిప్పం అంటారు. తడుముకోకుండా అబద్ధాలు చెబుతారు. మద్య నిషేధం అంటారు. ఏరులై పారిస్తారు. జాబ్ క్యాలెండర్ అంటారు. క్యాలెండర్లు మారినా ఒక్క జాబూ వదలరు. ప్రాజెక్టులు నిర్మిస్తామంటారు. కానీ కూల్చుకుంటూ వెళ్తారు. అమరావతే రాజధాని అన్నారు. ఆ తర్వాత భ్రమరావతి అన్నారు. ఒక్కటే మాట , ఒకటే బాట అంటారు కానీ మూడు రాజధానులంటారు. ఇచ్చిన ఒక్క హామీ వంద శాతం నెరవేర్చిందీ లేదు. ఎదురు దాడే అస్త్రంగా, బట్ట కాల్చి మీదెయ్యడమే బాటగా ఎంచుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన అధికారంలోకి రావాలంటే ఎలాంటి హామీలు ఇవ్వాలి ? ఎలా ముందుకెళ్లాలి ? అన్న ప్రశ్నలు జనసేన ముందుకొచ్చాయి.

పవన్ ను ప్రజలు విశ్వసిస్తున్నారు. పవన్ బాటను సమర్థిస్తున్నారు. జగన్ పాలనా వైఫల్యాల పై పవన్ పోరాటానికి అండగా నిలబడుతున్నారు. జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తీ స్థాయిలో అమలు చేయలేదు. చాలా హామీలు అరకొరగా నెరవేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఎలాంటి హామీలు ఇస్తారు ? అధికారంలోకి వస్తే వాటి అమలుకు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు ? అన్న ప్రశ్నలు జనసేనాని ముందున్నాయి. వైసీపీ హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమైనందున.. వైసీపీకి భిన్నంగా హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడ ప్రజామోదం లభించేలా ఉండాలి. ఎన్నికల ముందే వాటికి ప్రజల్లో విశ్వసనీయత పెరగాలి.
జగన్ గతంలో 45 ఏళ్లకే బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఫించన్లు ఇస్తామన్నారు. పెద్ద ఎత్తన గ్రామాల్లో వాల్ రైటింగ్స్ రాయించి ప్రచారం చేసుకున్నారు. జగన్ ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. నెలనెలా ఫించన్లు వస్తాయని ఆశించారు. దీంతో జనం గంపగుత్తగా ఓటేశారు. కానీ జగన్ తన హామీని మరిచిపోయారు. కేవలం వృద్ధాప్య పించన్లు మాత్రమే షరతులతో ఇస్తున్నారు. ఇలాంటి హామీలు పవన్ ఇచ్చే ముందు అమలు సాధ్యమా ? కాదా ? అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇలాంటి హామీలు రూపొందించే సమయంలో జాగ్రత్త వహించాలి.
మద్య నిషేధం పై తమ వైఖరి ఎలా ఉండనుందో ప్రజలకు వివరించాలి. వైసీపి మద్య నిషేధం పేరుతో ధరలు పెంచి, నాణ్యత లేని మద్యాన్ని విక్రయిస్తోంది. ఫలితంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఒకవైపు అమ్మ ఒడి ఇచ్చి.. నాన్న బుడ్డి ద్వార డబ్బు ప్రభుత్వం లాగేసుకుంటోందని టీడీపీ విమర్శిస్తోంది. ఇలాంటి హామీలు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే జాబ్ క్యాలెండర్ కూడ అంతే. సచివాలయ ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగమూ కొత్తగా ఇవ్వలేదు. ఉద్యోగులకు నెలనెలా జీతాలు సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్ పై యువత ఎంతో ఆశతో ఉంది కానీ వైసీపీ ఆ హామీని నెరవేర్చలేక పోయింది. దీని పై జనసేనాని స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
అమరావతి, పోలవరం, పరిశ్రమలు, రోడ్లు, సంక్షేమ పథకాలు ఇలా వైసీపీ అన్నింటిలోనూ విఫలమైంది. రైతు విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తోంది. రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి అంశం పై పవన్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ టీడీపీతో పొత్తుతో వెళ్లినా.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వెల్లడించాలి. కూటమి పార్టీతో కూడ చెప్పించగలగాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. అధికారంలోకి రావడానికి సహకరిస్తారు.