Telangana Election Results 2023: ఇద్దరు సీఎం లను ఓడించిన ఒకే ఒక్కడు ఈ కామారెడ్డి ధీరుడు

కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో అందరికీ ఆసక్తి పెరిగింది. పైగా ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి కూడా పోటీ చేయడంతో హైపు మరింత పెరిగింది. అయితే మీడియా కూడా వీరిద్దరిని మాత్రమే హైలెట్ చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 3, 2023 5:48 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెను సంచలనానికి దారితీసాయి. అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామని అనుకున్న భారత రాష్ట్ర సమితి కలలను కలలు చేశాయి. 3.0 లోడెడ్ అని ఫోటో పెట్టిన కేటీఆర్ కు గర్వభంగాన్ని మిగిల్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… కామారెడ్డి స్థానంలో పోటీ చేసిన కేసీఆర్ ఓడిపోవడం మరొక ఎత్తు. తన రాజకీయ ఆరంగేట్రంలో మదన్మోహన్ చేతిలో ఓడిపోయిన కేసీఆర్ ను.. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీకి చెందిన వెంకటరమణారెడ్డి ఓడించారు.

5000 ఓట్ల మెజారిటీతో..

కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో అందరికీ ఆసక్తి పెరిగింది. పైగా ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి కూడా పోటీ చేయడంతో హైపు మరింత పెరిగింది. అయితే మీడియా కూడా వీరిద్దరిని మాత్రమే హైలెట్ చేసింది. కాకపోతే స్థానికుడైన వెంకటరమణారెడ్డిని విస్మరించింది. అయినప్పటికీ కూడా వెంకటరమణారెడ్డి తన పని తాను చేసుకుంటూ పోయారు. స్థానికులతో సత్సంబంధాలు కలిగి ఉండి వారి తలలో తలలో నాలుక అయ్యారు. కెసిఆర్ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. అటు రేవంత్ రెడ్డి ని, ఇటు కేసీఆర్ను ఒక మాట కూడా అనకుండా తన ప్రచారం తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. అదే వెంకటరమణారెడ్డికి కలిసి వచ్చింది. ఆయనను విజయం సాధించేలా చేసింది . కెసిఆర్ పై ఏకంగా 5000 ఓట్ల మెజారిటీతో వెంకటరమణారెడ్డి సాధించిన విజయం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే కామారెడ్డి లో కూడా కేసీఆర్ విజయ పట్ల ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. పైగా అటు రేవంత్ రెడ్డి విజయాన్ని సాధించాలని ఆయన సోదరుడు కొండల్ రెడ్డి కామారెడ్డి లోనే తీష్ట వేశారు. ఈ ఇద్దరు బలమైన శక్తులను ఎదిరించుకుంటూ వెంకటరమణ రెడ్డి సాధించిన విజయం అంత ఆషామాసిది కాదు.

మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ

వాస్తవానికి కామారెడ్డి అనేది భారత రాష్ట్ర సమితికి సిట్టింగ్ స్థానం. అయితే ఇక్కడ నుంచి పోటీ చేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరడంతో కెసిఆర్ రంగంలోకి దిగారు. అటు గజ్వేల్ లోనూ పోటీలోకి దిగారు. రెండు స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీలకు తన సత్తా ఏమిటో చూపించాలి అనుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కామారెడ్డిలో పోటీకి దిగారు. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా వ్యక్తిగత విమర్శలకే పరిమితమైపోయారు. కాకపోతే కామారెడ్డి టౌన్ అభివృద్ధికి సంబంధించి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ఇక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ మాస్టర్ ప్లాన్ వల్ల వారి భూములు ఆ రోడ్ల నిర్మాణంలోకి వెళ్లిపోతున్నాయి. అయితే ఆ రైతులతో కలిసి వెంకటరమణారెడ్డి ఆందోళనకు దిగారు. ఆ మాస్టర్ ప్లాన్ రద్దయ్యేంతవరకు విశ్రమించకుండా ముందడుగు వేశారు. ఫలితంగా ఆ ప్లాన్ నుంచి వెనక్కి మల్లుతున్నట్టు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రకటించింది. ఇది కామారెడ్డిలో కెసిఆర్ పోటీ చేస్తున్నందువల్లే ఆ నిర్ణయం తీసుకుందని.. తర్వాత అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని వెంకటరమణారెడ్డి ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. దీనిని అక్కడి రైతులు కూడా నమ్మడంతో ఆయన వైపు మొగ్గు చూపించారు. చివరికి ఎన్నికల్లో కమలం పువ్వు కు ఓటు వేసి వెంకటరమణారెడ్డిని గెలిపించారు. ఈ గెలుపుతో వెంకటరమణ రెడ్డి ఒకసారిగా జాతీయస్థాయి వార్తల్లోకి ఎక్కారు. అటు కేసీఆర్ ను, ఇటు రేవంత్ రెడ్డిని ఓడించి బలమైన నాయకుడిగా పేరు గడించారు.