Taylor Swift : అమెరికా ఎకానమీకి ఒక ఊపు ఇస్తున్న సింగర్‌.. పాటకు ఇంత పవరుంటుందా?

జో బైడెన్‌ చేయలేనిది, కమలా హారీస్‌ చక్కబెట్టలేనిది.. ఓ 33 ఏళ్ల వయసున్న యువతి ఏం చేసిందనేదే కదా మీ అనుమానం? అయితే ఈ ఆసక్తికర కథనం మీరూ చదివేయండి.

Written By: Bhaskar, Updated On : July 15, 2023 9:12 pm
Follow us on

Taylor Swift : సంగీతానికి రాళ్లయినా కరుగుతాయి అంటారు పెద్దలు. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. పాశ్యాత్య దేశాల్లో ఓ మైకేల్‌ జాక్సన్‌, షకీరా, మడోనా, లేడీ గాగ… వంటి వారు పాడితే ప్రపంచమే మారుమోగింది. మిస్సమ్మ సినిమాలో భూమిక పాడినట్టు.. వారు పాడితే లోకమే ఊగింది. వారు ఆడితే ఓలలాడింది. సరే వారి హవా ఇప్పుడు తగ్గింది. మైకేల్ జాక్సన్ భూమ్మీదే లేకుండా పోయాడు. అయితే ఇప్పుడు 33 ఏళ్ల టేలర్‌ స్విఫ్ట్‌ అనే యువతి అమెరికాను ఒక ఊపు ఊపుతోంది. పాప్‌ స్టార్‌ అవతారం ఎత్తింది. తన మత్తయిన గొంతుతో సంగీత ప్రపంచాన్ని షేక్‌ చేస్తోంది. అంతేకాదు దివాళా అంచులో ఉన్నట్టు వార్తలు వచ్చిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్ట్‌ ఇచ్చింది. జో బైడెన్‌ చేయలేనిది, కమలా హారీస్‌ చక్కబెట్టలేనిది.. ఓ 33 ఏళ్ల వయసున్న యువతి ఏం చేసిందనేదే కదా మీ అనుమానం? అయితే ఈ ఆసక్తికర కథనం మీరూ చదివేయండి.

సంగీతంతో కొట్టేసింది

టేలర్‌ స్విఫ్ట్‌.. ఈ 33 ఏళ్ల సంచలనం అమెరికాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉండే ఆ దేశంలో వారందరినీ కాదని ట్రెండింగ్‌లో ఉంది. అంతే కాదు తన గాత్ర మాధుర్యంతో ఏకంగా గ్రామీ అవార్డు కూడా దక్కించుకుంది. అలాంటి ఈ యువ సంచలనం అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కట్టు తప్పడం ప్రారంభమైంది. అందువల్లే ఫెడరల్‌ బ్యాంకు పలుమార్లు వడ్డీ సవరణలు చేసింది. ఇది అంతిమంగా ఆర్థిక మాంద్యానికి కారణమైంది. దీనికి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తోడు కావడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. లావాదేవీలు లేక పెద్ద పెద్ద కంపెనీలు లే-ఆఫ్‌ ప్రకటించాయి. దీనివల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి తోడు అమెరికాకు ప్రధాన ఆదాయానికి ఆయువుపట్టయిన ఆతిథ్య రంగం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఇది అంతిమంగా ఆ దేశ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇటీవల అనూహ్యంగా అతిథ్య రంగం కోలుకుంది. అమెరికా ఎకానమీకి అది మంచి బూస్టప్‌ ఇచ్చింది. ఇందుకు గల కారణాన్ని యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తన నివేదికలో వెల్లడించింది. టేలర్‌ స్విఫ్ట్‌ అనే పాప్‌ స్టార్‌ వల్లే ఇదంతా సాధ్యమైందని ప్రకటించింది. ఆమె సంగీతంతో కొట్టేసిందని వివరించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఫిలడెల్ఫియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇది విందు వినోదాలకు ప్రధాన కేంద్రం. ఇటీవల తానా మహాసభలు కూడా ఇక్కడే జరిగాయి. ఆర్థిక మాంద్యం వల్ల ఇక్కడ విందువినోదాలు తగ్గాయి. ఆతిథ్య రంగం బలంగా ఉంటే ఈ ప్రాంతంలో హోటళ్లు మొత్తం బోసిపోయాయి. ఇక బిచాణా ఎత్తేయాల్సిన సమయంలో మెరుపుతీగ లాగా టేలర్‌ స్విఫ్ట్‌ అక్కడ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ‘ మే నెల 12, 13, 14వ తేదీలలో ఫిలడెల్పియాలో 67,000 మంది కూర్చునే అమెరికన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో లింకన్‌ ఫైనాన్షియల్‌ ఫీల్డ్‌లో టేలర్ స్విఫ్ట్ మూడు కచేరీలు ప్రదర్శించింది. అనంతరం పెన్సిల్వేనియాకు ఆమె బృందం తిరిగి వచ్చింది. ఇలా 17 రాష్ట్రాలలో 131 కచేరీలు నిర్వహించింది. ఇది గణనీయమైన ఆర్థిక వృద్ధి సాధించేందుకు కారణమైంది. ఫిలడెల్పియాలో ఒక హోటళ్లల్లో బుకింగ్‌లు ఇటీవల అసాధారణ రీతిలో పెరిగాయి. టేలర్‌ స్విఫ్ట్‌ కచేరీల వల్ల ఆతిథ్యరంగం ఊపందుకుంది. ప్రజలు భారీగా వస్తున్నారు. దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని’ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వెల్లడించింది. అంతే కాదు కరోనా తర్వాత ఈ స్థాయిలో ఆతిథ్య రంగం ఊపందుకోవడం గొప్ప విషయమని పేర్కొంది. గత నెలలో చికాగోలో టేలర్‌ స్విఫ్ట్‌ కచేరీ నిర్వహించినప్పుడు హోటల్‌ ఆక్యూపెన్సీ రికార్డు బద్దలు కొట్టినట్టు ప్రముఖ మార్కెటింగ్‌ సంస్థ ‘చూస్‌ చికాగో’ అభిప్రాయపడింది. టేలర్‌ స్విఫ్ట్‌, బెయోన్స్‌ వంటి తారలు చేస్తున్న కచేరీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నది.