
Somu Veerraju: గత ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయానికి చాలా కారణాలున్నాయి. అన్నివర్గాలను టార్గెట్ చేస్తూ మేనిఫెస్టో రూపొందించడం ఒక కారణమైతే.. ఒక చాన్స్ అన్న నినాదం జగన్ కు కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో పెద్దగా హామీల జోలికి వెళ్లకున్నా.. 2019లో మాత్రం నవరత్నాలతో పాటు చాలారకాలుగా హామీలిచ్చారు. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ దారిపొడవునా ప్రజలు అడిగిందే తడవుగా హామీలిచ్చారు. కానీ ఇప్పుడు ఏ ఒక్కటీ అమలవుతున్న దాఖలాలు లేవు. నవరత్నాల్లో పథకాలు తప్పించి మరే ఇతర సంక్షేమమూ లేదు. అటునవరత్నాల్లో మద్యనిషేధం వంటి వాటిని తూట్లు పొడిచారు. అయితే మేజర్ బాధిత వర్గం ఒకటుంది. అదే అగ్రిగోల్డ్ ఖాతాదారులు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ నష్టాన్ని షటిల్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ కు .. నాలుగేళ్లవుతున్నా ఆ విషయం గుర్తులేదన్నట్టుంది. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు అగ్రిగోల్డ్ అంశాన్ని బీజేపీ తన నెత్తిన ఎత్తుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు న్యాయంచేయాలని నిర్ణయించుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇంతవరకు ఎంతమంది సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ హామీ ఇచ్చి మూడున్నర ఏళ్లు దాటినా ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. దీంతో ఏపీలో అగ్రిగోల్డ్ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో బాధితులకు హామీ ఇచ్చి లబ్ధి పొందిన జగన్ ఇప్పుడు న్యాయం చేయడం అనివార్యంగా మారింది. అదే జరిగితే బీజేపీకి పొలిటికల్ అడ్వాంటేజ్.

రాష్ట్రంలో లక్షలాది మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఉన్నారు. వారంతా యాజమాన్యం చేతిలో దారుణ వంచనకు గురయ్యారు. అటు పాలసీలను ఆకర్షించిన ఏజెంట్లు పదుల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారదరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన వారితో జగన్ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు నిట్ట నిలువునా ముంచారు. టీడీపీ హయాంలో ఆస్తులన్నీ జప్తు చేయించి వేలం వేయించే ప్రక్రియ చేపట్టారు. కానీ ఆస్తులన్నీ టీడీపీ నేతలు కొట్టేస్తున్నారని వేలాన్ని ఆపేయించారు. జీ సంస్థ ముందుకు వస్తే ఆరోపణలు చేయించి ఆ కంపెనీ వెనక్కి వెళ్లేలా చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి బడ్జెట్‌లో పదిహేను వందల కోట్లు కేటాయించి అందరికీ న్యాయం చేస్తానన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించారు కానీ.. రూపాయి విడుదల చేయలేదు. టీడీపీ ప్రభుత్వం ఆస్తులు వేలం వేసి ఉంచిన డబ్బులను ఏడాదిన్నర తర్వాత రూ. 250 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు.
అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ అంశాన్ని బీజేపీ నెత్తినెత్తుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీపై ఆరోపణలున్న నేపథ్యంలో ఆ పార్టీ ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేకపోతోంది. వామపక్షాలు సైతం సైలెంట్ గా ఉన్నాయి. ఈ తరుణంలో సోము వీర్రాజు వ్యూహాత్మకంగా అగ్రిగోల్డ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. గట్టి పోరాటానికి వ్యూహం రూపొందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదికానీ వర్కవుట్ అయితే అగ్రిగోల్డ్ బాధితులు బీజేపీ గూటికి చేరే అవకాశముందని.. ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.