RRR: ఆర్ఆర్ఆర్.. రాజమౌళి మూడేళ్ల కష్టం ఫలించి ఎట్టకేలకు కరోనా కల్లోలాన్ని అధిగమించి.. టికెట్ల రేట్లను పెంచుకొని తెరపైకి వచ్చింది. తొలి రెండు రోజులు సినిమాకు ప్రేక్షకాదరణ విపరీతంగా వచ్చింది. అయితే ఫైనల్ అవుట్ పుట్ వచ్చాక సినిమా చూసిన జూనియర్ ఎన్టీఆర్ హతాషుడైనట్టు తెలుస్తోంది. తన ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రత్యేక షో చూసిన ఎన్టీఆర్ థియేటర్ నుంచి కోపంగా వెళ్లిపోవడం మీడియా కంటపడిందంటున్నారు. అనంతరం రాంచరణ్, రాజమౌళి చిత్రం యూనిట్ సభ్యులకు ఇచ్చిన పార్టీలోనూ ఎన్టీఆర్ కనిపించకపోవడం చూసి అంతా అనుమాన పడుతున్నారు. ఎన్టీఆర్ ఫీలయ్యాడని అందుకే రావడం లేదన్న టాక్ నడుస్తోంది.

ఆర్ఆర్ఆర్ ను అందరూ చూశారు. సగటు ప్రేక్షకుడి నుంచి క్రిటిక్ వరకూ ఎన్టీఆర్ కు అన్యాయం జరిగిందన్న ఆవేదన అందరిలోనూ కనిపించింది. ఇద్దరు పెద్ద హీరోలను పెట్టి మల్టీస్టారర్ అన్న రాజమౌళి.. పాత్ర చిత్రణ విషయంలో రాంచరణ్ దే పైచేయిగా కనిపించింది. ఎన్టీఆర్ ఏదశలోనే మెయిన్ రోల్ అనడానికి అవకాశం లేకుండా కనిపించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఇంటర్వెల్ ముందు అడవి జంతువులతో భీకరంగా పోరాడిన కొమురంభీంను చివరకు రాంచరణ్ పట్టుకొని బ్రిటీష్ వారికి అప్పగించడం.. రాంచరణ్ చేతిలో ఎన్టీఆర్ దెబ్బలు తినడాన్ని ఎవరూ ఆక్షేపించడం లేదు. ఎందుకంటే నటనలో.. అనుభవంలో అన్నింట్లోనూ రాంచరణ్ కంటే ఎన్టీఆర్ ఒక ఆకు ఎక్కువే చదివాడు. కానీ ఇక్కడే రాంచరణ్ దే పైచేయిగా రాజమౌళి చూపించారు.
ఇక డ్యాన్స్ అయితే ఎన్టీఆర్ ను మించిన వేగవంతమైన నటుడు టాలీవుడ్ లో లేడు. అలాంటి ఎన్టీఆర్ కు డ్యాన్స్ రానట్టు.. బ్రిటీషర్ల చేతిలో అవమానించాడు. పోనీ ఇదంతా కథలో భాగం.. గోండు బిడ్డ అని అనుకున్నా.. కూడా ఏ విషయంలోనూ రాంచరణ్ కంటే ఎన్టీఆర్ ను ముందు నిలపలేదు రాజమౌళి. కావాలని రాంచరణ్ ను డ్యాన్స్ పోటీలో ఓడిపోయేలా చేశాడు. ప్రతి విషయంలో రాంచరణ్ యే తొలి ప్రాధాన్యత దక్కింది.
ఇక ఎన్టీఆర్ కు ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. కేవలం ఆదిలాబాద్ అడవుల నుంచి ఒక గిరిజన బిడ్డను రక్షించుకునేందుకే వస్తాడు. కానీ రాంచరణ్ కు ఆయన తండ్రి అజయ్ దేవ్ గణ్ ఫ్యాష్ బ్యాక్.. మధ్యలో ఆలియా భట్ సీత ఫ్యాష్ బ్యాక్.. ఒక ఊరికి ఇచ్చిన మాట.. ఇలా మొత్తం సినిమాలో రాంచరణ్ గురించే ఉంది. ఎన్టీఆర్ ది కేవలం సెకండ్ హీరో క్యారెక్టర్ లాగానే కనిపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక క్లైమాక్స్ అయితే మరీ ఘోరమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కక్కలేక మింగలేక వాపోతున్నారు… టాలీవుడ్ లో అగ్రహీరో అయిన ఎన్టీఆర్ తనకంటే జూనియర్ అయిన రాంచరణ్ ను భుజాలపై ఫైట్ ఆసాంతం మోయడాన్ని వాళ్లు జీర్ణించుకోవడం లేదు. ఆధునిక యుద్ధ విద్యల్లో రాంచరణ్ ను ఆరితేరిన యోధుడిగా చూపిస్తూ.. అదే సమయంలో గిరిజనుడైన ఏమీ తెలియని అమాయకపు భీమ్ గా ఎన్టీఆర్ ను చిత్రం మొత్తం రాజమౌళి ఫోకస్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం రాంచరణ్ చుట్టునే తిరిగింది. ఆయన తండ్రి అజయ్ దేవ్ గణ్ ఆశయం.. రాంచరణ్ ప్రేమ కట్టుబాటు.. ఊరికిచ్చిన మాట.. చివరకు ఎన్టీఆర్ సైతం రాంచరణ్ కోరికను తీర్చేందుకు చివరకు రంగంలోకి దిగడం చూస్తే ఈ సినిమా మొత్తం రాంచరణ్ దేననడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం సెకండ్ హీరోగానే ఎన్టీఆర్ ను ప్రేక్షకులు చూసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ఎన్టీఆర్ అభిమానుల కడుపు మంటకు కారణమైంది. ఆ మంటల్లో కొన్ని థియేటర్లు తగులబడడానికి ఆజ్యం పోసింది.
రాజమౌళి ఎప్పుడు పర్ ఫెక్షనిస్ట్ అంటుంటారు. కానీ ఇద్దరు మల్టీస్టారర్ లలో ఒకరికి సినిమా మొత్తం స్కోప్ ఇచ్చి మరొకరికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా (ఎన్టీఆర్ ను) చూపించడంలో ఔచిత్యం ఏంటో ఇప్పటికీ అర్థం కాదు. కొందరు క్రిటిక్స్ నిజంగానే సినిమాలోని లూప్ హోల్స్ ను వెతికారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా సెకండాఫ్ లో కాస్త గతి తప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ లాంటి భీకర హీరోను అలా ప్రజల ముందు స్తంభానికి కట్టేసి కొట్టడాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. చివర్లో రాంచరణ్ చెబితేనే బ్రిటీష్ విలన్ ను ఎన్టీఆర్ చంపేస్తాడు. ఇలా సినిమా మొత్తం రాంచరణ్ ను సూపర్ పవర్ ఫుల్ గా.. ఎన్టీఆర్ ను అమాయకపు సెకండ్ రోల్ గానే రాజమౌళి చూపించారని సినిమా చూసిన వాళ్లు ఎవరైనా ఇట్టే చెప్పేస్తున్నారు. మరి ఈ మల్టీస్టారర్ ప్రయోగం తర్వాత అయినా రాజమౌళి మున్ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్నది వేచిచూడాలి.