
Telangana Financial Crisis: తెలంగాణ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. చేసిన అప్పులకు కిస్తీలు కట్టేందుకు తంటాలూ పడాల్సి వస్తుంది. అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చెల్లించాల్సిన సుమారు రూ.5 వేల కోట్ల కిస్తీలకు డబ్బులు లేక పోవడంతో ఆర్‌బీఐని అప్పుకోసం అర్థిస్తోంది కేసీఆర్ సర్కార్.
చెల్లింపులు ఆపి..
రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేసిన అప్పులకు చెల్లింపులు ఏటా పెరుగుతున్నాయి. ఆదాయానికి మించి చేస్తున్న అప్పులు సర్కార్‌కు భారంగా మాచాయి. ఒక అప్పు తీర్చేందుకు కొత్త అప్పుకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుల కిస్తీలు, వడ్డీలు సక్రమంగా చెల్లించకపోతే ఓపెన్ మార్కెట్‌లో పరిమితి పడిపోతుంది. దీంతో ఇతర చెల్లింపులను కొంత కాలం వాయిదా వేసి కిస్తీలు చెల్లించడంపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. ఫిబ్రవరి చివరి వారంలో బాండ్లను విక్రయించి రూ.1000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. ఈనెల 2వ తేదీన మరో రూ.1000 కోట్ల కావాలని దరఖాస్తు చేసుకున్నది. ఈ రూ.2 వేల కోట్లు కేవలం కిస్తీల చెల్లింపుల కోసమే ఖర్చు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
కిస్తీలకే రూ.5 వేల కోట్లు..
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇందులో నేరుగా అప్పు చేయడంతోపాటు వివిధ కార్పొరేషన్ల పేరుతోనూ అప్పులు చేసింది. వీటికి ఏటా వడ్డీ, అసలు కలిపి చెల్లించాలి. ఇందులో కొన్ని ప్రతీ మూడు నెలలకోసారి, ఇంకొన్ని ఆరు నెలలకోసారి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసికంలో చెల్లించాల్సిన కిస్తీలు సుమారు రూ.5 వేల కోట్ల వరకూ ఉన్నట్టు సమాచారం. వీటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోతే కొత్తగా చేసే అప్పులపై ప్రభావం పడుతుందనే టెన్షన్ ప్రభుత్వంలో ఉన్నది. అందుకే ఎలాగైనా వాటిని చెల్లించేందుకు మిగతా చెల్లింపులను వాయిదా వేసుకుంటున్నది.
ఆలస్యం కానున్న ఉద్యోగుల జీతాలు ?
ఈనెల ఉద్యోగుల జీతాల చెల్లింపు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఇతర చెల్లింపులపైనా ఫోకస్ ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ నెల జీతాల చెల్లింపు ప్రక్రియ మూడో వారంలో పూర్తవుతాయని సమాచారం. అలాగే రైతుబంధు స్కీం చెల్లింపులు కూడా పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు పెట్టుబడి సాయం చెల్లించలేదు. ఇవి వచ్చేనెలలో చెల్లించే అవకాశం ఉంది.

మొత్తంగా అప్పుల మీద అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రం తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోని నెడుతున్నది మాత్రం వాస్తవం. చేసిన అప్పులను పునరుత్పాదకరంగంపై పెట్టుబడి పెట్టకపోవడంతో ఆదాయం పెరగడం లేదు. కేవలం మద్యం, భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ ఆదాయంపైనే సర్కార్ ఆధారపడుతోంది.