
Bhadradri Sri Ramanavami Celebrations : రాముడి కల్యాణం అంటే లోక కల్యాణం.. అలాంటి వేడుకకు సర్కారు నుంచి తోడ్పాటు లేదు. కనీస సహకారం లేదు. చివరకు రూ. 15 వేలు ఖర్చయ్యే పట్టు వస్త్రాలకు దిక్కు లేదు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కొద్దో గొప్పో రాముడికి సర్కారు నుంచి తోడ్పాటు ఉండేది. ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగేది. కానీ తెలంగాణ వచ్చాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 2015లో వచ్చారు. వంద కోట్ల హామీ ఇచ్చారు. అంతే రూపాయి కూడా విడుదల కాలేదు. అప్పటి నుంచి ఇదే వరుస. పైసలు ఇవ్వకపోయినా రాముడి కల్యాణానికి కూడా హాజరు కావడం లేదు. మరీ దారుణం ఏంటంటే ఓ ఏడాది అయితే తన మనవడితో పట్టు వస్త్రాలు సమర్పింపజేశాడు. అంతే కాదు మొన్నటికి మొన్న గోదావరి వరదలు వస్తే కనీసం రాముడి గుడిని కూడా సందర్శించలేదు.
ఫ్లెక్సీలు తొలగించాలట
రాముడి కల్యాణానికి సాయం చేయండి అంటూ భద్రాద్రి దేవస్థానం అడుగుతూనే ఉంది. కనీసం ఆ రూ.15 వేలయినా ఇవ్వడంటూ ప్రాధేయపడుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌కు కూడా లేఖలు రాసింది. ఇక ఇవ్వరూ అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కల్యాణానికి విరాళాలు ఇవ్వాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కరపత్రాలు ముద్రించి విరివిగా పంచుతోంది. దీనిపై మీడియా వార్తలు రావడంతో ఇవ్వాళ ఉదయం సీఎంవో ఆఫీస్ నుంచి భద్రాద్రి కలెక్టర్ అనుదీప్‌కు ఫోన్ వచ్చింది. దేవస్థానం ఈవోకు వర్తమానం అందింది? ‘ ముందు మీరు ఆ ఫ్లెక్సీలు తొలగించండి. కరపత్రాలు పంచడం ఆపండి అంటూ’ ఆదేశం అందింది. అంతే కానీ రాముడి కల్యాణానికి మేం డబ్బులు ఇస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అనే భరోసా మాత్రం రాకపోయింది. పైగా దేవస్థానం సిబ్బంది, అర్చకులపై సీఎంవో ఆఫీస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గులాబీ మీడియా హడావుడి
ఇక రామయ్య కల్యాణానికి నిధుల కటకట ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో మేల్కొన్న అధికారిక గులాబీ మీడియా సోమవారం ఉదయం నుంచి భద్రాచలంలో తిష్ట వేసింది. రామాలయం అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం మహా గొప్పగా పైసలు కేటాయిస్తోంది అటూ చిడతలు వాయించడం మొదలు పెట్టింది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఒక్క పైసా కూడా భద్రాచలానికి రాలేదు. పైగా ఆ మధ్య భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ ఆర్కిటెక్ట్ ఆనందసాయి, చిన జీయర్ స్వామితో కొన్ని నమూనాలను విడుదల చేసింది. తర్వాత ఊదు కాలింది లేదు. పీరి లేచింది లేదు. ఇప్పుడు కేసీఆర్‌కు ఆ చిన జీయర్ స్వామితో టర్మ్స్ బాగా లేవు. ఇలాంటప్పుడు భద్రాచలం అభివృద్ధికి సంబంధించి ముందడుగు పడేది అనుమానంగానే ఉంది.
ముమ్మాటికి బొందుగాళ్లే
యాదాద్రిని అభివృద్ధి చేశానని కేసీఆర్ చెప్పుకోవచ్చు గాక.. ఇప్పటికీ అక్కడి అభివృద్ధి పనుల్లో డొల్లతనం కనిపిస్తూనే ఉంది. అసలు యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చడమే పెద్ద అబ్సర్డ్. యాదాద్రి అభివృద్ధి ఎందుకోసం చేశారో, ఆలయ పరిసర ప్రాంత భూములు ఎవరికి సొంతం అయ్యాయో తెలంగాణ మొత్తానికి తెలుసు. ఆ మధ్య అయోధ్య రామాలయ నిర్మాణానికి బీజేపీ నేతలు నిధులు వసూలు చేస్తుంటే అవాకులు చవాకులు పేలిన బీఆర్‌ఎస్ నాయకులు.. రాముడి కల్యాణానికి రూపాయి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే కిక్కురుమనడం లేదు. పైగా ఆ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నేను పెద్ద హిందువునని తన డబ్బా పేపర్‌లో తాటి కాయంత అక్షరాలతో కేసీఆర్ ప్రకటించుకున్నాడు. ఇదే కేసీఆర్ ఆ మధ్య యాదాద్రి స్తంభాల మీద కారు బొమ్మ చెక్కించింది. తర్వాత మీడియాలో వార్తలు వస్తే నాలుక కరుచుకుంది.
కబ్జా అవుతున్నాయి
అదేం దౌర్భాగ్యమో కానీ రాముడి ఆలయం భద్రాచలంలో ఉంది. ఆస్తులేమో ఆంధ్రాలో ఉన్నాయి. భద్రాచలానికి పక్కనే ఉన్న ఎటపాక, పురుషోత్తమపట్నంలో వందలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆంధ్రాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ రాముడి భూములను చెరపట్టినట్టు ఆరోపణలున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవస్థానం అధికారులు, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌స్, భజరంగ్‌దళ్ నాయకులు ఆందోళన చేస్తే అక్కడి పోలీసులు కేసు పెట్టారు. కానీ కబ్జా నుంచి విడిపించలేకపోయారు. ఇంత జరుగుతున్నా ఆ కేసీఆర్ పట్టించుకోవడం లేదు. హిందువు అంటే పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచారం చేయించుకోవడం కాదు సారూ.. దాన్ని చేతల్లో చూపించడం.. ఇలా ప్రశ్నిస్తే మీరంతా మత పిచ్చిగాళ్లు అని ముద్ర వేసినా వేస్తారు..
