ఆంధ్రప్రదేశ్ లో ప్రబలంగా ఉన్న కాపులు ఎవరికి మద్దతిస్తే వారిదే రాజ్యాధికారం.. ఆ కాపులను ప్రభావితం చేసే నాయకులను పువ్వుల్లో పెట్టుకొని చూస్తుంటారు. ‘సీఎం’ పోస్టు తప్ప వారు అడిగినవి ఇస్తుంటారు. అనాది నుంచి కాపులను తమ రాజ్యాధికారానికి పావులుగా రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు మార్చుకుంటున్నాయన్న అపవాదు ఉంది. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఓ కాపు పార్టీ విశాఖ వేదికగా పురుడు పోసుకునే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో వైసీపీ అలెర్ట్ అయ్యింది. వెంటనే కాపు నాయకుడైన వంగవీటి రాధాను దువ్వే పని పెట్టుకుంది. అతడిని వైసీపీలోకి తిరిగి చేర్చుకునేందుకు వల్లభనేని వంశీ, కొడాలి నాని రంగంలోకి దిగారు. తాజాగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

బెజవాడ రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశగా మారుతుంటాయి. బెజవాడలో వంగవీటి కుటుంబానికున్న పట్టు అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వంగవీటి రాధ కదలికలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.. వంగవీటి రాధ, వల్లభనేని వంశీ, కొడాలి నానిలు మంచి మిత్రులు. వీరంతా ఒకప్పుడు టీడీపీలో కొనసాగారు. చంద్రబాబు మీద కోపంతో కొడాలి నాని వైసీపీ చేరి మంత్రిగా కొనసాగుతున్నారు. వల్లభనేని వంశీ టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచినా ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే వంగవీటి రాధ మాత్రం టీడీపీలోనే ఉన్నారు. కాగా ఇటీవల ఆయన కొడాలి నాని, వల్లభనేని వంశీతో కలవడం ఆసక్తిగా మారింది.
తాజాగా వంగవీటి రాధ వల్లభనేని వంశీతో భేటి అయ్యారు. అయితే మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పారు. కానీ గత కొన్ని రోజులుగా వంగవీటి రాధను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కొడాలి నాని, వంశీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వంగవీటి రాధ మాత్రం టీడీపీ వీడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల టీడీపీ నాయకుడు పట్టాభిని అరెస్టు చేసినప్పుడు వంగవీటి రాధ స్పందించారు. ఆ సమయంలో వైసీపీపై విమర్శలు చేశారు. దీంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నట్లు అర్థమైంది.
కాగా గతంలో వంగవీటి రాధతో ఓ ఫంక్షన్లో కొడాలి నాని, వంశీలు కలుసుకున్నారు. ఓ వైసీపీ నేత శుభకార్యానికి వంగవీటి రాధ వెళ్లారు.ఈ సమయంలో వీరిద్దరు పక్కపక్కనే కూర్చోని కాసేపు మాట్లాడుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వంగవీటి రాధ వైసీపీలోకి వస్తారనే ప్రచారం సాగింది. కానీ ఆ తరువాత దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో ఆ విషయం కాస్త మరుగున పడింది.
అయితే తాజాగా వల్లభనేని వంశీతో రాధ భేటి కావడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే వంగవీటికి ఎమ్మెల్సీ లేదా ఏదైనా ప్రధాన పదవి ఇచ్చి పార్టీలోకి తీసుకోవచ్చని అనుకుంటున్నారు. కొడాలి నాని నియోజకవర్గం నుంచి వంగవీటికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వల్లభనేని వంశీ భేటి కేవలం మర్యాదపూర్వకమేనని అంటున్నారు. వంగవీటి రాధను వైసీపీలోకి తీసుకొస్తే బెజవాడలో ఇక వైసీపీకి తిరుగులేకుండా ఉంటుందని అంటున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే వంగవీటిని పార్టీ వీడకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట..
మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వైసీపీ ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముఖ్య నాయకులందరినీ పార్టీలో చేర్చుకునే పనిలో ఉంది. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా టీడీపీకి కాస్త పట్టు ఉంది. దీంతో ఇక్కడ కూడా టీడీపీకి నామరూపాల్లేకుండా చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వంగవీటితో సంప్రదింపులు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది. మరి ఈ కాపుల మద్దతు కోసం సాగుతున్న రాజకీయం టీడీపీకి ఫేవర్ గా ఉంటుందా? వైసీపీకి కలిసివస్తుందా? అన్నది వేచి చూడాలి?