BJP – TDP – Telangana : నేతల కీలక భేటీ వేళ తెలంగాణ బీజేపీ, టీడీపీలో అనూహ్యకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల్లో శరవేగంగా పరిస్థితులు మారుతున్నాయి. అంతర్గత సమావేశాల పేరిట హడావుడి ప్రారంభమైంది. ఇటీవల కాలంలో చంద్రబాబు తెలంగాణ టీడీపీపై పెద్దగా ఫోకస్ పెట్టిన సందర్భాలు లేవు. ఆ మధ్యన సమీక్షలు, ఖమ్మంలో భారీ బహిరంగ సభ మినహాయించి పెద్దగా కార్యక్రమాలు ఏవీలేవు. మొన్న ఆ మధ్యన హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. అటు తరువాత చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏవీ లేవు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబు తెలంగాణ టీడీడీ కార్యాలయానికి వెళ్లి నేతలతో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ టీడీపీ బాధ్యతలను బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కే అప్పగించారు. హైదరాబాద్ తో పాటు ఏపీ సరిహద్దు జిల్లాలపై ఫోకస్ పెంచారు. అక్కడ కేడర్ కు దిశా నిర్దేశం చేశారు. అయితే ఇదంతా చంద్రబాబు బీజేపీ కోసమే అన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక్కడ టీడీపీని యాక్టివ్ చేసి తద్వారా బీజేపీని లైన్ లోకి తెచ్చుకుంటారని టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. మొన్నటికి మొన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలతో సమావేశమైన చంద్రబాబు పొత్తుల దిశగా ఇండికేషన్స్ ఇచ్చారు. కానీ పొత్తు వల్ల లాభ నష్టాలను భేరీజు వేసుకొని ఏదో విషయం చెబుతామని అమిత్ షా, నడ్డా ద్వయం చంద్రబాబుకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు సెడన్ గా చంద్రబాబు టీడీపీ తెలంగాణ కార్యాలయానికి వెళ్లి కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు కీలక నేతలతో చర్చించడం హాట్ టాపిక్ గా మారింది.ఇది ప్లాన్డ్ సమావేశమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే చంద్రబాబు మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లి రావడం.. ఆ తర్వాత తెలంగాణలో పొత్తులపై చర్చలు జరుగుతూండటంతో బీజేపీతో పొత్తులపై బీజేపీ హైకమాండ్ పెట్టిన ప్రతిపాదనల్ని చంద్రబాబు వారి మందు ఉంచారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారి అభిప్రాయాలను సేకరించి.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తారని సమాచారం.
మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు కూడా వరుసగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ క్యాడర్ లోని పలు విభాగాల వారితో మాట్లాడుతున్నారు. కార్యదర్శులందరితో హైదరాబాద్‌లో సమావేశం పెట్టారు. త్వరలో బీజేపీ ఇన్ చార్జి సునీల్ బన్సల్ తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరపనున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల సన్నాహాలు అని చెబుతున్నారు కానీ.. ఇది టీడీపీతో పొత్తులపై అభిప్రాయాలు తెలుసుకోవడమేనని ఆ ఆ పార్టీ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీల చర్చల వేగం పెరగడం మాత్రం.. నిజంగానే రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కల్పించడానికేనని అంటున్నారు.
తొలుత బీజేపీ పొత్తునకు అంత సుముఖంగా లేదన్న వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏమంతా ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. తరువాతే బీజేపీ పట్టుబిగుస్తూ వస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు లేరు. దీంతో నాయకత్వం సైతం పునరాలోచనలో పడినట్టు సమాచారం. టీడీపీతో పొత్తునకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అటు టీడీపీ, ఇటు బీజేపీ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం పొత్తుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో?