Team Modi: What is the role of Amit Shah, Ajit Dhowal, Jai Shankar? : నాయకుడు అంటే నడిపించేవాడు. అతడు నడిచినప్పుడే మిగతా వారిని కూడా నడిపించగలడు. కురుక్షేత్రంలో రథాన్ని సమర్థవంతంగా నడపడంలో పార్ధుడు కృతజ్ఞుడయ్యాడు. కానీ అతడి వెనుక ఉండి హితబోధ చేసింది మాత్రం కృష్ణుడే. అందుకే కురుక్షేత్రంలో పాండవులు గెలిచారు. ధర్మాన్నీ గెలిపించారు. సరే ఇప్పుడు ఈ నవీన యుగానికి వస్తే చుట్టూ శత్రువులు.. ఆపద ఏ మూల నుంచి వస్తుందో తెలియదు. జనాభాలో అతిపెద్ద రెండో దేశం. ఇక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాదులు, కమ్యూనిస్టులు, బంధుత్వ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సరే సరి. ఇలాంటి సమయంలో ఇంట్లో ఈగల మోత నుంచి, బయట దోమల కాటు నుంచి కాపాడుకోవాలంటే ఎంతో దృఢ చిత్తం అవసరం. అలాంటి సమయంలో ఒక నాయకుడికి నమ్మకమైన బలగం అవసరం. అలాంటి బలగాన్ని ఏర్పరచుకున్నప్పుడు రాజ్యానికి, రాజ్యాన్ని ఏలుతున్న నాయకుడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా చదువుతుంటే మీకు ఎక్కడో ఒకచోట స్ట్రైక్ అవుతుంది కదూ?! మాకు తెలుసు మీరు మహా విజ్ఞులు అని. ఇక ఆలస్యం ఎందుకు… చదివేద్దాం పదండి.

-బలమైన బృందాన్ని ఏర్పరచుకున్నారు..
మోడీ 2014లో అఖండ మెజారిటీతో భారత ప్రధాని అయిన తర్వాత అనేక సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. అప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రిగానే పనిచేశారు. కానీ ఒకేసారి ఢిల్లీలోకి అడుగు పెట్టిన తర్వాత అంతా అయోమయంలా కనిపించింది. ఇలాంటి సమయంలోనే తనకంటూ ఒక బృందాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ఆయన బృందం లో చేరిన వారే అజిత్ దోవల్, అమిత్ షా, జై శంకర్. వీరిలో అమిత్ షాకు మోడీకి విడదీయరాని సంబంధం ఉంది. కేవలం మనుషులే వేరు. ఇద్దరి ఆత్మలు, చేసే పని ఒకటే. సమకాలీన రాజకీయాల్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఈ స్థాయిలో పనిచేయడం బహుశా అరుదు అనుకుంటా. 1998లో నరేంద్ర మోడీతో కలిసి అమిత్ షా బీజేపీని అధికార పార్టీగా నిలబెట్టినప్పుడే అతడి గొప్పతనం ప్రజల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో కేశు బాయ్ పటేల్ ను ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ తర్వాత మోడీ 2002లో మతపరమైన అల్లర్లను భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మార్చాడు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పార్టీని గెలిపించాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా పార్టీ ఓడిపోయిన దాఖలాలు లేవు. అప్పటినుంచి మోడీ- అమిత్ షా బంధం బలపడింది. 2014లో అమిత్ షాకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు మోడీ అప్పగించారు. ఆయన తన చాతుర్యాన్ని ఉపయోగించి 80కి గానూ 73 ఎంపీ సీట్లు గెలుచుకునేలా చేసి బిజెపికి తిరుగులేని మెజారిటీ అందించారు.. 2014 తర్వాత ఢిల్లీ, బీహార్ మినహా బీజేపీకి ప్రాధాన్యత ఉన్న ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమిత్ షా తన విజయపరంపర కొనసాగించారు. అస్సాం, హర్యానా, జమ్ము కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో అమిత్ షా బీజేపీ జెండా ఎగరవేయగలిగారు. మహారాష్ట్రలో శివసేనతో సంబంధాలు చేసుకుని శక్తివంతమైన పార్టీగా బిజెపి ఆవిర్భవించేలా చేశారు. ఇక అమిత్ షా తన రాజకీయ చాతుర్యం ద్వారా రాజవంశం, సెక్యులర్, బుజ్జగింపు వంటి పదాలను అత్యంత పాపపు పదాలుగా మార్చారు. వీటిని తిరస్కరిస్తారనే భయంతోనే ప్రతిపక్షాలు వీటిని వాడుకునేందుకు కూడా భయపడుతున్నాయి. పార్టీలో ఎటువంటి అసమ్మతి లేకుండా ఉండేందుకు అమిత్ షా చాలా ప్రయత్నాలు చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఏర్పడేందుకు ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు. యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా వంటి వారు తిరుగుబాటు చేసినప్పుడు మూడో మాట లేకుండా బయటకు పంపించేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీకి అమిత్ షా అందించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. 