Homeజాతీయ వార్తలుTelangana Congress: పీకే ఎఫెక్ట్: కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిస్తే ‘రేవంత్ రెడ్డి’ టీ.కాంగ్రెస్ దారెటు?

Telangana Congress: పీకే ఎఫెక్ట్: కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిస్తే ‘రేవంత్ రెడ్డి’ టీ.కాంగ్రెస్ దారెటు?

Telangana Congress: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ భారీ డైలమాలో కూరుకుపోయింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు సర్వం సిద్ధం చేసుకున్న పీకే గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ వచ్చి, టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తో భేటీ కావడం టీ కాంగ్రెస్‌ను షాక్‌కు గురిచేసింది. దీంతో ఇన్నాళ్లు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కేసీఆర్ ను గద్దె దించి అధికారంలోకి వద్దామని కలలుగన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది..

Telangana Congress
prashant kishor, revanth reddy

– ప్రత్యర్థితో అంటకాగుడేంది..
ఆయన వ్యూహాలనే అమలు చేద్దామంటోన్న హైకమాండ్‌ ఒకవైపు.. ఆయనేమో ఇక్కడి ప్రత్యర్థితో అంటకాగుతోన్న తీరు మరోవైపు.. తిట్టిపోద్దామంటూ అధినేత్రికి ఆగ్రహం.. సూచనలు స్వీకరిద్దామంటే ఎనలేని అనుమానం.. వెరసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ భారీ డైలమాలో కూరుకుపోయింది. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ వచ్చి, టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తో భేటీ అయి, రాత్రి ప్రగతి భవన్‌ లోనే విడిది చేశారు. ఈ పరిణామాలు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సహా నేతలకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాయని తెలుస్తోంది.

Also Read: Padayatra: పాదయాత్రలతో అధికారంలోకి వస్తారా..? చరిత్ర ఏం చెబుతోంది..?

-రేవంత్‌ మొదటి నుంచి పీకే వ్యతిరేకే..
నిజానికి ప్రశాంత్‌ కిశోర్‌ను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గతంలో తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ కోటరీలో బీహార్‌కు చెందిన ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారుల ప్రాబల్యాన్ని ‘బీహారీ దొంగల ముఠా’గా అభివర్ణించిన రేవంత్‌.. ఆ ముఠాకు పీకే కూడా తోడయ్యాడని, ఎందరు పీకేలు వచ్చినా టీకాంగ్రెస్‌ను ఏమీ పీకలేరనీ రేవంత్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో పీకే చేరికకు అడ్డంకిగా ఉన్న ఏకైక అంశం ‘ప్రత్యర్థులకు వ్యూహరచనలు చేయడం’అని ప్రస్పుటంగా వెల్లడైన తర్వాత కూడా, అటు ఢిల్లీలో కాంగ్రెస్‌ లో చేరికకు ప్రయత్నిస్తూ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ కు స్ట్రాటజిస్టుగా పీకే కొనసాగడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.

-రహస్య భేటీ అందుకేనా?
ఢిల్లీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా శనివారమే హైదరాబాద్‌ వచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌.. నేరుగా సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ వెళ్లి కేసీఆర్‌ తో సుదీర్ఘ మతనాలు జరిపారు. ఆదివారం కూడా వీరు దఫాలుగా పలు అంశాలను చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకు వీలుగా పీకే శనివారం రాత్రి ప్రగతి భవన్‌లోనే బస చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్‌లో చేరిక ప్రయత్నాలు ఆరంభించడం కంటే ముందే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కు వ్యూహకర్తగా పనిచేయాలని పీకే నిర్ణయించుకున్న క్రమంలో.. ఒప్పందాల మేరకు తాను టీఆర్‌ఎస్‌ తోనే కలిసి పని చేస్తానని పీకే స్పష్టం చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో సర్వే రిపోర్టు, ఈనెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, కాంగ్రెస్‌ హైకమాండ్‌ తో జరిపిన సమావేశాల గురించి కేసీఆర్‌–పీకే చర్చించుకున్నట్లు వెల్లడైంది.

Telangana Congress
Revanth Reddy

-టీ కాంగ్రెస్‌లో భిన్న వాదనలు..
కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమైన ప్రశాంత్‌ కిశోర్‌ సడన్‌ గా హైదరాబాద్ వచ్చి గులాబీ బాస్‌ను కలవడంపై టీకాంగ్రెస్‌లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌కు కటీఫ్‌ చెప్పడానికే పీకే ప్రగతి భవన్‌ వచ్చారని, ఆ పనిని గౌరవ ప్రదంగా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ కోరిక మేరకు రెండు రోజుల పాటు కలిసుండటానికి అంగీకరించారని, బహుశా ఇది కేసీఆర్‌–పీకే ఆఖరి సమావేశం కావొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు నేతలు మాత్రం.. పీకే కాంగ్రెస్‌లో చేరబోవడంలేదని, వ్యూహకర్తగా మాత్రమే పనిచేస్తారని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్‌ పట్ల పీకే వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ కాంగ్రెస్‌ ను ఇరుకున పెట్టిందనే వాదనకు మాత్రం అందరూ అంగీకరిస్తున్న పరిస్థితి.

Also Read:Thaman: అరెరే ఇలా అడ్డంగా బుక్ అయ్యావేంటి ‘తమన్’ ?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

  1. […] YCP- Congress: దేశవ్యాప్తంగా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా భారీ ప్లాన్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 377 సీట్లలో పోటీ చేయాలని సూచించారు. ఇందులో ఏపీ నుంచి వైసీపీతో కలిసి వెళ్లాలని ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకూ ఒంటరిపోరునే నమ్ముకుంటున్న వైసీపీ ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. […]

Comments are closed.

Exit mobile version