
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశంలో 40 కోట్ల కంటే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కువ సంఖ్యలో బ్రాంచ్ లు ఉన్న ఎస్బీఐ భారీ సంఖ్యలో ఏటీఎం సెంటర్లను కలిగి ఉండటంతో పాటు ఏటీఎం సర్వీసులను అందిస్తోంది. అయితే ఏటీఎంల ద్వారా లావాదేవీలను జరిపే వాళ్లు ఏటీఎం ఛార్జీల గురించి కచ్చితంగా అవగాహనను ఏర్పరచుకోవాలి.
ఎస్బీఐ ఏటీఎం నిబంధనల గురించి తెలుసుకోకపోతే ఛార్జీల రూపంలో బ్యాంక్ అకౌంట్ లోని నగదు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ ఖాతాదారులు తమ డెబిట్ కార్డ్ ద్వారా నెలకు ఎనిమిది సార్లు ఎటువంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఎస్బీఐ ఏటీఎం నుంచి 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడుసార్లు నగదు విత్ డ్రా చేస్తే మాత్రమే ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అయితే కస్టమర్లు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్ లో తగినంత బ్యాలెన్స్ లేకుండా ఎస్బీఐ ఏటీఎం నుంచి విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినా ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాల్లో ఎనిమిది సార్లు ఉచితంగా డబ్బులు విత్ డ్రా చేసే ఛాన్స్ ఉంటే నాన్ మెట్రో నగరాల్లో మాత్రం పదిసార్లు ఉచితంగా నగదు విత్ డ్రా చేసే ఛాన్స్ ఉంటుంది.
తగినంత బ్యాలెన్స్ ఉందో లేదో అనే సందేహం ఉంటే మొదట బ్యాలెన్స్ చెక్ చేసుకుని నగదు విత్ డ్రా చేస్తే మంచిది. బ్యాలెన్స్ లేకుండా నగదు విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే 20 రూపాయల పెనాల్టీతో పాటు జీఎస్టీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.