2024లో కూడా అధికారంలోకి వస్తామని నరేంద్ర మోడీ చెప్తున్నారంటే.. అందుకు కారణం నిస్సందేహంగా అమిత్ షానే.
-అజిత్ దోవల్ నమ్మిన బంటు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ ఒక వ్యక్తి కాదు. అతడు ఒక శక్తి. వన్ మెన్ ఆర్మీ అనే పదానికి పూర్తి అర్హుడు. అతడు చేసిన పనులను బట్టి జేమ్స్ బాండ్ అని పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అజిత్ కుమార్ 1945లో ఉత్తరాఖండ్లోని పౌరి గ్రామంలో జన్మించాడు. అజిత్ తన పాఠశాల విద్యను అజ్మీర్ మిలటరీ స్కూల్ నుంచి పూర్తి చేశాడు. 1965లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎకనామిక్స్ లో పాస్ అయ్యాడు. 2017లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి, 2018లో కు మౌన్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్లతో సన్మానం పొందాడు. అజిత్ 1968లో సివిల్ సర్వీసెస్లో అర్హత సాధించి కేరళ కేడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి అయ్యాడు. 1984లో కలిస్థానీ ఉగ్రవాదులను స్వర్ణ దేవాలయం నుంచి బయటకు రప్పించేందుకు భద్రత బలగాలు ఆ గుడి లోపల దాడి చేసినప్పుడు అందులో అజిత్ కూడా ఉన్నాడు. 1996లో అజిత్ కాశ్మీర్లో భారత అనుకూల సంస్థను స్థాపించాడు.. 1999లో కాందహార్ లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసినప్పుడు.. అజిత్ భారత దేశ ప్రభుత్వం తరఫునుంచి సంధానకర్తగా వ్యవహరించాడు. ఇక్కడే మోడీకి అజిత్ కు బంధాలు బలపడ్డాయని తెలుస్తోంది. 1971 నుంచి 1999 వరకు ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన 15 విమానాల హైజాకింగ్ ను అజిత్ నిరోధించాడు. అజిత్ కు ఒక భార్య, కుమారులు సంతానం. 2004కు ముందు అజిత్ మల్టీ ఏజెన్సీ సెంటర్, జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటెలిజెన్స్ అనే సంస్థలను ఏర్పాటు చేసి వాటి అధిపతిగా ఉన్నారు. ఈ రెండు కంపెనీలు కూడా భద్రత ఏజెన్సీలను ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు సహాయపడ్డాయి. అజిత్ మానసిక యుద్ధంలోనూ నిష్ణాతుడు. యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, సయ్యద్ అలీ షా గిలానీ లను చర్చల పట్టికలోకి తీసుకున్నాడు. 2004లో యూపీఏ ప్రభుత్వం అజీత్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమించింది. అజిత్ దోవల్ పదవి విరమణ చేసినప్పటికీ ఐదవ జాతీయ భద్రత సలహాదారుగా మోడీ ప్రభుత్వం నియమించింది. 2014లో 46 మంది భారతీయ నర్సులను ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లు బందీలుగా తీసుకున్నప్పుడు వారిని విడుదల చేయడంలో అజిత్ ముఖ్యపాత్ర పోషించారు.. ఉరిలో భారతీయ సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతంగా రూపొందించిన ఘనత అజిత్ కే చెందుతుంది. డోక్లామ్ ప్రతిష్టంభనను కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. ఈశాన్య ప్రాంతాల్లో తిరుగుబాటుదారులను పూర్తిగా తొక్కిపడేశాడు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు బాలకోట్లోని జేఎం క్యాంప్ పై జరిగిన ఐఏఎఫ్ పైమానిక దాడిలో అతడి హస్తం ఉంది.
