Homeఆంధ్రప్రదేశ్‌AP Politics : కరణం బలరాం.. గణేష్ టీడీపీకి ఓటేస్తే శ్రీదేవి, మేకపాటిని సస్పెండ్ చేశారా?

AP Politics : కరణం బలరాం.. గణేష్ టీడీపీకి ఓటేస్తే శ్రీదేవి, మేకపాటిని సస్పెండ్ చేశారా?

AP Politics : తప్పు ఒకరు చేస్తే.. మూల్యం మరొకరు చెల్లించుకున్నారా? ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇటువంటి వార్తే ఒకటి హల్ చల్ చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాష్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు ఇందులో మినహాయింపు ఉంది. ఎందుకంటే వైసీపీ హైకమాండ్ కూడా వారిని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. కానీ మిగతా ఇద్దరు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలేనంటూ తేల్చేసింది. వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. కానీ టీడీపీకీ ఓటు వేసింది వారు కాదని.. కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ లు అంటూ కొత్త వార్త ఇప్పుడు తెలుగునాట వైరల్ అవుతోంది. తప్పుచేశామా? అన్న అంతర్మథనం అధికార పార్టీలో కనిపిస్తోంది. అదే జరిగితే కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ లపై వేటు వేయడానికి చాన్స్ లేదు. ఎందుకంటే వారు టీడీపీ ఎమ్మెల్యేలు. వైసీపీకి అనుబంధంగా సాగుతున్నారే తప్ప.. ఆ పార్టీలో అధికారికంగా చేరలేదు.

కరణం, వాసుపల్లి ఆ కారణంతోనే క్రాస్ ఓటింగ్ చేశారా?
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో విజయం సాధించింది. కానీ నలుగురు ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి వైసీపీలోకి ఫిరాయించారు. ఆ పార్టీలోకి నేరుగా చేరకుండానే కుటుంబసభ్యులను చేర్పించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య పొసగడం లేదు. ఆశించిన స్థాయిలో కలిసి పనిచేయడం లేదు. వైసీపీలోకి ఫిరాయించినప్పుడు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ హామీ మీదే వీరంతా అటువైపు మొగ్గుచూపారు. తీరా ఆ పార్టీలో చేరిన తరువాత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అటు హైకమాండ్ సైతం క్లారిటీ ఇవ్వడం లేదు. ముఖ్యంగా కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ లకు సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అందుకే కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ లు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ప్రచారం ఊపందుకుంది.

చీరాల బలరాంకు చిక్కులు…
కరణం బలరాం టీడీపీలో సీనియర్. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. గత ఎన్నికల్లో చీరాల నుంచి బలరాంను బరిలో దింపారు. అంతకు ముందు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలుపొందిన ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నిరకాల లబ్ధిపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. దీంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. సీనియర్ నాయకుడు బలరాంను తెరపైకి తెచ్చారు. చీరాల నుంచి పోటీచేయించారు. అనూహ్య విజయం దక్కించుకున్న బలరాం.. అక్కడకు కొద్ది నెలలకే వైసీపీలోకి వెళ్లిపోయారు. బలరాం వ్యాపారాలతో పాటు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లారన్న టాక్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ తో ఉన్న ఇబ్బందులను పరిష్కరించడంలో వైసీపీ హైకమాండ్ ఆశించిన స్థాయిలో ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పై బలరాంలో అనుమానాలున్నాయి. అందుకే ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి అనుకూలంగా ఓటువేశారన్న ప్రచారం అయితే ఉంది.

దక్షణ నియోజకవర్గ వైసీపీలో విభేదాలు..
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపొందారు. అంతకు ముందు ఎన్నికల్లో సైతం ఆయన అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ ఆకర్ష్ లో భాగంగా ఆయన అధికార పార్టీ గూటికి చేరారు. కానీ ఆ నియోజకవర్గంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రూపంలో పోటీదారుడు ఉన్నారు. పేరుకే వైసీపీ కానీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ ను సుధాకర్ అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ సుధాకర్ ప్రచారం చేసుకున్నారు. దీంతో గణేష్ కుమార్ నొచ్చుకున్నారు. అక్కడ ఇబ్బందులను గమనించిన హైకమాండ్ సుధాకర్ ను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్పీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. సుధాకర్ ను ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే గణేష్ కుమార్ కు లైన్ క్లీయర్ చేయాలన్నది హైకమాండ్ ఆలోచన. కానీ సుధాకర్ ఓటమితో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో గణేష్ కుమార్ పునరాలోచనలో పడ్డారు. టీడీపీ కి దగ్గరవ్వాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారన్న ప్రచారం జరుగుతోంది.

టీడీపీ మైండ్ గేమ్…
అయితే ఇవేవీ పరిగణలోకి తీసుకొని వైసీపీ హైకమాండ్ చర్యలకు ఉపక్రమించింది. కొద్దిరోజులు వెయిట్ చేసి చర్యలు తీసుకుంటామని సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించారు. కానీ కోడింగ్ లో పసిగట్టామని.. వారిద్దరూ తప్పు చేశారని తేలడంతో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై వేటు వేసినట్టు ఆ తరువాత రోజు మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. కానీ తప్పుచేసింది వారు కాదని.. కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లే తప్పుచేశారంటూ కొత్త ప్రచారం ఉంది. అయితే అది టీడీపీ మైండ్ గేమ్ లో భాగమని భావిస్తూనే… వాస్తవాలను ఆరాతీసే పనిలో పడింది వైసీపీ హైకమాండ్. మొత్తానికైతే టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ తో వైసీపీ బొక్క బోర్లా పడుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version