T20 World Cup Final: England beat Pakistan : ఫైనల్ మ్యాచ్ కి ముందు పాకిస్తాన్ ప్రధాని షేహబాజ్ ట్వీట్ చేసినట్టు 152/0 స్థాయిలో నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ లాంటి ఆరంభం లభించలేదు. ఆ మాటకు వస్తే కివీస్ మీద కొట్టినట్టు భారీ స్కోర్ పాకిస్తాన్ చేయలేదు. ఫామ్ లోకి వచ్చిన రిజ్వాన్ 15 దగ్గరే అగాడు. భారీగా ఆడతాడు అనుకున్న బాబర్ అజామ్ 32 వద్దే ముగించాడు. శాన్ మసూద్ 38 దగ్గరే వెనుదిరిగాడు. వెరసి మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సామ్ కరణ్, జోర్డాన్, రషీద్ ధాటికి 137 దగ్గరే పాక్ ఆగిపోయింది. అచ్చం సెమీస్ లో భారత్ బ్యాటింగ్ ను గుర్తు చేసింది. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు మాత్రమే ఉన్నాయంటే ఇంగ్లీష్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

ఏవి తండ్రి ఆ మెరుపులు
పాకిస్తాన్ టి20 సెమీస్ చేరడమే అదృష్టం. కానీ ఆ జట్టు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పై ఆడిన తీరు అమోఘం. ముఖ్యంగా సెమిస్ మ్యాచ్లో బాబర్, రిజ్వాన్ ఎలా చెలరేగారో చూశాం కదా! ఏకంగా తొలి వికెట్ కు 152 పరుగులు జోడించారు. ఫలితంగా హోరా హోరీగా సాగుతుంది అనుకున్న మ్యాచ్ ఏకపక్షం అయింది. వెరసి పాకిస్తాన్ ఫైనల్ చేరింది. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లీష్ బౌలర్లు ధాటికి 137 వద్దే ఆగింది. సామ్ కరణ్ పాక్ వెన్ను విరిచాడు. 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. బాబర్, శాన్ మసూద్ గనుక నిలబడి పోయి ఉండకుంటే పాక్ కథ మరోలా ఉండేది.

ఇంగ్లాండ్ కూడా అదే దారి
భారత్ తో జరిగిన సెమీస్ పోరు లో జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఎలా ఆడారు? 169 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఉదేశారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో వారి పప్పులు పాక్ బౌలర్ల ముందు ఉడక లేదు. అలెక్స్ హేల్స్ 1 పరుగు మాత్రమే చేసి షాహిన్ షా ఆఫ్రిది కి వికెట్ల ముందు దొరికిపోయాడు. 26 పరుగులు చేసి బట్లర్ భారీ స్కోర్ సాధించే క్రమంలో రౌఫ్ బౌలింగ్ లో రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఫీల్ సాల్ట్ 10 పరుగులకు వెను దిరిగాడు. బ్రూక్ కూడా 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఒకానొక దశలో మ్యాచ్ పాక్ వైపు మొగ్గుతున్నట్టు కనిపించింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే జట్టు స్కోర్ 132 వద్ద ఉన్నప్పుడు మొయిన్ అలీ జూనియర్ వసీం బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇదే దశలో బెన్ స్టోక్స్ 50 పరగులు పూర్తి చేసుకున్నాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కొంప ముంచిన ఇఫ్తీకార్
మ్యాచ్ పాక్ వైపు మొగ్గుతోంది అనుకున్నప్పుడు ఇఫ్తీకార్ కు కెప్టెన్ బౌలింగ్ ఇచ్చాడు. కానీ ఈ ఓవర్ లో ఇంగ్లీష్ జట్టు 13 పరుగులు పిండుకుంది. ఇదే మ్యాచ్ ను టర్న్ చేసింది. ఒకవేళ ఈ ఓవర్ లో అతడు మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెన్ స్టోక్స్ 89 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.. టీ 20 ఫైనల్ లో పాక్ పై యాఫ్ సెంచరీ చేసి మరోసారి కప్ అందించాడు.