-హౌడి మోడీ పేరిట పర్యటించినప్పుడు..
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాత ధరకే భారత ప్రభుత్వం చమురు కొన్నది. నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల వల్ల గల్ఫ్ దేశాలు నిరసన ప్రకటించాయి. తర్వాత గంటల్లోనే నిర్ణయాన్ని మార్చుకున్నాయి. ఆ మధ్య అమెరికాలో భారత ప్రధాని హౌ డి మోడీ అనే పేరిట సభ నిర్వహిస్తే లక్షలాది మంది జనం వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే విదేశాంగ విధానంలో జై శంకర్ చేసిన అద్భుతాలు ఎన్నో. ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిగా, ఇండియన్ ఫారెన్ సెక్రటరీగా, ఇండియన్ ఫారెన్ మినిస్టర్ గా అతడు పోషించిన పాత్రలు వేటికవే విభిన్నం. వేలకోట్ల రూపాయల వ్యాపారాలు సాగుతున్నప్పటికీ ఒక రూపాయి కూడా పక్కదారి పట్టకుండా నిర్వహించిన ఘనత ఆయనది. ప్రస్తుతం ఆయన మోడీ తూరుపుముక్క.. జై శంకర్ ది తమిళ బ్రాహ్మణ మూలాలో ఉన్న కుటుంబం. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం ఒక సివిల్ సర్వెంట్.. విదేశీ వ్యవహారాలపై సుబ్రహ్మణ్యానికి మంచి పట్టు ఉంది. బహుశా అదే జై శంకర్ ను సివిల్ సర్వీస్ వైపు వెళ్లేలా చేసింది. 1977లో జై శంకర్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ కు ఎంపిక అయ్యాడు. ఎక్కువకాలం అమెరికా, సింగపూర్, చైనా, రష్యా లో పని చేశాడు. 2019లో హౌడి మోడీ అనే ప్రోగ్రాంను అతడే ముందుండి నడిపించాడు. అతడి పని తీరుకు ముగ్ధుడైన నరేంద్ర మోడీ కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా జై శంకర్ ను నియమించాడు.. విదేశాంగ కార్యదర్శిగా, ఒక రాయబారిగా, విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసిన ఘనత బహుశా జై శంకర్ కే దక్కుతుంది కాబోలు.
ఈ ముగ్గురు కూడా మోడీ తురుపు ముక్కలు. భారతదేశ విదేశాంగ విధానం పకడ్బందీగా నడుస్తుండడంలో వీరి పాత్ర అనన్య సామాన్యం. మోదీని ద్వేషించవచ్చు. ప్రేమించవచ్చు. కానీ విదేశాంగ విధానంలో అతని తప్పు పట్టాల్సిన అవసరం గానీ ఉండదు. మోడీ వెనుక వీరు ముగ్గురు ఉద్దండులు ఉన్నారు. వీరికి దేశం తప్ప వేరే వ్యాపకం లేదు. అందుకే భారత్ ఇవాళ ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని నిలువరించగలిగే స్థాయికి వచ్చింది. అమెరికాను సైతం ప్రశ్నించగలిగే స్థాయికి ఎదిగింది. ఇంతకంటే ఏం చెప్పగలం మన దేశం మారింది అని అనడానికి?!