T20 World Cup Final : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 మెన్స్ వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఈ టోర్నీ ఆద్యంతం అంచనాలకు అందకుండా సాగింది. ఊహించని మలుపులతో క్రికెట్ అభిమానులకు పసందైన ఆటను పరిచయం చేసింది.. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా నాకౌట్ దశకే పరిమితమైంది. ఇంటికి వెళుతుంది అనుకున్న పాకిస్తాన్ మాత్రం అనూహ్యంగా టైటిల్ పోరులో నిలిచింది. 1992 మ్యాజిక్ పునరావృతం చేయాలనుకుంటుంది. అటు బట్లర్ సేన కలిసికట్టుగా కదం తొక్కుతూ ప్రత్యర్థికి చెక్ పెట్టాలనుకుంటుంది. సూపర్ బౌలింగ్ కు, పటిష్ట బ్యాటింగ్ కు మధ్య జరిగే ఈ సమరంలో పై చేయి ఎవరు సాధిస్తారు అనేది కొద్ది గంటల్లో తేలిపోతుంది. ఇకపోతే ఇందుకోసం వరుణ దేవుడు కరుణించాలి. ఎందుకంటే ఫైనల్ జరిగే మెల్ బోర్న్ లో వర్షం ముప్పు ఉంది.

-చెరోసారి గెలుచుకున్నాయి
టి20 మెన్స్ వరల్డ్ కప్ ను 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లాండ్ గెలుచుకున్నాయి.. ఇప్పుడు ఎవరు గెలుచుకున్నా రెండోసారి సాధించినట్టు అవుతుంది.. సెమీస్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టును 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.. అటు పాకిస్తాన్ కూడా కివీస్ జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ప్రారంభంలో రెండు వరుస ఓటమితో పాకిస్తాన్ పని అయిపోయినట్టేనని అంతా భావించారు.. అయితే నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించడం పాకిస్తాన్ జట్టుకు వరంలా మారింది. అదే ఉత్సాహంతో వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను ఓడించి తుది పోరుకు చేరుకుంది. అటు భారత్ కూడా ఫైనల్ పోరులో లేకపోవడంతో ఇలాంటి ఒత్తిడి లేకుండా చెలరేగే అవకాశం ఉందని క్రికెట్ విశేషములు చెబుతున్నారు.
-బాగా ఆడారు
ఇది జట్ల ఓపెనర్లు సెమీస్ మ్యాచ్లో అద్భుతంగా ఆడారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే మ్యాచ్ అభిమానులకు కనుల విందు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.. అయితే టి20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. మొత్తంగా చూస్తే ఈ ఫార్మాట్లో బట్లర్ సేన 18 వర్సెస్ 9 (పాకిస్తాన్) గెలుపు ఆధిక్యంతో కొనసాగుతోంది.. అయితే ఈ రెండు జట్లు పసికూనలైన ఐర్లాండ్, జింబాబ్వే చేతిలో ఓడిపోవడం గమనార్హం.
-బౌలింగే ఆయుధం
పాకిస్తాన్ యువ బౌలర్ షాహిన్షా ఆఫ్రిది తన చివరి మూడు మ్యాచ్ల్లో 9 వికెట్లతో ఊపు మీద ఉన్నాడు. వీటిలో ఏ మ్యాచ్ లోనో అతను 30 పరుగులకు మించి ఇవ్వలేదు. ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ 10 వికెట్లతో సత్తా చాటాడు. నసీంషా కూడా కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.. మరో పేసర్ హరీష్ రౌఫ్ ఆరంభంలో వికెట్లను తీయగలుగుతున్నాడు.. ఓపెనర్లు బాబర్ ఆజాం, రిజ్వాన్ ఫామ్ లోకి రావడం ఈ జట్టుకు లాభించే విషయం. ఈ ఓపెనింగ్ జోడి ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమంగా కొనసాగుతోంది. ఇక మూడో నెంబర్ లో 21 ఏళ్ల మహమ్మద్ హరీస్ తొలి పది ఓవర్ లో వేగంగా ఆడుతూ ఒత్తిడి తగ్గిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో షాదాబ్, ఇఫ్తికార్, షాన్ మసూద్ ఇప్పటికే అర్థ సెంచరీలతో ఫామ్ కనబరిచారు.. ఈ మ్యాచ్ లో వీరంతా కలిసికట్టుగా ఆడితే ఇంగ్లాండ్ కు ఇబ్బందులు తప్పవు.
-మాములు బ్యాటింగ్ కాదు
భారత్ తో జరిగిన సెమిస్ మ్యాచ్లో ఓపెనర్లు హేల్స్, బట్లర్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే ఎంతటి లక్ష్యాన్ని చేదిస్తారేమో అనిపించింది. టోర్నీ ప్రారంభంలో ఈ జోడి నుంచి మెరుపులు లేకపోయినప్పటికీ సరైన సమయంలో బ్యాట్లు ఝళిపించింది. ఇక ఆదివారం పాకిస్తాన్ బౌలర్ లను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే. ఆల్ రౌండర్లు స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ కూడా మెరుపు వేగంతో ఆడేవారే.. 9 నెంబర్ వరకు బ్యాట్స్మెన్ ఉండటం వీరికి కలిసి వచ్చే అవకాశం. ఇక బౌలింగ్ లోనూ ఇంగ్లాండు జట్టు పర్వాలేదు అనిపిస్తోంది. ఫేసర్ సామ్ కర్రాన్ ఆఫ్గనిస్తాన్ జట్టుపై ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.. నిలకడగా రాణిస్తున్న ఫేసర్ మార్క్ ఉడ్ మ్యాచ్ లోనూ ఆడేది కష్టమే. స్పిన్నర్ రషీద్ మాత్రం కేవలం రెండు వికెట్ల తీయగలిగాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు మిడిల్ ఆర్డర్ కు ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు. పాకిస్తాన్ బౌలర్లు త్వరగా ఓపెనర్ల వికెట్లు తీస్తే మిడిల్ ఆర్డర్ సత్తా తెలిసిపోతుంది.
-నేడు మెల్బోర్న్ లో వాతావరణం ఎలా ఉందంటే?
మ్యాచ్ జరిగే మెల్బోర్న్ లో ఆదివారం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ ఎడతెరిపిలేని వర్షం కురిసింది.. దీంతో మ్యాచ్ ను రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా వేసే అవకాశం ఉంది.. ఒకవేళ అదే జరిగితే సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది.. మరోవైపు నిర్ణీత సమయంలో వర్షం తగ్గకుండా ఉంటే మ్యాచ్ కోసం మరో రెండు గంటలు అదనంగా కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఫైనల్ మ్యాచ్లో ఫలితం తేలేందుకు కనీసం 10 ఓవర్ల ఆట సాగినా సరిపోతుంది.. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
-తుదిజట్ల అంచనా ఇది
పాకిస్తాన్: రిజ్వాన్, బాబర్ అజం ( కెప్టెన్) , హరీస్, మసూద్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, జూనియర్ వసీం షహీన్ షా, నసీంషా, రౌఫ్.
ఇంగ్లాండ్: బట్లర్ ( కెప్టెన్), హేల్స్, సాల్ట్, స్టోక్స్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, జోర్డాన్, అదిల్ రషీద్.