శ్రావణ మాసం పండుగలు, శుభ కార్యాలతో పాటు వ్రతాలు జరుపుకునే కాలం అనే సంగతి తెలిసిందే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని(Varalakshmi Vratham) జరుపుకుంటారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు వ్రతాన్ని జరుపుకోవడం కుదరని వాళ్లు తర్వాత వారాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.
లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక కాగా లక్ష్మీదేవిని వరలక్ష్మి అని కూడా పిలుస్తారు. అత్తలు కొత్త కోడళ్లతో ఈ వ్రతం చేయించి కోడలికి పూజలతో పాటు పూజల ప్రాముఖ్యత తెలిసేలా చేస్తారు. కొత్త నగతో శ్రావణ వరలక్ష్మి పూజను చేయాల్సి ఉంటుంది. వరలక్ష్మీ దేవి కథలో చారుమతి అందరినీ కలుపుకుని పోయే తత్వాన్ని కలిగి ఉండటంతో పాటు భక్తిశ్రద్ధలతో అత్తామామలను సేవించుకున్నారు.
ఇందులో ఆమె తాను మాత్రమే వ్రతం చేసుకోవాలని భావించకుండా ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకున్నారు. వర్ణ భేదం లేదని సామూహికంగా వ్రతం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని చారుమతి నమ్ముతారు. చారుమతిలో ఉండే లక్షణాలలో కొన్ని లక్షణాలను అలవరచుకున్నా వ్రతం చేసిన ఫలితాన్ని పూర్తిగా పొందే అవకాశం అయితే ఉంటుంది.
పూజ అయ్యాక వాయనం ఇచ్చే సమయంలో “ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం” అని చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో వాయం పుచ్చుకునేదెవరని అడిగితే నేనే మంగళ గౌరీ దేవినని, నేనే సాక్షాత్తు శుక్రవార వరలక్ష్మీదేవినని చెప్పిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల సాటి వ్యక్తిని ఆరాధ్య దైవంగా భావించినట్లు అవుతుంది.