YCP Candidates : ఏపీ సీఎం జగన్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన మార్కు చూపిస్తున్నారు. మొత్తం 200 సీట్లలో 100 వరకు బీసీలకే కేటాయించినట్లు చెబుతున్నారు. సామాజిక సమీకరణలను పెద్దపీట వేస్తున్నారు. చాలామంది పెద్ద నేతలను పక్కనపెట్టి మరి సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారు. అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.
టిక్కెట్లు దక్కించుకున్న వారిలో టిప్పర్ డ్రైవర్, ఉపాధి వేతనదారుడు, సామాన్య రైతు ఉండడం విశేషం. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అభ్యర్థిగా ఈర లక్కప్ప పేరును జగన్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి పై వ్యతిరేకత ఉండడంతో టికెట్ నిరాకరించారు. లక్కప్పను అభ్యర్థిగా ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్కప్ప ఉపాధి కూలీగా పని చేశారు. ప్రభుత్వం నిర్మించిన పక్కా గృహంలోనే ఉంటున్నారు. గతంలో కాంగ్రెస్ మద్దతుదారుడుగా ఉండి సర్పంచ్ గా గెలిచారు. వైసీపీలో చేరి మండల స్థాయికి ఎదిగారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఛాన్స్ దక్కించుకున్నారు.
అనంతపురం జిల్లాలో సింగనమల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అక్కడ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి జగన్ అవకాశం ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ నిరాకరించారు. ఆమె స్థానంలో వీరాంజనేయులకు ఎంపిక చేశారు. వీరాంజనేయులు తండ్రి గతంలో సర్పంచ్ గా పని చేశారు. వైసీపీలో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. జీవనోపాధికి గతంలో టిప్పర్ డ్రైవర్ గా పనిచేశారు. కృష్ణాజిల్లా మైలవరంలో వైసిపి అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు ఛాన్స్ దక్కించుకున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తిరుపతిరావు రాజకీయాలపై ఆసక్తితో వైసీపీలో చేరారు. 2021లో మైలవరం జడ్పిటిసిగా గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి వెళ్లడంతో.. తిరుపతిరావు వైసీపీ హై కమాండ్ బరిలో దించింది. ఇలా సామాన్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చిక్కింది. అయితే వీరు ఎన్నికల్లో ఎంతవరకు నెగ్గుకు రాగలరో చూడాలి.