Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan : జగన్ అసలు రూపం.. స్వరూపానందుడికి ఇప్పటికి బోధపడింది

CM Jagan : జగన్ అసలు రూపం.. స్వరూపానందుడికి ఇప్పటికి బోధపడింది

CM Jagan : క్షవరం అయితే గాని వివరం అర్థం కాదు అంటారు పెద్దలు. అలా అర్థమైంది కాబోలు విశాఖ శారదపీఠం స్వరూపానందేంద్ర స్వామికి…అందుకే జగన్ ప్రభుత్వం పై రెచ్చిపోయారు. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యాన్ని చూడలేదని ఆవేదన చెందారు.. స్వరూపానందేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా.. వైసిపి బ్యాచ్ స్వరూపానందేంద్ర మీద పడింది. మొన్నటి దాకా ఆయన కాళ్ళ మీద పడిన వారంతా…ఇప్పుడు దూషించడం మొదలుపెట్టారు. వైసిపి అంటే అదే కదా… అందితే జుట్టు, లేకుంటే కాళ్ళు..

ఉత్తరాంధ్రలోని సింహాచలం క్షేత్రం ఎంతో ప్రాశస్త్యం పొందింది. అక్షేత్రంలో కొలువై ఉన్న అప్పన్న స్వామికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో చందనోత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకను చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వస్తూ ఉంటారు. అలాంటి వేడుకకు ప్రభుత్వం ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. నిధులు లేవో, లేకుంటే మమ్మల్ని అడిగే వారు ఎవరు అనుకున్నారేమో గాని చందనోత్సవానికి ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు. పైగా ఈ కార్యక్రమానికి విశాఖ శారదపీఠం అధిపతి స్వరూపానందేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అక్కడ ఏర్పాట్లు చూసి పెదవి విరిచారు. ప్రభుత్వం పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు సామాన్య భక్తులకు దేవుడిని దూరం చేసేలా ఉందని మండిపడ్డారు.. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప, సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. తన జీవితంలో ఇలాంటి చందనోత్సవానికి హాజరవుతానని కలలో కూడా అనుకోలేదని స్వరూపానందేంద్ర అన్నారు. ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని స్వరూపానందేంద్ర అన్నారు.

కొండకింది నుంచి పైవరకు రద్దీ ఉన్నప్పటికీ జవాబు చెప్పేవారు లేరని స్వరూపానందేంద్ర వాపోయారు.. తన జీవితంలో ఇంతటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని స్వరూపానందేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం చేసుకోవడం తనకు బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర వ్యాఖ్యానించారు.. వాస్తవానికి అప్పన్న చందనోత్సవం మాత్రమే కాదు తిరుపతి నుంచి శ్రీశైలం వరకు హిందూ దేవుళ్ళపై ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరు ఇలాగే ఉంది. హిందూ దేవుళ్ళ హుండీ ఆదాయంపై పెత్తనం చెలాయిస్తున్న ప్రభుత్వం.. ఆలయాల అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు. మొన్నటికి మొన్న అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒకరు తిరుపతి దైవ దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకాడుతుండడం విశేషం.

వాస్తవానికి స్వరూపానందేంద్ర స్వామి జగన్ అధికారంలోకి రాగానే సంబర పడ్డారు. జగన్ శారద పీఠం వద్దకు వెళ్ళగానే నుదుటి పై ఒక ముద్దు పెట్టారు..జగన్ అధికారంలోకి వచ్చేందుకు యాగాలు చేశానని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాడు కనుక ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా మారుతుందని వ్యాఖ్యానించారు. కానీ నాలుగేళ్లు గడిచాక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక్కసారిగా మారిపోయింది. అప్పులు మరింత పెరిగాయి. అధికార పార్టీ దౌర్జన్యాలు తారాస్థాయి చేరుకున్నాయి. దళిత వైద్యుడు సుధాకర్ నుంచి మొదలుపెడితే అధికార పార్టీ దాష్టీకాలు అంతకుమించి అనే స్థాయి దాకా వెళ్లాయి. కానీ ఏనాడు కూడా నోరు మెదపని స్వరూపానందేంద్రస్వామి.. తన దాకా వచ్చాక జగన్ స్వరూపం ఏంటో అర్థమైంది.. అయినా ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు దౌర్భాగ్యమని నెత్తినోరూ కొట్టుకున్నా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఇంట్లో ఎలుకలను బయటికి పంపించేందుకు పాములను తెచ్చి పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు స్వరూపానందేంద్రకు అది అక్షరాలా అర్థమైంది.. అర్ధమైనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పాపమ్ ఆంధ్రప్రదేశ్! నవ్యాంధ్ర కాస్త చందనోత్సవాన్ని కూడా సరిగ్గా చూడలేని ఉత్తరాంధ్ర అయిపోయింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version