T20 World Cup 2022 : టి20 క్రికెట్ అంటేనే అభిమానులు చెవులు కోసుకుంటారు. మన దేశమే కాదు ప్రపంచంలోని మిగతా దేశాల్లోనూ క్రికెట్ అంటే ఫాన్స్ కు పండగే పండగ. వాస్తవానికి గతంలో 50 ఓవర్ల మ్యాచ్కు విపరీతమైన క్రేజ్ ఉండేది.. ఎప్పుడైతే టి20 మొదలైందో దానికి మించి క్రేజ్ పాతుకు పోయింది. మొన్నటికి మొన్న హైదరాబాదులో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్ చూసేందుకు అభిమానులు టికెట్ల కోసం ఎంతలా కొట్టుకున్నారో చూశాం కదా! అది మరి క్రికెట్ అంటే.

-ఆరంభమే హై టెన్షన్
క్వాలిఫైయర్స్ మ్యాచులు పూర్తయ్యాక అసలైన సంబరం ఈనెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఆరోజు నుంచి సూపర్ 12 పోటీలు మొదలవుతాయి. తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్ధులు ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఢీకొంటాయి. మరుసటి రోజు అంటే 23న పాకిస్తాన్, భారత జట్ల మధ్య హోరాహోరీ సంగ్రామం ఉంటుంది. అసలే వరల్డ్ కప్. అందునా ఇటీవల ఆసియా కప్ లో పరాభవం. ఎందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ కసిగా ఎదురుచూస్తోంది.
-టైటిల్ ఫేవరెట్లు ఎవరంటే
టి20 లో జోస్యాలు పెద్దగా ఫలించవు. గత ఏడు ఎడిషన్లలోనూ అనూహ్యమైన ఫలితాలే వచ్చాయి. పేరుకు 16 జట్లు బరిలో ఉన్నప్పటికీ.. వాటిల్లో 8 మాత్రమే బలమైనవి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను టైటిల్ ఫేవరెట్లుగా అభిమానులు భావిస్తున్నారు. భారత్ ఆయుధం బ్యాటింగ్. సొంత గడ్డ ప్రయోజనం ఆసీస్ ది. ఆల్ రౌండర్ నైపుణ్యం ఇంగ్లాండ్ సొంతం. పక్కనే ఉన్న న్యూజిలాండ్ కు కూడా పరిస్థితులు అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. పైగా న్యూజిలాండ్ జట్టు అటు వరల్డ్ కప్, టి20 కప్ ఏ ఒక్కటినీ గెలుచుకోలేదు. ఆసియా కప్ గెలుచుకున్న ఆనందంలో శ్రీలంక ఉంది. ఇక రెండుసార్లు t20 వరల్డ్ కప్ గెలుచుకున్న చరిత్ర వెస్టిండీస్ ది. రెండో ఎడిషన్లో టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న పాకిస్తాన్ జట్టును అంత తేలిగ్గా తీసిపారేయలేం.
-బెట్టింగే బెట్టింగ్
టి20 మ్యాచ్ లు అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మైదానంలోనే కాదు వెలుపల పోటీ కూడా రసవత్తరంగానే సాగుతుంది. దానినే బెట్టింగ్ అంటారు. అధికారిక ఆన్లైన్ బెట్టింగ్ ల నుంచి.. ఇరుగుపొరుగు ఇళ్లల్లో పిల్లలు కట్టే పందాలను లెక్క కడితే వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి.. మూడో కంటికి తెలియకుండా అంతా ఆన్లైన్లోనే సాగుతుంది. మ్యాచ్ ఫలితాలు మాత్రమే కాదు.. బంతి బంతికీ బెట్టింగ్ వేయడం టి20 ప్రత్యేకత.
-విజేతకు ఎన్ని కోట్లు అంటే
టి20 వరల్డ్ కప్ విన్నర్ కు 1.6 మిలియన్ అమెరికా డాలర్లు భారత కరెన్సీ లో చెప్పాలంటే 13 కోట్ల 25 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ గా ఇస్తారు. రన్నరప్ జట్టుకు ఎనిమిది లక్షల డాలర్లు ఇస్తారు. ఇక గ్రూప్ దశలో ఆడిన ప్రతి జట్టుకు ఐసీసీ నిబంధనల ప్రకారం నగదు ఇస్తారు. అయితే ఇటీవల టి20 మ్యాచ్ లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో నగదు ను పెంచారు.
-టి 20 అంటే ఒక విప్లవం
ఐదు రోజుల సంప్రదాయ టెస్టుల్ని పక్కకు నెడుతూ, వన్డే మ్యాచ్లు తెరపైకి వచ్చాయి. అందులోనూ ఎన్నో మార్పులు జరిగాయి. 50 ఓవర్లకు ఇన్నింగ్స్ కుదింపు.. రంగుల దుస్తులు… డే అండ్ నైట్ మ్యాచులు… పవర్ ప్లేలు… విప్లవం అంటేనే టి20 లది. 2007లో టి20 వరల్డ్ కప్ మొదలైనప్పుడు ఈ ఫార్మాట్ పై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు.. సచిన్, ద్రావిడ్, గంగూలీ వంటి సీనియర్ల గైర్హాజరుతో ఏమాత్రం అంచనాలు లేకుండా భారత జట్టు బరిలోకి దిగింది. లీగ్ దశలో పడుతూ లేస్తూ సాగింది. పాకిస్తాన్ పై బౌల్ ఔట్ విజయంతో పుంజుకుంది. ఇంగ్లాండ్ జట్టుపై ఆరు బంతుల్లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు బాదాడు. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ ను క్రీడాభిమానులు మర్చిపోలేరు. ఫైనల్ లో పాకిస్తాన్తో నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత జట్టు గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అద్భుతం. టి20 శకానికి అది ఒక ఆరంభమని క్రీడా పండితులు చెబుతుంటారు. ధోని సారథ్యానికి గట్టి పునాది కూడా ఇక్కడే పడిందని వారు నమ్ముతుంటారు. ఎప్పుడైతే ఈ టి20 సిరీస్ విజయవంతమైందో ఇక ఐసీసీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆపై ఐపీఎల్ విశ్వ క్రికెటర్లను ఒక్కటిగా చేర్చిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.