BJP – Janasena : తెలంగాణ ఎన్నికల్లో బిజెపి, జనసేన కూటమి పోటీ చేయనుంది. రెండు పార్టీల మధ్య పొ త్తు ఖరారు అయ్యింది. సీట్ల సర్దుబాటు కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. దీంతో కొద్దిరోజులుగా నెలకొన్న స్తబ్దత తొలగింది. జనసేనకు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కేటాయించేందుకు బిజెపి సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఇప్పటికే జనసేన 33 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బిజెపి మద్దతు కోరిన నేపథ్యంలో జనసేన పొత్తు వైపే మొగ్గు చూపింది. 11 స్థానాలను డిమాండ్ చేసింది. కానీ బిజెపి నాయకత్వం మాత్రం 9 స్థానాలతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు రాష్ట్రవ్యాప్తంగా కలిసి వస్తుందని బిజెపి భావిస్తోంది. తెలంగాణ తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెంచుకోవాలని జనసేన భావిస్తోంది.
ఎన్నికల చివరి నిమిషంలో జనసేన పోటీ నుంచి తప్పుకుంటుందని అంతా భావించారు. జనసేన తో పూర్తి బిజెపికే నష్టమని వార్తలు వచ్చాయి. బిజెపిలో కీలక నేతలు జనసేనతో పొత్తును వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ టిపి ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో.. జనసేన పై ఒక రకమైన ఒత్తిడి పెరిగింది. మరోవైపు జనసేనతో పొత్తు కేసీఆర్ కు లాభిస్తుందని.. బిజెపిని టార్గెట్ చేసుకుని కెసిఆర్ విమర్శలు చేస్తారని బిజెపి నాయకులు అనుమానిస్తూ వచ్చారు. కానీ బిజెపి అగ్రనాయకత్వం మాత్రం జనసేనతో పొత్తుకే మొగ్గుచూపింది. అయితే ఇప్పటికే చాలామంది బిజెపి నాయకులు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలో జనసేన సీట్లు అడుగుతుండడంతో.. అక్కడ ఆశావాహులుగా ఉన్న నేతలు పక్క చూపులు చూడడం ప్రారంభించారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ను వాడుకోవాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. ఈనెల 7న ఎన్నికల ప్రచారానికి గాను ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు ఆహ్వానం అందడంతో హాజరుకానున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో విరుద్ధ విధానాలతో జనసేన రాజకీయ ప్రయాణం చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ ఖరారు చేశారు. అక్కడ ఉమ్మడి కార్యాచరణ సైతం ప్రారంభమైంది. ఇప్పుడు తెలంగాణలో బిజెపితో జనసేన జతకట్టింది. తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ మద్దతు ఎవరికనేది ఇంతవరకు స్పష్టత లేదు. కానీ ఏపీలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసిపికి బిజెపి సపోర్ట్ గా ఉందన్న అనుమానాలతో.. టిడిపి క్యాడర్ బిజెపికి దూరంగా ఉంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే బిజెపితో జనసేన పొత్తు ఖరారు కావడంతో టిడిపి నిర్ణయం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన కోరిక మేరకు చంద్రబాబు ప్రకటన చేస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
అయితే తెలంగాణలో తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఏపీలో సైతం రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే కలిసి వెళ్లాలని తెలుగుదేశం, జనసేన నిర్ణయించుకున్నాయి. బిజెపి విషయంలో స్పష్టత లేదు. ఇప్పుడు గానీ తెలంగాణలో బిజెపి, జనసేన కూటమికి తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా మద్దతు తెలిపితే మాత్రం.. ఏపీ విషయంలో బిజెపి పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఏపీలో టిడిపి,జనసేన లతో పొత్తు ప్రకటించడంతో పాటు వైసీపీ సర్కార్ పై యుద్ధం ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికే కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబుకు ఉపశమనం కలిగించడంతో పాటు రాజకీయంగా కూడా మద్దతు తెలిపేందుకు బిజెపి ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో.. బిజెపి, జనసేన కూటమి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.