Pawan Kalyan TDP: ఏపీలో పొత్తుల రాజకీయం మొదలైనప్పటి నుంచి కింగ్ మేకర్ గా పవన్ కళ్యాణ్ అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సాధించే సీట్లు తక్కువే కావచ్చు.. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయలేకపోవచ్చు. కానీ ఏపీలో నిర్ణయాత్మకశక్తిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ పై వ్యతిరేకత.. టీడీపీ నిస్సహాయతను క్యాష్ చేసుకొని కొన్ని సీట్లు సాధిస్తే ఖచ్చితంగా జనసేనాని ఏపీలోని ఏలవచ్చు.

ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే జగన్ ను ఓడించాలంటే పవన్ అన్నట్టు వ్యతిరేక ఓటు చీలకుండా ఏపీలోని ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిపోవాలి. కానీ ఈ కలయిక జరగడం అసాధ్యంగా తోస్తోంది. ఎందుకంటే టీడీపీ వాపు(మహానాడు క్రేజ్)ను చూసుకొని బలుపుగా భావించి ఒంటరిగా పోటీకి సిద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీ పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి ఇప్పుడు ‘అబ్బే అదేం లేదే’ అంటూ మాట మార్చేసింది. కేంద్రంలో అవసరార్థమే బీజేపీ రాజకీయాలు ఉంటాయని దీన్ని బట్టి అర్థమవుతోంది.
మరి ఈ పొత్తుల కొట్లాటలో కీలకమైన పవన్ కళ్యాణ్ అడుగులు మాత్రం మెజార్టీ సీట్లు దక్కించుకోవడం వైపే పడుతున్నాయని చెప్పొచ్చు. అందుకే అక్టోబర్ 5 నుంచి ఏపీ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రజా బలంతోనే జనసేనను బలోపేతం చేసి టీడీపీ, బీజేపీలను తన కాళ్ల బేరానికి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ అడుగులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా పడుతున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ప్రస్తావించారు. ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనమయ్యాయి. మంచి రాజకీయ విశ్లేషకుడిగా పేరుగాంచిన ఉండవల్లి ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం తప్ప టీడీపీకి మరో ఆప్షన్ లేదని కుండబద్లలు కొట్టారు. ‘పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వ్యక్తి. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు. అందుకు టీడీపీ ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ కు కొత్తగా పోయేదేమీ లేదు. కాకపోతే టీడీపీ పార్టీని జగన్ ఖచ్చితంగా భూస్థాపితం చేస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే చంద్రబాబే ఒక అడుగు వెనక్కి వేసి పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందేమో’ అంటూ టీడీపీ నిస్సహాయత, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను ఉండవల్లి నొక్కి చెప్పారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ బతకాలంటే.. మనుగడ సాధించాలంటే పవన్ కళ్యాణ్ అసవరం ఎంతైనా ఉంది. టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే జగన్ ఖచ్చితంగా ఆ పార్టీని భూస్తాపితం చేయడం ఖాయం. ఇప్పటికే గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి.. టీడీపీని కేవలం 23 సీట్లకే పరిమితం చేశాడు. చంద్రబాబుకు వయసు అయిపోవడం.. లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేక బాధ్యతను అందిపుచ్చుకోలేకపోవడంతో టీడీపీలో జగన్ ను ఎదురించే దమ్ము ధైర్యం మొండితనం లేకుండా పోయాయి. స్వయంగా చంద్రబాబే చిన్న పిల్లాడిలా ఏడ్వడంతో టీడీపీ శ్రేణుల్లోనూ గెలుపుపై ధీమా లేకుండా పోయింది.
ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో బలంగా నిలబడుతున్నాడు. వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. చంద్రబాబులా భయపడడం లేదు. వెనక్కి తగ్గడం లేదు. అందుకే పవన్ తోనే ఇప్పుడు జగన్ కు ముప్పు ఉంది. పవన్ ను విస్మరిస్తే చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నట్టు అవుతుంది. ఉండవల్లి అన్నట్టు పవన్ కళ్యాణ్ ను సీఎంగా ప్రకటించకపోతే టీడీపీ పని ఖతమైనట్టే. మరి ఆ పనిని చంద్రబాబు చేస్తాడా? లేక తన పార్టీని మరింతగా కృంగదీస్తాడా? అన్నది వేచిచూడాలి.