TRS Rajyasabha Seats: తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ ముగ్గురు వ్యాపారవేత్తలే కావడం విశేషం. హెటిరో డ్రగ్స్ అధినేత డా. బండి పార్థసారథి రెడ్డి, పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావులను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కేసీఆర్ ఎంపిక చేశారు.

టీఆర్ఎస్ ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా నిలబడ్డ నమస్తే తెలంగాణ పత్రికను నిర్వహిస్తున్న దాని యజమాని దామోదర్ రావుకు కేసీఆర్ కృతజ్ఞతగా రాజ్యసభ సీటు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త.. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డిని కూడా టీఆర్ఎస్ కు అండదండలు అందించినందుకే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్రను కూడా పార్టీకి సాయం చేసినందుకే ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురూ కూడా టీఆర్ఎస్ నేతలు కాకపోవడం విశేషం. పార్టీ కోసం కష్టపడ్డ వారు కాదు. పార్టీకి ఆర్థికంగా.. సామాజికంగా అండగా నిలిచినవారే. ఆ కోణంలోనే కేసీఆర్ ఈ ఖరీదైన రాజ్యసభ సీట్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా ఉన్న డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం వచ్చే నెల ముగుస్తోంది. ఇక రాజ్యసభ ఎంపీగా బండ ప్రకాష్ ఇటీవల రాజీనామా చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం కూడా ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
-దీవకొండ దామోదర్ రావు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరులో 1958 ఏప్రిల్ 1న జన్మించారు. ఈయనకు ఓ భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో కేసీఆర్ వెంట నడిచిన పారిశ్రామికవేత్త ఈయన. అనంతరం ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానెల్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రిక డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. పార్టీకి చేసిన సేవలకు గాను కేసీఆర్ ఈ కీలక పదవినిచ్చారు.
-బండి పార్థసారథి
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో జన్మించారు. ఉన్నత విద్య పూర్తి చేసి కందుకూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూనే హెటిరో సంస్థను స్థాపించి దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పించి ఆ సంస్థను నిలబెట్టారు. విద్యాసంస్థలు స్థాపించి విద్యావేత్తగానూ ఎదిగారు. గుప్తదాతగా పార్థసారథికి పేరుంది. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. టీఆర్ఎస్ కు ఆది నుంచి అండగా ఉన్నారు. అందుకే ఈయనకు పదవి దక్కింది.
-వద్దిరాజు రవిచంద్ర
1965లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, ఇనుగుర్తిలో జన్మించాడు. కాలేజీ స్థాయిలోనే చదువు మానేసి వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. గాయత్రి గ్రానైట్స్ పేరుతో వ్యాపారంలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో టీఆర్ఎస్ లో చేరారు. లక్కీగా ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీటు కొట్టేశారు.
ఈ ముగ్గురిని చూస్తే టీఆర్ఎస్ లో ఆదినుంచి ఉన్న వాళ్లు ఎవ్వరూ లేరు. ఇద్దరు పారిశ్రామికవేత్తలు, ఒక వలసజీవికి కేసీఆర్ సీట్లు ఇచ్చారు. ఎంతో మంది ఉద్యమకారులున్నా కూడా వారందరినీ పక్కనపెట్టి వీరికి ఇవ్వడం టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.
Recommended Videos