TDP Alliance : గెలవాలంటే తప్పదు.. కృష్ణా నుంచి గోదావరి వరకు “దేశం” త్యాగాలు చేయాల్సిందే!

ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు సీట్ల కేటాయింపు ఒక కొలిక్కి వస్తుందని టిడిపి నాయకులు చెబుతుంటే.. తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని అటు బిజెపి, ఇటు జనసేన వ్యాఖ్యానిస్తున్నాయి..

Written By: NARESH, Updated On : February 11, 2024 11:53 pm
Follow us on

TDP Alliance : అధికారం.. ఇది చేతిలో ఉంటే అన్ని వ్యవస్థలు కాళ్ళ ముందు సాగిల పడతాయి. బ్యూరోక్రాట్ల నుంచి మామూలు అధికారుల వరకు జి హుజూర్ అంటారు. అందుకే రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్ని మెట్లయినా ఎక్కుతాయి. ఎన్ని మెట్లైనా దిగుతాయి. ప్రస్తుతం ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని టిడిపి తెగ తాపత్రయపడుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని మెట్లైనా దిగివస్తున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. త్వరలోనే బిజెపితో కూడా పొత్తు కుదురుతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సీట్ల కేటాయింపు పై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు పొత్తుకు సంబంధించిన చర్చలే బిజెపితో జరిగినప్పటికీ.. టిడిపి అనుకూల మీడియా మాత్రం సీట్ల కేటాయింపు అని కవరింగ్ ఇచ్చింది. అయితే ఈ సీట్ల విషయంలోనే టిడిపికి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.

సాధారణంగా తనతో పొత్తు కుదుర్చుకునే పార్టీలకు సీట్ల కేటాయింపుల విషయంలో చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తారనే పేరు ఉంది. తమకు అంతగా అనుకూలం అనిపించని నియోజకవర్గాలనే భాగస్వామ్య పార్టీలకు కేటాయిస్తారనే అపవాదు ఉంది. అయితే ఈసారి అలాంటి సీట్లు తీసుకునేందుకు భాగస్వామ్య పార్టీలు ముందుకు రావడం లేదు. ఈసారి టిడిపి కంటే రెండు ఆకులు ఎక్కువే చదివాయవి. పైగా సీట్ల కేటాయింపుకు సంబంధించి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే భాగస్వామ్య పార్టీలు కోరుతున్న సీట్ల ప్రకారం చూసుకుంటే టిడిపికి నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి జాబితా ప్రకారం కృష్ణా నుంచి గోదావరి వరకు టిడిపి చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో పెడన తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన నియోజకవర్గం. అయితే ఈ సీటును తనకు కావాలని జనసేన అడుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం లో టిడిపి నేతల హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానాన్ని బిజెపి అడుగుతున్నట్టు తెలుస్తోంది.. ఇది మాత్రమే కాకుండా విజయవాడ పార్లమెంటు స్థానాన్ని తమకు ఇవ్వాలని బిజెపి కోరుతోంది. వాస్తవానికి ఈ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ స్థానం. మరి దీనిపై కమలనాధులు మనసుపడటంతో ఏమీ చేయలేని పరిస్థితి టిడిపి ది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గం అత్యంత కీలకమైనది. ఈ నియోజకవర్గాన్ని ఇప్పటికే టిడిపి జనసేనకు అప్పగించింది.

పై నియోజకవర్గాలే కాదు.. కొన్ని కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లోనూ పరిస్థితి పై ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం లో ఎవరు పోటీ చేస్తారు అనే విషయం ఇప్పటికీ సందిగ్ధం లోనే ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, ఆచంట, రెండు స్థానాలను జనసేన కోరుతోంది. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో.. ఈ జిల్లాలో జనసేన నాలుగు సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి స్థానాన్ని ఇప్పటికే జనసేనకు టిడిపి కేటాయించింది. అయినప్పటికీ జనసేన నాయకులు రాజమండ్రి ఎంపీ స్థానం కోసం తెలుగుదేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పార్లమెంటు స్థానంలో సినీ నటుడు మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలో ఆమె పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి పోటీ చేసి ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో ఆమె ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని జనసేన కోరుతున్న నేపథ్యంలో టిడిపి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కృష్ణా, గోదావరి జిల్లాలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన గుంటూరులోనూ సీట్ల కేటాయింపులు సరికొత్తగా కనిపిస్తున్నాయి. గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్ కు టిడిపి కేటాయించింది. కానీ ఇప్పుడు ఆ స్థానంలో ఆయనను ఆగమంటూ టిడిపి అధిష్టానం చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ స్థానంలో బిజెపి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని బిజెపికి కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ స్థానంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ పార్లమెంటు స్థానాన్ని ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కు కేటాయించారు. పురందేశ్వరి రంగంలో ఉన్న నేపథ్యంలో భరత్ ఈ స్థానాన్ని త్యాగం చేయక తప్పదు. ఈ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కీలక స్థానాలను భాగస్వామ్య పార్టీలు అడుగుతున్న నేపథ్యంలో టిడిపి ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు సీట్ల కేటాయింపు ఒక కొలిక్కి వస్తుందని టిడిపి నాయకులు చెబుతుంటే.. తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని అటు బిజెపి, ఇటు జనసేన వ్యాఖ్యానిస్తున్నాయి.. మరి ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.