KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అయితే.. ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శాఖతో సంబంధం లేకుండా.. ఎందులో అయినా తలదూర్చేది కేసీఆర్ తర్వాత కేటీఆరే. ఒకపైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని నడిపిస్తూ.. మరోవైపు ముఖ్యమైన మంత్రిగా రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఆరు నెలల క్రితం వరకు కేటీఆర్‌కు తెలంగాణలో మంచి గుర్తింపు, గౌరవం ఉండేది. సాఫ్ట్‌గా మాట్లాడతారని, సబ్జెక్టుతో విమర్శలు చేస్తారని విషయం లేకుండా మాట్లాడరన్న భావన ఉండేది. కానీ విత్తోటి పెడితే చెట్టు ఇంకోటి మొలుస్తుందా అన్నట్లు.. కొన్ని నెలలుగా కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ భాష మారుతోంది. ఇక ఇటీవల టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రం లీకేజీ కేటీఆర్‌ను నిరుద్యోగుల్లో మరింత డ్యామేజీ చేసింది. టీఎస్‌పీఎస్సీ లీకేజీకి ముందు కేటీఆర్ తెలంగాణకు పెద్దపెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా ప్రైవేటు కొలువులు వస్తున్నాయని నిరుద్యోగులు భావించేవారు. కానీ పేపర్ లీకేజీ.. ఆ తర్వాత కేటీఆర్ చేస్తున్న హడావుడి, తనకేమీ సంబంధం లేదన్నట్లు మాట్లాడడం, విచారణపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చాయి. యువత, నిరుద్యోగుల్లో ఉన్న ఇమేజ్‌ను డ్యామేజీ చేశాయి. ఇక పార్టీ నేతల్లో కూడా కేటీఆర్‌పై అంచనాలు తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో తాను పెట్టిన మీటింగ్‌కే నాయకులు, కార్యకర్తలను బతిమిలాడి కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
మధ్యలోనే వెళ్లిపోయిన నాయకలు..
మొన్నటి వరకు కేటీఆర్‌ను కలవడమే పార్టీ నేతలు మహద్భాగ్యంగా భావించేవారు. ఇప్పటికీ ఆ పార్టీలోని కిందిస్థాయి నేతల్లో ఆ ఉత్సాహం ఉంది. అయితే కేటీఆర్ సొంత నియోజకవర్గం నేతలు కేటీఆర్‌ను లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 25న నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కేటీఆర్ కూడా తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను మరోమారు గెలిపించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లోక్‌సభ స్థానం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అంతా కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం కూడా చేశారు. కానీ, పాడిందే పాటరా పాసిపండ్ల దాసరి అన్నట్లు ఎప్పుడు మీటింగ్ పెట్టినా బీజేపీని, మోదీని తిట్టడం, కాంగ్రెస్‌ను విమర్శించడం మినహా కొత్తదనం ఏమీ ఉండకపోవడంతో మీటింగ్‌కు వచ్చిన నాయకులు, కార్యకర్తలు మధ్యలోనే లేచి వెళ్లిపోవడం కనిపించింది.
సెల్ఫీ ఆశ చూపి..
దీంతో పరిస్థితిని గమనించిన కేటీఆర్.. వెళ్లిపోతున్న నాయకులను, కార్యకర్తలను ఆగమని బతిమిలాడడం కనిపించింది. అయినా వెళ్లిపోయేవారు ఆగలేదు. దీంతో కేటీఆర్ మీటింగ్ చివరి వరకూ ఉండే వారికి తనతో సెల్ఫీ దిగే చాన్స్ ఇస్తానని ప్రకటించారు. తనతో సెల్ఫీ దిగాలనుకునేవారు చాలా మంది ఉంటారు కాబట్టి, ఇలా చెబితే అయినా నాయకులు మీటింగ్ నుంచి వెళ్లిపోకుండా ఉంటారని భావించారు. కానీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. నీతో సెల్ఫీ ఏంటోయ్ అన్నట్లుగా వెళ్లిపోయేవారు వెళ్లిపోతూనే ఉన్నారు.
కరీంనగర్‌లో గేట్లకుతాళం..
ఇక కరీంనగర్ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈయన కూడా కేటీఆర్ తరహాలోనే ప్రసంగం దంచి కొట్టారు. తర్వాత మేయర్, కార్పొరేటర్లు వేదికపై డీజే పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేశారు. గమనించిన నాయకులు, కార్యకర్తలు మీటింగ్ నుంచి వెళ్లిపోవడానికి లేచారు. అయితే మీటింగ్ హాల్ గేటుకు తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వడగండ్ల వానతో పంటలు నష్టపోయి ఉన్నామని, ఆకాశంలో మబ్బులువస్తున్నాయని, మళ్లీ వర్షం వస్తే ధాన్యం తడుస్తుందని తమను వెళ్లనివ్వాలని కొంతమంది వాగ్వాదానికి దిగారు.
మొత్తంగా బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో మంత్రులు కూడా నాయకులు, కార్యకర్తలను బలవంతంగా, బతిమిలాడి కూర్చోబెట్టుకునే పరిస్థితి రావడం రాష్ట్రంలో మార్పునకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్‌కు ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంటున్నారు. మరోవైపు కేటీఆర్ కార్యకర్తలను బతిమిలాడుతున్న వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.