Homeఎంటర్టైన్మెంట్Taraka Ratna : చెట్టంత కొడుకే పోయాక ఈ కులం ఏంటి? తారకరత్న మరణం ఏం...

Taraka Ratna : చెట్టంత కొడుకే పోయాక ఈ కులం ఏంటి? తారకరత్న మరణం ఏం నేర్పింది?

Taraka Ratna : ఘనమైన వంశం, విశ్వవిఖ్యాత వారసత్వం.. అయినప్పటికీ తారకరత్నకు ఏం దక్కింది? ఏం మిగిలింది? అతని జీవితం కూడా ఒక సినిమా కథ లాంటిదే. అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి ఇచ్చిన మాట తప్పలేడు. అందుకే ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు. సంఘీ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కుప్పం వచ్చేదాకా ఆమెతోనే ఉన్నాడు.. భర్తగా ప్రేమను పంచాడు.. ముగ్గురు పిల్లల్ని ప్రేమగా చూసుకున్నాడు. కానీ అదే ప్రేమను తన తల్లిదండ్రుల నుంచి పొందలేకపోయాడు.. తన కెరియర్ లో గుర్తు పెట్టుకునే సినిమాలు లేకపోవచ్చు గాక… సినీ జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఉండవచ్చు గాక.. కానీ మనిషి మంచోడు.. ఆ బ్లడ్ బ్రీడ్ వారసత్వంలో ఇమడనోడు. స్థూలంగా చెప్పాలంటే నిండుగా ప్రేమ గుణం జీర్ణించుకున్న మనిషి. ఇప్పుడు ఆ ప్రేమ దూరం కావడంతో అతడి ప్రియురాలు కమ్ సతీమణి అలేఖ్య రెడ్డి కుమిలిపోతోంది.

-పాపం అలేఖ్య

ఎంతటి బాధను గుండెలో దాచుకుందో, ఎంతటి నొప్పిని పంటి కింద అదిమి పెడుతోందో… తన భర్త మరణం గురించి, అతడు ప్రేమించిన విధానం గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో పెట్టి ఉద్వేగంగా రాస్కొచ్చింది..” కలిసి పోరాడాం. కలిసి నిలబడ్డాం.. కారులో నిద్రపోయిన క్షణం నుంచి ఇప్పటిదాకా ఇద్దరం చాలా దూరం ప్రయాణించాం. నువ్వు ఒక పోరాట యోధుడివి. నన్ను నువ్వు ప్రేమించినట్టు ఇంకెవరు ప్రేమించలేరు” అంటూ కన్నీటి పర్యంతమైంది.

-చేసిన తప్పేంటి?

అసలు తారకరత్న చేసిన తప్పేంటి? ఓ అమ్మాయిని ప్రేమించాడు.. పెళ్ళి చేసుకున్నాడు. కాకపోతే ఆమె కమ్మ కులస్తురాలు కాదు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి.. ఇదే అతడు చేసిన తప్పు, ఆ తప్పును అతడి తల్లిదండ్రులు క్షమించలేకపోయారు. వాస్తవానికి తారకరత్న తండ్రి గుణం పూర్తి అబ్జర్డ్. జూనియర్ ఎన్టీఆర్ ను ఎక్కడ సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడు అంటారేమోనని అప్పటికప్పుడు తారకరత్నతో 9 సినిమాలు ప్రారంభింప చేసాడు.. కొబ్బరికాయ కొట్టిన మాత్రాన సినిమా రిలీజ్ కాదు. అందులో మూడు మాత్రమే ప్రేక్షకులకు కనిపించాయి.. ఈలోగా ఆ జూనియర్ ఎన్టీఆర్ సభ్య సమాజానికి హరికృష్ణ “ఆమోదిత” కొడుకు అయ్యాడు. అదేంటో కాని తారకరత్న ఎదగలేకపోయాడు.. ఎక్కడికక్కడే వెలిసిపోయాడు. దీనికి తోడు ఆలేఖ్యా రెడ్డి తో ప్రేమ, కుటుంబం తో చికాకులు.. పాపం తారకరత్న ఎదగలేకపోయాడు.

-తండ్రి ఇలా ఉంటాడా?

కొడుకు మరణించాక ఏ తండ్రి మనసైనా కరుగుతుంది. తారకరత్న తండ్రి మనసు మాత్రం కరగలేదు. సరికదా కనీసం తన కొడుకు పిల్లల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతడి భార్యను పలకరించలేదు. ఓ తండ్రి మరీ ఇంత కఠినంగా ఉంటాడా? ఇలా ఉంటే అతడిని తండ్రి అనాలా? తనకు ఉన్న ఆస్తులతో తారకరత్న కెరియర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. ప్రసాద్‌ ల్యాబ్‌లో దుమ్ము పట్టి ఉన్న సినిమాలను విడుదల చేయవచ్చు. కానీ అలా చేయలేదు. జస్ట్‌ లైట్‌ తీసుకున్నాడు. అక్కడి దాకా ఎందుకు మోహన కృష్ణ తన కూతురు పెళ్లి చేస్తుంటే తారకరత్నకు కనీసం ఆహ్వానం పంపలేదు. చివరకు బెంగళూరు నుంచి మృతదేహాన్ని తారకరత్న సొంతిల్లు మోకిలాకు మాత్రమే తీసుకెళ్లారు. అందుకే బతికి ఉన్నప్పుడు తారకరత్న తన తల్లిదండ్రుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. బాలయ్య గురించి మాత్రం పాజిటివ్‌గా చెప్పేవాడు. తారకరత్న ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి అంత్యక్రియల దాకే ఆ బాలయ్యే ఉన్నాడు. తర్వాత ఆ పిల్లల బాధ్యత తను తీసుకుంటా అన్నాడు. తండ్రి మృతదేహం ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్నప్పుడు తారకరత్న పిల్లలు ‘తాతయ్యా’ అంటూ బాలయ్య దగ్గరకే వచ్చారు. హత్తుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు. బాలయ్య కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పుడు బాలయ్యే ఆ కుటుంబానికి అన్నీ.. అసలు మోహన కృష్ణను తండ్రి అనొచ్చా? అసలు తండ్రి అనే వాడు ఇలా ఉంటాడా?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version