Pawan Kalyan- YCP: ఏపీలో అధికార వైసీపీ నేతల తీరుపై పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముళ్లును ముళ్లుతో తియ్యాలనే తాను చెప్పుచూపి మరీ హెచ్చరించాల్సి వచ్చిందని కూడా చెప్పారు. రాష్ట్రంలో దౌర్భగ్య పరిస్థితులను చూసి తాను వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో స్పందించాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో పవన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. 151 మంది ఎమ్మెల్యేలను వణికిస్తున్నామంటే అది ప్రజాస్వామ్యం గొప్పతనమేనన్నారు. ప్రశ్నించేతత్వంతోనే అది సాధ్యపడిందన్నారు. వ్యవస్థలను నాశనంచేసే పాలకులకు సలాం కొడుతున్న అధికారులు, పోలీసులను దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో చూస్తుండడం బాధేస్తోందన్నారు. ఇంట్లో మహిళలను రేప్ చేసి చంపేస్తామన్నవారికి పాలకులు వత్తాసు పలుకుతున్నారని.. చెప్పు చూపించి హెచ్చరించకపోతే.. మరేం చేయ్యాలని కూడా పవన్ ప్రశ్నించారు. అందుకే వారు వాడుతున్నభాష వాడాల్సి వచ్చిందని.. అది అభ్యంతరకమైనా తప్పలేదనిపిస్తోందన్నారు.

ఉత్తరాంధ్ర విధ్వంసానికి వైసీపీ చూస్తోందని.. దీనిని ఎట్టి పరిస్థితుల్లో జనసేన అడ్డుకుంటుందని పవన్ చెప్పారు. కేవలం జనసేనను టార్గెట్ చేసుకొని ఈ నెల 15న విధ్వంసానికి తెరతీశారని.. దీనిపై తమకు ముందస్తు సమాచారం ఉందన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజల కోసం విశాఖలో అడుగుపెట్టిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు.పోలీసులు, అధికారులు ప్రభుత్వ ప్రయోజితంగా ఆలోచించి ఎయిర్ పోర్టు ఘటనను సృష్టించి జన సైనికులపై కేసు నమోదుచేశారన్నారు. పక్కా ప్లాన్ తో వైసీపీ వ్యవహరించినా., జనసేన ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నా సంయమనంతో వ్యవహరించామని చెప్పారు. అందుకే తాను ఆ స్థాయిలో హెచ్చరించాల్సి వచ్చిందని తెలిపారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ మహమ్మారి, వంశధార నిర్వాసితులతో పాటు అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక నుంచి కూడా అదే పంథాతోముందుకు సాగుతామన్నారు. విశాఖలో అడుగడుగునా జనసేనను ప్రభుత్వం అణచివేయాలని చూసిందని.. కానీ వారికి తెలియకుండానే జనసైనికుల్లో ఐకమత్యాన్ని పెంచేశారని పవన్ స్పష్టం చేశారు. జన సైనికులకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక సీపీఎస్ రద్దు చేసే బాధ్యతను తీసుకుంటామని, లాఅండ్ ఆర్డర్ కు ప్రాధాన్యమిస్తామని పవన్ ప్రకటించారు. సుగాలీ ప్రీతి కేసు ఇన్విస్టిగేషన్ ను ప్రారంభించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన బలోపేతంపై శ్రేణులు ఫోకస్ పెట్టాలన్నారు. ప్రతిఒక్కర్ని కలుసుకొని పార్టీ సిద్ధాంతాలు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ విముక్త ఏపీయే ధ్యేయమని.. ఉగ్రవాదులు పాలకులుగా ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ ఘటనలో అరెస్టయిన జన సైనికులు,వారిని బెయిల్ పై బయటకు తెప్పించిన లీగల్ సెల్ ప్రతినిధులకు పవన్ సన్మానించారు. వారి సేవలను కొనియాడారు.

జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోబోనివ్వమని తేల్చిచెప్పారు. అవసరమైతే రాష్ట్రంలో మిగతా రాజకీయ పక్షాలన్నింటినీ ముందుగానే కలుస్తామన్నారు. విశాఖలో పవన్ పై వ్యక్తిగత దాడిచేసేందుకు వైసీపీ వ్యూహం పన్నిందని కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే నిఘా వ్యవస్థ ద్వారా అది తెలిసిందన్నారు. ప్రభుత్వ ప్రయోజితంలో పోలీసులు, అధికారులు, యంత్రాంగం భాగస్వామ్యమైనందునే మౌనం పాటించాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి ఆమోదించారు.