
Revanth Reddy sit investigation : తెలంగాణ రాజ్యంలో ‘న్యాయం’ అనేది నాలుగు పాదాలపై నడవడం లేదని అర్థమవుతోంది. ఎందుకంటే నేరం చేసిన వారిని వదిలేసి ప్రశ్నించిన వారిని విచారిస్తున్న దౌర్భగ్యపు పరిస్థితులున్నాయి. తెలంగాణ నిరుద్యోగుల కలల చిదిమేసిన ‘టీఎస్.పీఎస్సీ ’ కుంభకోణం చేసిన వారిని వదిలేసి.. దీనిపై ప్రశ్నించిన వారికి నోటీసులు ఇచ్చి విచారించడం దారుణమని అంటున్నారు. ఈ విషయంలో ప్రశ్నించిన రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ఈరోజు విచారించడం చూస్తే నిజంగానే తెలంగాణలో గొంతెత్తితే ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటాయా? అన్న అనుమానాలు కలుగకమానవు. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్న ఈ పాలకుల తీరు చూస్తే భయం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.
-టీఎస్.పీఎస్సీ కుంభకోణంలో నిందితులెవరు?
టీఎస్ పీఎస్సీలో ఉన్నతోద్యోగి వద్ద పనిచేస్తున్న ప్రవీణ్ అనే సెక్రటరీ దొంగతనంగా ఈ ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనితోపాటు ఒక ఉపాధ్యాయురాలు, టీఎస్పీఎస్సీ లో సాంకేతిక సహకారం అందిస్తున్న ఒక ఉద్యోగి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు విచారించగా.. ప్రశ్నపత్రాల లీకేజీ చేశానని ఒప్పుకున్నాడు. దీని వెనుకాల మరికొందరు వ్యక్తులు ఉన్నట్లుగా పేర్కొన్నాడు. ఈ మేరకు వీరిలో ఏడుగురు నిందితులను గుర్తించినట్లు, వారిని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణలో ఒక్కో పేపర్ కు రూ.10లక్షలు చేతులు మారిననట్లు సమాచారం.
-కేసీఆర్ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో బీఆర్‌ఎస్‌ను పెద్ద ఎత్తున డ్యామేజీ జరుగుతోంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ వ్యవహారం తెలంగాణ ముఖ్యమైన మంత్రి, కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్‌కు చుట్టుకుంటోంది. కేటీఆర్ పై ప్రతిపక్ష నేతలు రేవంత్, బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత అక్టోబర్ నుంచి టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏడు పరీక్షల్లో నాలుగు పరీక్షలను రద్దు చేయడంతో నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రజల్లో గులాబీ పార్టీపై ఇప్పటికే వ్యతిరేకత ఉంది. తాజా వ్యవహారాలు ఎన్నికల నాటికి మరింత డ్యామేజీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే టీఎస్.పీఎస్పీపై ప్రశ్నించిన పాపానికి ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. తాజాగా రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు. అసలు నిందితులను వదిలేసి ఇలా ప్రశ్నించిన పాపానికి రేవంత్ రెడ్డిని విచారించడం ఎంత వరకు కరెక్ట్ అని తెలంగాణ మేధావులు ప్రశ్నిస్తున్నారు.
-రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులతో మరింత డ్యామేజీ..
టీఎస్.పీఎస్సీలో అసలు దోషులను వదిలేసి.. వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ప్రతిపక్ష నేతలను ఈ కేసులో నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. విపక్షాలకు చెక్ పెట్టాలని కేటీఆర్ సిట్‌తో రేవంత్‌కు నోటీసులు ఇప్పించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే రేవంత్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిట్ నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దీంతో కేటీఆర్‌కే డ్యామేజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఐటీ మంత్రిగా కేటీఆర్‌కు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ హోదాలో ఉన్న జనార్దన్‌రెడ్డికి నోటీసులు ఇవ్వాల్సిన సిట్ విపక్షాలను టార్గెట్ చేయడంపై ప్రజల్లో కూడా వ్యతిరేక భావన వ్యక్తమవుతోంది. తెలంగాణ సర్కారు కనుసన్నల్లోనే సిట్ పనిచేస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాక్షేత్రంలో తిరుగుతూ సంచలన ఆరోపణలు చేస్తూ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి కి సిట్ ద్వారా నోటీసులు జారీ చేసి వారి నోటికి తాళం వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పనుల వల్ల అసలు దోషులను వదిలి ప్రతిపక్షాలపై పడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామం బీఆర్‌ఎస్‌కే నష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.
-నేరం చేసిందెవరు? విచారించేది ఎవరిని?
రేవంత్ రెడ్డి నేరం చేసినవాడు కాదు.. కేవలం ఇందులోని వాస్తవాలను బయటపెట్టిన ఒక ప్రతిపక్ష నేత. ఆయనను విచారించడం ఏందని చాలా మంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఈ పరిణామం మింగుడపడనిదిగా మారింది. ఎన్నికల సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి యువత ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని, ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రతిపక్ష నేతల వేధింపులతో బెడిసికొట్టినట్టైంది. ఈ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ సర్కార్ రేవంత్ ను టార్గెట్ చేయడం వారి బూమరాంగ్ అయ్యిందని.. వారికే మైనస్ అయ్యిందని అంటున్నారు. అసలు నేరం చేసిన వారిని వదిలేసి రేవంత్ రెడ్డిని పట్టుకున్న ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ప్రజల మెప్పు పొందడం లేదు. యువతకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన నమ్మకం పోతోందని వారంతా స్పష్టం చేస్తున్నారు.