CM KCR – Raja Shyamala Yagam: ‘నాకంటే పెద్ద హిందువు ఎవడూ లేడు.. నేని చేసినన్ని యాగాలు ఎవడూ చేయలేదు’ హిందుత్వ వాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలివీ..
‘తెలంగాణలో ముహూర్తం ప్రకారమే ఎన్నికలు జరుగతాయి కదా’ రాజాసింగ్ అనర్హత పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలివీ..

ఈ రెండూ ఇప్పుడు సందర్భోచితం.. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈనెల 14 ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభించబోతున్నారు. అంతకుముందు ఆ కార్యాలయంలో రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించారు. గతంలో కూడా కేసీఆర్ చండీయాగం, ఆయుత చండీయాగం, రాజశ్యామల యాగం.. నిర్వహించారు. హాట్ హాట్ పొలిటికల్ డిసీజన్లు తీసుకోవడమే కాదు.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ కేసీఆర్ తన ప్రత్యేకతను చాటుకుంటారు. తాజాగా గులాబీ బాస్ మరో యాగానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రంలోనే హోమాలు యాగాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు దేశరాజధానిలో నిర్వహించనుండడం ఆసక్తిగా మారింది.
-తెలంగాణ ఏర్పడిన తర్వాత చండీయాగం..
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి దైవభక్తి చాలా ఎక్కువ. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఉద్యమ కాలంలోనూ కేసీఆర్ అనేక యాగాలు చేశారు. వీటిని ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయుత చండీయాగం నిర్వహించారు. దీంతో దేశవ్యాప్తంగా కేసీఆర్ యాగాలపై చర్చ మొదలైంది.
-అధికారంలోకి వచ్చాక ఆయుత చండీయాగం..
అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత 2015 డిసెంబర్ 25 నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావవు తన ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీయాగం నిర్వహించారు. దాదాపుగా వారం రోజులపాటు నిర్వహించిన ఈ యాగాన్ని తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ అవకాశం కల్పించారు. ఆర్టీసీ బస్సులను కూడా నడిపింది. అయితే రాష్ట్రానికి పట్టిన దోషాలు పోవాలని, సస్యశ్యామలంగా ఉండాలని, సంకల్పాలు నెరవేరాలని ఈ యాగం చేసినట్లు అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు.
-2018 ఎన్నికలకు ముందు కూడా..
తెలంగాణలో నాలుగున్న ఏళ్ల పాలన పూర్తి చేసిన తర్వాత 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ సమయంలో ఆయన ఫామ్‌హౌస్‌లో కొత్త ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ సమయంలోనూ ఆయన మరోసాని ఫాంహౌస్‌లో చంyీ యాగం నిర్వహించారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు.
-ఢిల్లీలో మూడు యాగాలు..
తాజాగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన సీఎం కేసీఆర్ దాని జాతీయ కార్యాలయాన్ని ఈనెల 14న ఢిల్లీలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు ముహూర్తం కూడా కుదుర్చుకున్నారు. ఈమేరకు ఈనెల 13న రాజశ్యామల యాగం, నవ చండీయాగం నిర్వహించనున్నారు. 14న పార్టీ కేంద్ర కార్యలయం మరో యాగం నిర్వహంచనున్నారు. శృంగేరీ పీఠానికి చెందిన గోపీశర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు చేయనున్నారు. ఈమేరకు సోమవారం కేసీఆర్ దంపతులు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
–యాగాలతో సత్ఫలితాలు..
తెలంగాణ ఏర్పాటుకు ఏడాది ముందు నిర్వహించిన యాగంతో తెలంగాణ సిద్ధించిందని, 2015లో నిర్వహించిన యాగంతో సుస్ధిర అధికారం సాధ్యమైందని, అభివృద్ధి సాధ్యమైందని, 2018లో నిర్వహించిన చండీయాగంతో మరోమారు అధికారం దక్కిందని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. అందుకే జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో కూడా రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ యాగంతో కేసీఆర్‌కు రాజయోగం దక్కుతుందో లేదో చూడాలి.

-కేసీఆర్ నిర్వహించిన ప్రధాన యాగాలు ఇవే..
– 1996లో సహస్ర లక్ష్మీసూక్త పారాయణాలు. సహస్ర లక్ష్మీసూక్త పారాయణ సహిత అభిషేకం.
– 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీహననం.
– 2005లో కేంద్రమంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీయాగం.
– 2006లో సహస్ర చండీయాగం.
– 2007లో పాలకుర్తి నరసింహ రామశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో చండీయాగం, సుదర్శనయాగం.
– 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రీ యాగం.
– 2009లో తెలంగాణ భవన్లో 27 రోజులపాటు నక్షత్ర మండల యాగం.
– 2010లో తెలంగాణ భవన్లో చండీయాగం.
– 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగం.
– 2015, నవంబర్ 27న నవ చండీయాగం.
– 2015, డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుత శతచండీయాగం.
*కేసీఆర్ నమ్మకాలు ఒకవైపు.. ఈ నమ్మకాలపై సుప్రీంకోర్టు పరిహాసం మరోవైపు.. మధ్యలో బీజేపీ సెటైర్లు.. వీటన్నింటని మధ్యలో కేసీఆర్ మాత్రం తాను అనుకున్నదే చేస్తున్నాడు. మరోమారు రాష్ట్రంలో అధికారం దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని రాజశ్యామల యాగానికి పూనుకున్నారు… ఎంతో నమ్మకంతో చేస్తున్న ఈ యాగం రాజయోగం తెస్తుందా.. ప్రజల్లో ఆయన పాలనపై ఉన్న వ్యతిరేకతను మారుస్తుందా.. లేక ప్రజలు, బీజేపీ కోరుకుంటున్నట్లు మార్పు వస్తుందా.. అనేది వేచి చూడాలి.*