MP Aravind: ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్ చేసి చుక్కలు చూపించిన అధికార టీఆర్ఎస్.. ఇప్పుడు అంతే దూకుడుగా వ్యవహరించే మరో ఎంపీ ధర్మపురి అరవింద్ పై పడింది. తాజాగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు తెగబడ్డారు. ఏకంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం నూత్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళుతుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

దీంతో భగ్గుమన్న బీజేపీ శ్రేణులు.. టీఆర్ఎస్ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్ లో బీజేపీ నేతలు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.
తనపై దాడికి దిగిన టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు బీజేపీ కార్యకర్తలను హత్య చేసేందుకు టిఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. సుమారు 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమకు అడ్డు తగిలారని.. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్లు కత్తులతో సిద్ధం అయ్యారని ఆరోపించారు. ఇంతమంది టిఆర్ ఎస్ కార్యకర్తలు రోడ్ల పైకి వస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. పోలీసులు అమ్ముడు పోయారని విమర్శించారు. గులాబీ రౌడీ లకు పోలీసుల మద్దతు ఉందని ఆరోపించారు.
పోలీసుల తీరుపై ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేస్తానని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. పోలీసులే దగ్గరుండి తమ వాహనాలపై దాడి చేయించారని అరవింద్ ఆరోపించారు.సీపీ, ఏసీపీలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. తమ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళుతానని చెప్పారు.
హౌస్ అరెస్ట్ లు బీజేపీ నేతల కేనా.. నియోజక వర్గం లో ఎక్కడైనా పర్యటిస్తానని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ ఘటన తనపై హత్యాయత్నంగా పేర్కొంటూ పోలీస్ కమిషనర్ కు ఎంపీ అరవింద్ ఫిర్యాదు చేశారు.