Homeప్రత్యేకంPK - TDP : పవన్ కు సీఎం పోస్ట్ ఇచ్చేది లేదు.. షాకిచ్చిన టీడీపీ

PK – TDP : పవన్ కు సీఎం పోస్ట్ ఇచ్చేది లేదు.. షాకిచ్చిన టీడీపీ

PK – TDP : ఏపీ రాజకీయాలు కాక మీద ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ, ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని టీడీపీ, జనసేన గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. ఈ క్రమంలో పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నాయి. అటు చంద్రబాబు, ఇటు పవన్ తరచూ సమావేశమవుతూ ఇరు పార్టీల శ్రేణులకు మంచి సంకేతాలు పంపుతున్నారు. పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారు. అటు బీజేపీని సైతం తమతో కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలలోనే పొత్తులపై ఒక భావసారుప్యత వస్తుందని భావిస్తున్నారు. కర్నాటక ఎన్నికల అనంతరం బీజేపీతో పొత్తుల శుభారంభాన్ని ప్రారంభించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.

పవర్ షేరింగే క్లిష్టం..
పొత్తులు సరే.. తేల్చాల్సింది సీట్ల పంపకం. అంతకంటే మించి పవర్ షేరింగ్. ఎవరు ఎన్నిస్థానాల్లో పోటీచేస్తారు? జనసేనకు ఇచ్చే సీట్లు ఎన్ని? బీజేపీ కలిసి వస్తే సీట్ల పంపకాలు ఎలా చేస్తారు? ఇలా లెక్కకు మించి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పవన్ సీఎం కావాలని జన సైనికులు కోరుతున్నారు. అది కూడా తొలివిడతలోనే ఉండాలని సూచిస్తున్నారు. కాపు సంక్షేమ సంఘం నాయకుడు హరిరామజోగయ్య ఇదే అంశాన్ని కుండబద్దలుకొట్టి చెప్పారు. పవర్ షేరింగ్ లేకుండా టీడీపీ, జనసేన కూటమి కట్టినా కాపు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్లపై ప్రభావం చూపే అవకాశముందని సైతం కొందరు చెబుతున్నారు.

జగన్ నెత్తిన పాలు పోస్తారా?
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్లు, పవర్ అని పేచీ పెట్టుకుంటే అది జగన్ నెత్తిన పాలుపోయడం అవుతుందని అటు టీడీపీకి, ఇటు జనసేనకు తెలుసు. అందుకే ఇరు పార్టీల అధినేతలు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ శ్రేణులకు మంచి మెసేజ్ ఇవ్వాలని మాత్రమే భావిస్తున్నారు. ముందు ఇరు పార్టీల శ్రేణుల మధ్య సయోధ్య కుదిర్చి పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే తరచూ తేనీటి విందుల పేరిట కలుస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు పార్టీలు మానసికంగా సిద్ధమయ్యాయి. కలిసి అడుగులు వేస్తామని బలంగా నమ్ముతున్నాయి. ఇటువంటి సమయంలో రెండు పార్టీల మధ్య అగాధం సృష్టించేందుకు వైసీపీ సోషల్ మీడియా పథక రచన చేస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేలా పోస్టింగులు పెడుతోంది. అవి వైరల్ గా మారుతున్నాయి.

పొత్తుకు విఘాతం కలిగేలా..
టీడీపీ, జనసేన కూటమి ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్న వేళ..పవర్ షేరింగ్ విషయం పక్కన పెట్టిన వేళ వైసీపీ సోషల్ మీడియా కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. పవన్ విషయంలో టీడీపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు గతంలో మాట్లాడిన ఆడియోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది, వాటినే వైరల్ చేస్తోంది. తాజాగా టీడీపీనేత ఓ టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నట్టు ఒక వీడియోను పోస్టు చేసింది. పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ఒప్పుకునే చాన్సే లేదని.. చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమంటూ టీడీపీ నేత మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అవసరమైతే టీడీపీ ఒంటరి పోరుకు సిద్ధంగా ఉందని మీకు చేతనైతే సొంతంగా పోటీచేయాలంటూ జనసేన ను ఉద్దేశిస్తూ టీడీపీ నాయకుడి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటువంటివి పునరావృతమైతే మాత్రం పొత్తుకు విఘాతం కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version