https://oktelugu.com/

Dasara 2023 : దసరా ప్రత్యేకత, ప్రశస్త్యం ఏంటి? ఈరోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?

పాలపిట్ట దర్శనం వల్ల చేసే ప్రతి పనిలోనూ గెలుపు తప్పకుండా లభిస్తుందన్న విశ్వాసం ఉంది.అందుకే విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2023 / 09:25 AM IST
    Follow us on

    Dasara 2023 : పండుగ అంటే ఇంటిల్లి పాది కలిసి చేసుకునే వేడుక.. కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి సందడి చేసుకునే వేడుక. అలాంటి పండుగల వెనుక పరమార్థం ఎంతో ఉంది. పురాణపరంగానే కాకుండా సాంస్కృతికంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ విజయదశమి. మంచిపై చెడు గెలిచిన రోజుగా భారతదేశమంతటా దసరా పండుగను ఘనంగా జరుపుకొంటారు. విజయదశమి నాడు ఏది ప్రారంభించినా విజయం తథ్యం అనే విశ్వాసం ఉంది. ఇది మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించిన రోజనీ, రావణుణ్ణి శ్రీరాముడు వధించిన రోజు అనీ పురాణాలు పేర్కొంటున్నాయి. అలాగే మహాభారత ఇతిహాసం ప్రకారం… జమ్మిచెట్టు మీద పాండవులు తమ ఆయుధాలను దాచిన ఆయుధాలను తీసుకున్న రోజు ఇది. మానవులు ధర్మ మార్గంలో నడవాలనీ, దాని కోసం తమలో ఉండే ‘కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలు’ అనే అరిషడ్వర్గాలను (ఆరు శత్రువులను) జయించాలనీ… అదే ఈ విజయదశమి లేదా దసరా పండుగ మనకు సూచిస్తుందనీ పెద్దలు చెబుతారు.

    శమీ పూజ…

    విజయదశమి రోజున అపరాజితాదేవిని శమీవృక్షం వద్ద పూజించే సంప్రదాయం ఉంది. శమీ వృక్షం (జమ్మి చెట్టు)లో అపరాజితా దేవి కొలువై ఉంటుందని విశ్వాసం. అమ్మవారి సహస్ర నామాల్లో ‘అపరాజిత’ ఒకటి. అంటే ‘పరాజయం లేనిది’ అని అర్థం. విజయానికి ఆమె అధిదేవత. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా’ అని ‘అపరాజితా స్తోత్రం’ వర్ణించింది. అపరాజితా దేవి సర్వ జీవుల్లో శక్తి రూపంలో ఉంటుందని భావం. దానవీయ గుణాలపై గెలుపు సాధించడానికి మనలో ఉన్న శక్తిని ప్రేరేపించాలని అమ్మవారిని ప్రార్థించాలి.

    క్షీరసాగర మథనం చేసినప్పుడు..

    దేవ దానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉద్భవించిన పవిత్రమైన దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు ఒకటి.. అందుకే యాగాల కోసం నిప్పు రాజెయ్యడానికి జమ్మి చెట్టు కలపనే వినియోగించేవారు. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు శమీ వృక్షానికీ, అపరాజితా దేవికీ పూజలు ఆచరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. పాండవులు అజ్ఞాతవాసం మొదలుపెట్టడానికి ముందు తమ ఆయుధాలను శమీ వృక్షం మీద దాచారనీ, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత వాటిని తిరిగి తీసుకున్నారనీ మహాభారతంలోని విరాటపర్వంలో కథ ఉంది. విజయదశమి రోజున…
    శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని… అనే శ్లోకం పఠించి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే… అపరాజితాదేవి కటాక్షంతో శత్రు భయం తొలగి విజయం చేకూరుతుందనీ, దోషాలు తొలగిపోయి సకల కార్యసిద్ధి కలుగుతుందనీ పెద్దలు చెబుతారు.

    పాలపిట్ట దర్శనం…

    దసరా పండుగలో శమీ వృక్షంతో పాటు పాల పిట్టకు ఉన్న ప్రాధాన్యం కూడా ఎక్కువే. పాలపిట్టను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న జానపద గాథ ప్రకారం… పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వస్తూ ఉండగా, వారికి పాలపిట్ట కనిపించింది. వారు దాన్ని చూసినప్పటి నుంచీ వరుసగా అన్నీ విజయాలే కలిగాయట! పాలపిట్ట దర్శనం వల్ల చేసే ప్రతి పనిలోనూ గెలుపు తప్పకుండా లభిస్తుందన్న విశ్వాసం ఉంది.అందుకే విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు.