BRS Maharashtra Meeting: ” ఆ మోదీది ఏముందయ్యా? మీడియాను మొత్తం మేనేజ్ చేస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీల నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులతో బెదిరిస్తున్నాడు. దాడులు చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” ఇలా సాగుతుంటాయి కేసీఆర్ మాటలు. వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. సొంత రాష్ట్రంలో మీడియాను పాతాళం లోకి తొక్కుతా అని బెదిరిస్తాడు. అంతేకాదు తన అనుకూల మీడియాకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు ఇప్పిస్తాడు. నచ్చని మీడియాపై బహిరంగంగానే నిషేధం ప్రకటిస్తాడు.. అంతేకాదు తన అవసరాల కోసం మీడియాకు “జాకెట్” రూపంలో బిస్కెట్లు వేస్తాడు. ఈమధ్య “దేశ్ కి నేత” అని కీర్తించుకుంటున్నాడు కాబట్టి, దేశంలో నరేంద్ర మోదీని గద్దె దించి, ఢిల్లీలో చక్రాలు తిప్పాలి అనుకుంటున్నాడు కాబట్టి, భారత్ మొత్తం గత్తర లేపాలి అంటున్నాడు కాబట్టి.. హఠాత్తుగా మహారాష్ట్ర వైపు తన ప్రయాణం మొదలుపెట్టాడు.
ఇప్పటికే ఆ రాష్ట్రంలో మూడు చోట్ల బహిరంగ సభలు నిర్వహించాడు. మన దగ్గర అయితే ఆంధ్రజ్యోతి, వెలుగు మినహా ( ఇవి కూడా ఒకప్పుడు బాకాలు ఊదినవే) మిగతావన్నీ పింక్ ఫోల్డ్ లో ఉన్నవే. కానీ మహారాష్ట్రలో అలా కాదు కదా! అందుకే భారత రాష్ట్ర సమితి ఇప్పుడు సిరి సంపదలతో తులతూగుతుంది కాబట్టి అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చేసింది. కేవలం ఈ ప్రకటనలు ఖర్చు కోసమే 15 కోట్లు కేటాయించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంతే కాదు కేసీఆర్ నిర్వహించే ప్రతి సభకు అక్కడి పత్రికా విలేకరులకు ఆహ్వానం అందిస్తున్నారు. స్థాయిని బట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు.
సర్కులేషన్ పరంగా పెద్ద పత్రిక విలేకరులకు 50 వేల వరకు ఇస్తున్నారు. ప్రత్యేక వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఇక చిన్న పత్రిక విలేకరులకు పదివేల దాకా ముట్ట చెబుతున్నారు. వాస్తవానికి మన దగ్గర అయితే ఒక వార్తకు సంబంధించి ఒక శీర్షిక, కొన్ని డెక్కులు, కొంతమేర వార్త ప్రధాన పత్రికలో ప్రచురితమవుతుంది. దానికి కొనసాగింపు ఇంకొక పేజీలో ఉంటుంది. కానీ మరాఠీ మీడియా అలా కాదు. మొదటి పేజీలోనే పూర్తి వార్త ఉంటుంది. అయితే అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి ఆ పత్రికలకు పూర్తిస్థాయిలో ప్రకటనలు ఇస్తోంది. అక్కడ పత్రికలు కూడా భారత రాష్ట్ర సమితి వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజల్లో చర్చ మొదలైందని భారత రాష్ట్ర సమితి నాయకులు భావిస్తున్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ముందుగా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపాలని భారత రాష్ట్ర సమితి నాయకులు యోచిస్తున్నారు. ఇక ఇప్పటివరకు నాందేడ్, లోహా కందార్, ఔరంగాబాద్ ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి సభలు నిర్వహించింది. ఈ సభలకు భారీ ఎత్తున జన సమీకరణ చేసింది. ఈ బాధ్యతను స్థానికంగా ఉన్న నాయకులకు అప్పజెప్పింది. ఈ క్రమంలో సభకు వచ్చిన ఒక్కొక్కరికి 1000 రూపాయలు, బీరు, బిర్యానీ అందజేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక మరోవైపు మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాల పైన భారత రాష్ట్ర సమితి దృష్టి సారించింది. ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లోనూ జోరుగా ప్రచారం చేస్తున్నది. అక్కడి పత్రికలకు ₹లక్షల్లో ప్రకటనలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటోంది. అక్కడ విలేకరులకు మర్యాదలు చేస్తోంది. విలువైన కానుకలు పంపిస్తోంది. అంతేకాదు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను వార్తలుగా రాయించుకుంటున్నది. ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించేందుకు ఒక బృందాన్ని నియమించింది అంటే భారత రాష్ట్ర సమితి ఆర్థిక పరిపుష్టి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.