Pawan Varahi Y atra : పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్.. సినిమా రంగంలో ఆయన ఒక పెద్ద నటుడు. వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆయన ఒక చిన్న పార్టీకి అధ్యక్షుడు. పార్టీ ప్రారంభించి దశాబ్దమైన చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం రాలేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినా.. ప్రస్తుతం ఆయన కూడా వైసీపీతో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ విముక్త రాష్ట్రం చేయాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. సినీ అభిమానాన్నే పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. 2024లో వైసీపీ ఓటమే లక్ష్యంగా తాజాగా వారాహి యాత్ర మొదలు పెట్టారు. ఈ యాత్ర లక్ష్యం ఏమిటి దీని వెనక వ్యూహాలేంటి అంటే పవన్ చాలా లెక్కలు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ పార్టీగా..
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ బలంగా ఉన్నాయి. ఈ రెండూ గ్రాస్ రూట్ లెవెల్ వరకూ పాతుకుపోయాయి. మూడో ఫోర్స్‌గా, రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటోంది జనసే. అయితే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించే శక్తి ఆ పార్టీకి లేదు. విపక్ష టీడీపీ కూడా ఒంటిగా వైసీపీని ఓడించలేమని భావిస్తోంది. ఈ క్రమంలో విడివిడిగా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జనసేన, టీడీపీ భావిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేనాని వచ్చే ఎన్నికల్లో టీడీపీని కూడా తమతో కలుపుకుపోవాలని భావిస్తున్నారు.
కింగ్ మేకర్ కావాలనే..
ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ పాలన నచ్చని పవన్ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలో తాను ఒంటరిగా రాజకీయ రణక్షేత్రంలోకి దిగితే పెద్దగా ఫలితం ఉండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ కావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీతోపాటు టీడీపీని కలుపుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని, ఎన్నికల తర్వాత కింగ్ మేకర్ కావొచ్చని జనసేనాని భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని క్లారిటీ ఇచ్చారు.
బల ప్రదర్శన కోసమే యాత్ర..
అధికారంలోకి రామనే క్లారిటీ పవన్‌కు స్పష్టంగా ఉంది. తాను ముఖ్యమంత్రిని కానని కూడా తెలుసు అయినా జనసేనాని ఏపీలో వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కూడా ఓ లెక్క ఉంది అంటున్నారు విశ్లేషకులు వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలం ఏంటో చూపించాలన్న లక్ష్యంతోనే పవన్ వారాహి రథం ఎన్నికనట్లు భావిస్తున్నారు. చంద్రబాబుకు తన బలం ఏమిటో చూపించడం కోసమే ఈ యాత్రకు శ్రీకారం చుట్టారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ తనను జూనియర్ పార్టనర్ కింద జమ కట్టకుండా సీట్లు పెద్ద ఎత్తున ఇవ్వాలన్న డిమాండ్ కోసమే ఆయన వారాహి యాత్ర ప్రారంభించారన్న ప్రచారం ఉంది.
ఉమ్మడి జిల్లాలో పెరిగిన బలం..
ఇక గోదావరి జిల్లాల్లో జనసేన కు బలం పెరిగింది. పవన్‌కు, జనసేన కు హార్డ్ కోర్ రీజియన్‌గా ఉమ్మడి గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ కూడ గట్టిగానే ఉంది. ఆ పార్టీకి గోదావరి జిల్లాల్లో పటిష్టమైన క్యాడర్, లీడర్స్ ఉన్నారు. ఇక పొత్తుల్లో భాగంగా జనసేన–టీడీపీఒక అవగాహనకు వస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకు25 లోపు సీట్లు ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఈ యాత్ర ద్వారా తన పార్టీ బలం చూపి కనీసం 50 సీట్లు అడగాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే యాత్రను కూడా తనకు పట్టున్న ప్రాంతాల్లోనే చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
50 సీట్లలో గెలిస్తే..
వచ్చే ఎన్నికల్లో కనీసం 50 ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లాలని జనసేనాని భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడవచ్చని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై గళమెత్తొచ్చని పవన్ లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నిల్లో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతామని పవన్ ఆలోచనగా ఉంది. ఈ లక్ష్యంతోనే జనసేన ప్రస్తుతం ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దశల వారీగా వారాహి రధయాత్రకు వచ్చే స్పందన చూశాక టీడీపీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.