Homeఅంతర్జాతీయంVaccination : మోడీ ఘనత.. భారత చరిత్ర.. 100 కోట్ల టీకాల మైలురాయి దాటిన దేశం!

Vaccination : మోడీ ఘనత.. భారత చరిత్ర.. 100 కోట్ల టీకాల మైలురాయి దాటిన దేశం!

Vaccination : కరోనా సెకండ్ వేవ్ భారత్ పై చూపిన ప్రభావం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. సరిగ్గా ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు మరోసారి విశ్వం మనగురించి మాట్లాడుకుంటోంది. అప్పుడు అల్లకల్లోలం గురించి చర్చిస్తే.. ఇప్పుడు అద్భుత ఘనత గురించి కీర్తిస్తోంది. అప్పుడు లోపాలను ఎత్తి చూపితే.. ఇప్పుడు కార్యదక్షతను ఎలుగెత్తి చాటుతోంది. అభివృద్ధి చెందిన జాబితాలో చోటు దక్కించుకున్న దేశాలుగా చెప్పునేవి కూడా కరోనా వ్యాక్సినేషన్ రేసులో ఎక్కడో వెనకాల ఉండిపోతే.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో భారత్ అగ్రభాగానికి చేరుకుంది. అత్యంత వేగంగా వంద కోట్ల డోసుల వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందించి సగర్వంగా కీర్తి పతాకను ఎగరేసింది.

పోగొట్టుకున్న చోటనే సాధించుకోవాలని అంటారు. ఈ నానుడి భారత దేశానికి సరిగ్గా సరిపోతుంది. కరోనా సెకండ్ వేవ్ లో కేంద్రం ముందస్తు సన్నద్దతపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయంగా సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ.. ఇప్పుడు అదే అంతర్జాతీయ సమాజం.. వ్యాక్సినేషన్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రష్యా వంటి దేశాలు కూడా వ్యాక్సినేషన్లో వెనుక పడిపోగా.. ఇండియా మాత్రం శరవేగంగా.. వందకోట్ల డోసుల మైలురాయిని చేరుకొని అబ్బురపరిచింది.

కరోనా.. వ్యాక్సిన్‌ పంపిణీలో దేశం సాధించిన ఘనతను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. ప్రజలను రక్షించడంతోపాటు వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు మీరు చేస్తోన్న ప్రయత్నాలకు అభినందనలు అంటూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయెసస్‌ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత్ లో ఈ ఏడాది జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అప్పటికే దేశంపై సెకండ్ వేవ్ పంజా విసరడం.. వ్యాక్సిన్ డోసులు కావాల్సినన్ని ఉత్పత్తి కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. కొవీషీల్డ్ ను తయారు చేసే.. సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ.. బహిరంగంగానే పరిస్థితిని, నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఈ పరిస్తితుల్లో.. భారత దేశంలో వ్యాక్సినేషన్ సంపూర్ణంగా జరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో? అనే ఆందోళన వ్యక్తమైంది. ఈ భయాలు నిజమవుతాయా అన్నట్టుగా.. వ్యాక్సినేషన్ నెమ్మదిగానే సాగింది.

కానీ.. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని రీతిలో వేగం పుంజుకుంది. వ్యాక్సిన్ కేంద్రాలకు రెండు మూడు దఫాలుగా వెళ్ళి వట్టి చేతులతో తిరిగివచ్చే రోజుల నుంచి.. ఇప్పుడు ఇంటి వద్దకే ఆశా కార్యకర్తలు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవడానికి పిలుచుకెళ్లే రోజు వచ్చింది. కేవలం ఆరు నెలల వ్యవధిలో జరిగిన ప్రగతి ఇది. అది ఎంతగా అంటే.. చైనా తరువాత 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను అధిగమించిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది. చూస్తుండగానే.. వందకోట్ల డోసుల మైలురాయిని భారత్ చేరుకోవడం నిజంగా అనితర సాధ్యమైన ఘనత. అనన్య సామాన్యమైన చరిత అని చెప్పడంలో సందేహమే లేదు.

కరోనా మహమ్మారిపై పోరులో.. ఈ చారిత్రక ఘట్టానికి భారత్ చేరుకోవడంలో ప్రధాని మోడీ చూపించిన చొరవను ఎంత కీర్తించినా తక్కువే అవుతుంది. విమర్శలు ఎదురైన చోటనే ప్రశంసలు కురిపించే స్థాయికి చేరడం అసామాన్యమైన విషయం. మన ప్రధాని మోడి దాన్ని సాధించి చూపించారు. ఈ చారిత్రాత్మకమైన రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని.. ‘అక్టోబర్ 21, 2021 ఈ రోజు చరిత్రలో నమోదైంది. భారతదేశం 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను దాటింది. ఈ విజయం భారతదేశానిది, భారత్‌లోని ప్రతి పౌరునిది’అని పేర్కొన్నారు.

ఇదే వేగాన్ని కొనసాగిస్తూ.. దేశం మొత్తానికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశం భారత్ నిలవాలని ఆశిద్దాం. భారతీయుల ఆరోగ్యం పదిలంగా ఉంచడంతోపాటు.. దేశ కీర్తిని విశ్వ వినువీధుల్లో రెపరెపలాడించాలని కోరుకుందాం.

  • భారత్ 100 కోట్ల మైలురాయిని చేరుకుందిలా..
  • జనవరి 16 : టీకా పంపిణీ ప్రారంభం
  • ఫిబ్రవరి 19 : కోటి డోసుల పంపిణీ పూర్తి
  • ఏప్రిల్ 11 : 10 కోట్ల డోసుల పంపిణీ పూర్తి
  • జూన్ 12 : 25 కోట్లు డోసుల పంపిణీ పూర్తి
  • ఆగస్టు 6 : 50 కోట్లు డోసుల పంపిణీ పూర్తి
  • సెప్టెంబర్ 13 : 75 కోట్లు డోసుల పంపిణీ పూర్తి
  • అక్టోబర్ 21 : 100 కోట్లు డోసుల పంపిణీ పూర్తి
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular