Surya Kumar Yadav : బౌలర్ ఎవరైనా కానీ… ఎంత వేగంతో నైనా బంతులు వేయని.. అతడి దూకుడు ఆగలేదు.. లెగ్ సైడ్ బాల్ వేస్తే కీపర్ అవతల పడుతోంది. ఆఫ్ సైడ్ బాల్ వేస్తే స్టాండ్స్లోకి దూసుకెళ్తోంది.. అంటే ఎక్కడ వేసినా, ఎలా వేసినా ఫైనల్ రిజల్ట్ మాత్రం బంతి అవతల పడటం. సచిన్ కి తెలియని టెక్నిక్ ఇది. బ్రాడ్ మన్ బతికి ఉంటే బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాని బ్యాటింగ్ ఇది.. ఎబి డివిలియర్స్ కు అర్థం కాని శైలి ఇది. ఇంతకంటే ఎక్కువ ఉపమానాలు రాస్తే అతని బ్యాటింగ్ కు దిష్టి తగులుతుంది ఏమో. ఎవరైనా అదృష్ట జాతకుడిని ఒంటిమీద మచ్చ వేసుకుని పుట్టావ్ ఏంట్రా అంటామ్.. కానీ సూర్య విషయంలో బ్యాట్ వేసుకుని పుట్టాడేమో అని అనలేమో…

భీకర ఇన్నింగ్స్
రాజ్కోట్ లో శ్రీలంకతో జరిగిన మూడో టి 20 మ్యాచ్ ను బహుశా లంక ఆటగాళ్లు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే అలా సాగింది మరి సూర్య ఇన్నింగ్స్.. వచ్చి రాగానే ఎదురుదాడి మొదలుపెట్టిన సూర్య చివరిదాకా క్రీజ్ లోనే ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లు అలవోకగా కోడుతూ శ్రీలంక బౌలర్లకు నిద్రలేని రాత్రులు పరిచయం చేశాడు. హసరంగ, తీక్షణ, కరుణ రత్న, నిసంక,రజిత ఇలా బౌలర్లు మాత్రమే మారారు. కానీ పరుగుల వరదలో మాత్రం తేడా రాలేదు. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు అంటే సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
బంతిని స్టాండ్ లోకి పంపించేందుకే
సూర్య కుమార్ యాదవ్ ఆట తీరు చూస్తే ఆశ్చర్యం కలగమానదు. ఎందుకంటే బౌలర్లు ఎలాంటి బంతులు విసిరినప్పటికీ అతడు కసి తీరా బాదాడు. మరీ ముఖ్యంగా రజిత వేసిన ఓవర్లో ఒళ్ళును విల్లు లాగా వంచి లెగ్ సైడ్ కొట్టిన సిక్సర్ ఈ మ్యాచ్ కే హైలెట్.. ఇక ఇదే కోవలో రెండు సిక్సర్లు కూడా అలానే బాది భారత ప్రేక్షకులను మైదానంలో కేరింతలు కొట్టేలా చేశాడు.. శ్రీలంక బౌలర్లకు కన్నీటిని మిగిలించాడు.

ఈ జోరు ఇలాగే కొనసాగని
సూర్య కుమార్ యాదవ్ భారత బ్యాటింగ్ దళానికి బలమైన వెన్నెముక. ఇలా అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న పూణేలో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ తో కలిసి అతడు ఆడిన సుదీర్ఘ ఇన్నింగ్స్ భారత జట్టును దారుణమైన ఓటమి నుంచి బయటపడేసింది. ఒకవేళ వారిద్దరూ కుదురుకోకుంటే భారత్ ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చేది. ఇక ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టి20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడి ప్రత్యర్ధులకు రాజ్కోట్ లో సెంచరీ చేసి హెచ్చరికలు పంపాడు. ఫార్మాట్ మాత్రమే మారింది సూర్య ఎప్పటికీ మారడు అని.. టి20 కెరియర్ లో ఇప్పటికే మూడు సెంచరీలు, 48 ఆఫ్ సెంచరీలు చేసిన సూర్య… మరిన్ని మెరుగైన ఇన్నింగ్స్ ఆడి… భారత జట్టును విజయతీరాలకు చేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ సూర్య.