AP BJP Strategy : ఏపీలో బీజేపీకి ఒంటరిగా అధికారంలోకి వచ్చే సామర్థ్యం లేదు. మిత్రపక్షం జనసేన బలం సరిపోదు. మరి అధికారం కోసం ఏం చేయాలి? ఎవరితో కలిసి వెళితే లాభం.. శూలశోధన చేసిన బీజేపీ పెద్ద మనిషి అమిత్ షా నిన్న జరిగిన రహస్య భేటిలో టీడీపీతో టచ్ లో ఉంటేనే బెటర్ అని దిశానిర్ధేశం చేసినట్టు ప్రచారం సాగుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలను తగ్గాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అయితే ఏపీలో మాత్రం వైసీపీ, బీజేపీ బద్ద విరోధులుగా కొట్టుకుంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నడుచుకుంటోంది. మరోవైపు జనసేనతో కలిసి పోరాటాలు చేస్తోంది. ఈ క్రమంలో ఒక్కోసారి మరో ప్రతిపక్ష పార్టీ టీడీపీ పై కూడా కొందరు బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల సందర్భంగా ఇటీవల తిరుపతిలో పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ కమలం నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఏ పార్టీతో ఎలా మెలగాలి..? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీతో ఎలా మెలగాలి..? టీడీపీతో ఎలా నడుచుకోవాలి…? అన్న దానిపై పార్టీకార్యకర్తల్లో ఉన్న అనుమానాలను తొలగించేశారు. ఇక బీజేపీలోని ఇద్దరు కీలక నేతలతో అమిత్ షా అంతర్గతంగా సమావేశమయ్యారు. ఈ సమయంలో వారికి ఓ విషయంలో కేంద్ర మంత్రి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో పాల్గొనేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ఏపీ సీఎం జగన్ పెండింగ్ లో ఉన్న సమస్యలను అమిత్ షా ముందు ఉంచారు. ముఖ్యంగా విభజన చట్టంలోని లోపాలను, ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యల గురించి చెప్పారు. అయితే అమిత్ షా మాత్రం కేవలం డ్రగ్స్ కట్టడి చేసేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అటు తెలంగాణ నుంచి హాజరైన హోం మంత్రి మహమ్మద్ అలీ సైతం కొన్ని సమస్యలను అమిత్ షాకు వివరించేందుకు ప్రయత్నించగా పట్టించుకోనట్లు సమాచారం.
ఈ సమావేశం ముగిసిన తరువాత అమిత్ షా ఏపీ రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర సేపు నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక పరిస్థితులపై రివ్యూ చేశారు. పార్టీ నాయకులు అందించిన ఇన్ పుట్స్ తీసుకొని వాటిపై భవిష్యత్ కార్యాచరణకు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నేతలు చేయాల్సిన కార్యక్రమాలు, పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘2024 లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. దీంతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాటం చేయాలన్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తుందని, అయితే ప్రతిపక్షాలైన టీడీపీ అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. సందర్భాన్ని బట్టి ఆ పార్టీని కలుపుకుపోయే అవకాశం ఉందన్నారు. అయితే పొత్తుల గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇక జనసేన పార్టీతో పొత్తు ఉందని, ఆ పార్టీతో కలిసి ప్రజా పోరాటాలు చేయాలని సూచించారు.
ఇక ఈ సమావేశం ముగిసిన తరువాత అమిత్ షా అంతర్గత సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో సుజనా చౌదరి, సీఎం రమేశ్ లతో పాటు మరికొందరితో రహస్య భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన శత్రువు వైసీపీనే అని క్లారిటీ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. కాకపోతే అప్పటి వరకు కామ్ గా ఉండాలని, అప్పటి పరిస్తితులను బట్టి పొత్తు పెట్టుకోవాలా..? లేదా..? అనేది ఆ సమయంలోనే తేలుస్తామని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఏపీకి రాజధాని అమరావతి మాత్రమేనని, అమరావతి కోసం చేస్తున్న పోరాటంలో బీజేపీ నాయకులు పాల్గొనాలని అన్నారు. అయితే టీడీపీపై విపరీత ఆరోపణలు చేస్తున్న జీవీఎల్, సునీల్ దేవదర్ పై అమిత్ షా కాస్త ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. టీడీపీ విషయంలో ఇప్పడే క్లారిటీకి రావొద్దని భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. అయితే జనసేనతో కలిసి పోరాటాలకు వెళ్లాలని సూచించారు.