Vande Bharat train : వందే భారత్.. ఈ రైలు ప్రారంభించిన నాటి నుంచి ఓ సెక్షన్ విమర్శలు చేస్తూనే ఉంది. కొందరైతే ఒక అడుగు ముందుకేసి రాళ్లు రువ్వుతున్నారు. అద్దాలు పగలగొడుతున్నారు. సరే వారి స్థాయి అదే. అలాంటి పనికిమాలిన మందలు మనదేశంలో చాలానే ఉన్నాయి..” వారూ బతుకుతున్నారు.. కుక్కల వలె, నక్కల వలె, సందుల్లో పందుల వలె” ( ఇక్కడ జంతువుల ప్రస్తావన తీసుకు వచ్చినందుకు క్షమించాలి). వారి సంగతి వదిలిపెడితే… వందే భారత్ రైలును ఆపేందుకు చాలా కుట్రలే జరిగాయి.. భారతీయ రైల్వేలో కూడా ఒక ఇస్రో నంబి నారాయణన్ కూడా ఉన్నాడు.. అనేక రకాల వేధింపులకు గురయ్యాడు..

సుదాంశు మణి .. రైల్వేలో సీనియర్ ఉద్యోగి.. రెండు సంవత్సరాలలో రిటైర్మెంట్ కాబోతున్నాడు.. ఈ క్రమంలో ఒకరోజు అధికారులు పిలిచి మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలి అని అడిగారు.. దానికి ఆయన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గా పోస్టింగ్ ఇవ్వండి అని అడిగాడు. ఎందుకు అని అధికారులు అడిగితే… నేను రిటైర్ అయ్యేలోగా దేశం కోసం ఒక సెమీ హై స్పీడ్ రైలు తయారు చేయాలనుకుంటున్నట్టు వివరించాడు.. అయితే అప్పటికే స్పానిష్ దేశానికి చెందిన టాల్గో కంపెనీ రైలు కోచ్ లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కాలమది.. దేశంలో చర్చ కూడా జరుగుతున్న కాలం అది.. దాని ట్రయల్ విజయవంతమైంది. అయితే ఆ కంపెనీ 10 కోచ్ ల రేక్ సప్లై కోసం ఏకంగా 250 కోట్లు డిమాండ్ చేసింది.. దానికి సంబంధించిన సాంకేతికత బదిలీ కోసం చేసుకునే ఒప్పందంపై సంతకం చేసేందుకు ఆ కంపెనీ ఇష్టపడలేదు. అటువంటి పరిస్థితుల్లో సుదాంశు మణి దేశంలో టాల్గో కంటే మెరుగైన రైలును స్వదేశీ సాంకేతికతతో దానిలో సగం కంటే తక్కువ ఖర్చుతో తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు అధికారులకు చెప్పాడు.. దీనికి ఎంత డబ్బు అవసరం అవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ అడిగితే… 100 కోట్లు చాలు సార్ అని సుదాంశు మణి వివరించాడు.. అతడు అడిగినట్టుగానే రైల్వే బోర్డు ఐసిఎఫ్ లో జనరల్ మేనేజర్ గా బాధ్యతలు ఇచ్చి, వంద కోట్లు మంజూరు చేసింది.
దీంతో సుదాంశు మణి హడావిడిగా రైల్వే ఇంజనీర్ల బృందాన్ని తయారు చేసుకున్నాడు. ఇంజన్ నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యాడు. 18 నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించాడు.. అతడు తయారుచేసిన ప్రత్యేకమైన ఇంజన్ లేని రైలునే వందే భారత్ రేక్ అని ప్రస్తుతం పిలుస్తున్నాం. అయితే దీనిని ముందుగా రైలు 18 అని పిలిచేవారు. ఈ 16 కోచ్ ల కొత్త రైలు తయారీకి 97 కోట్లు ఖర్చయింది.. అదే టాల్గో కంపెనీ 10 కోచ్ ల రైలు కోసం 250 కోట్లు అడిగింది.. అంటే 16 కోచ్ ల వందే భారత్ రైలు దిగుమతి చేసుకుంటే 400 కోట్లు అయ్యేది..
-కాళ్లు పట్టుకున్నాడు
మొదట్లో మణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధికారులు తర్వాత అడ్డు పుల్లలు వేయడం ప్రారంభించారు.. ఈ రైలు కోసం పనిచేస్తున్న ఇంజనీర్ల మధ్య తగాదాలు పెట్టారు.. ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు ఆగిపోతుందనే సంకేతాలు కూడా ఇచ్చారు. తన మానస పుత్రిక అయిన ఈ రైలు ప్రాజెక్టు ఆగిపోకూడదని మణి రైల్వే బోర్డు అధికారుల కాళ్లు పట్టుకొని బతిమాలినంత పని చేయాల్సి వచ్చింది. అప్పుడు కానీ రైల్వే బోర్డు అధికారులు ఈ ప్రాజెక్టు అడ్డంకులు తొలగించలేదు. ఒకరకంగా చూస్తే ఇది ఇస్రో నంబి నారాయణ్ చరిత్ర మాదిరే కనిపిస్తుంది.
ఇక ఈ రైలు భారత రైల్వే చరిత్రలో అత్యంత అరుదైనది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి కోచ్ కు ఒక మోటార్ ఉంటుంది.. ప్రతీ కంపార్ట్మెంట్ స్వయం చోదకమైనది. అంటే సెల్ఫ్ ప్రొఫైల్లింగ్.. లాగడానికి ఎటు వంటి ఇంజన్ అవసరం లేదు.. రెండు సంవత్సరాలలో సిద్ధమైన ఈ రైలును వారణాసి, న్యూఢిల్లీ మధ్య నడిపారు. సదరు అధికారి 2018లో పదవి విరమణ చేశాడు.. ప్రస్తుతం లక్నోలో నివసిస్తున్నాడు.. వందే భారత్ వంటి అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు ఈ దేశం నుంచి ఎవరు అతన్నీ, అతని జట్టును అభినందించలేదు.. కానీ ఇటీవల అదే వందే భారత్ రైలు ఓ గేదెను ఢీకొన్నప్పుడు దాని ముందు భాగం దెబ్బతిన్నది.. చాలామంది ఈ రైలు డిజైన్ ను విపరీతంగా విమర్శించడం మొదలుపెట్టారు. అంతే కాదు ఈ రైలు ను ఆపేందుకు కొంతమంది రెండు సంవత్సరాలు ప్రయత్నించారు.. ఆ సమయంలో మేము అలాంటి ట్రైన్ తయారు చేయలేము కాబట్టి స్పెయిన్ నుంచి ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలని ఒత్తిడి కూడా తెచ్చారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అదృష్టవశాత్తు మణి మరో నంబి నారాయణ్ లాగా కాలేదు.. లేకుంటే ఆ చరిత్ర మరో విధంగా ఉండేది.