Telangana Liberation Day Special Story: సైనిక చర్య నుంచి విలీనం అయ్యేదాకా .. ఆ ఐదు రోజులూ ఏం జరిగిందంటే..

ఉమర్గ్‌ నుంచి 48 కిలోమీటర్ల దూరంలోని రాజసూర్‌ వరకు దారిపొడవునా నిజాం సేనలు భారత సైన్యాన్ని అడ్డగించాయి. కాలం చెల్లిన యుద్ధ విధానాలు, ఆయుధాలతో రజాకార్లు, నిజాం సైన్యం భారత సైన్యం ఎదుట నిలవలే కపోయింది.

Written By: Bhaskar, Updated On : September 17, 2023 8:38 am

Telangana Liberation Day Special Story

Follow us on

Telangana Liberation Day Special Story: సెప్టెంబరు 13

షోలాపూర్‌ నుంచి భారత సైన్యం సంస్థానంలోకి అడుగు పెట్టింది. కీలకమైన నల్‌దుర్గ్‌ పట్టణాన్ని, కోటను స్వాధీనం చేసుకుంది. అక్కడికి సమీపంలో ఉన్న తుల్జాపూర్‌లో భారత సైన్యాన్ని 200 మంది రజాకార్లు అడ్డుకున్నారు. రెండు గంటల పోరాటంలో పలువురు మరణించిన తర్వాత, రజాకార్లు లొంగిపోయారు.

సెప్టెంబరు 14

ఉమర్గ్‌ నుంచి 48 కిలోమీటర్ల దూరంలోని రాజసూర్‌ వరకు దారిపొడవునా నిజాం సేనలు భారత సైన్యాన్ని అడ్డగించాయి. కాలం చెల్లిన యుద్ధ విధానాలు, ఆయుధాలతో రజాకార్లు, నిజాం సైన్యం భారత సైన్యం ఎదుట నిలవలే కపోయింది. వైమానిక దాడులతో దారి చేసుకుంటూ భారత సైన్యం ముందుకు సాగింది. మధ్యాహ్నానికే రాజసూర్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. ఉస్మానాబాద్‌ వద్ద రజాకార్లు భారత సైన్యంతో తలపడ్డారు. సుదీర్ఘంగా సాగిన పోరాటంలో వందలాది మంది రజాకార్లు మరణించారు. మేజర్‌ జనరల్‌ బ్రార్‌ ఆరు దళాల సైన్యంతో ఔరంగాబాద్‌ను స్వాధీనం చేసుకున్నారు. జల్నా పట్టణానికి యుద్ధ శకటాలతో వచ్చిన భారత సైన్యాన్ని రజాకార్లు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు.

సెప్టెంబరు 15

జల్నా నుంచి సైన్యం లాతూర్‌ చేరుకుంది. అక్కడి నుంచి మొమినాబాద్‌కు చేరుకుంటుండగా గోల్కొండ లాన్సర్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. భారత సైన్యం నిజాం సేనలను చిత్తుగా ఓడించింది.

సెప్టెంబరు 16

లెఫ్టినెంట్‌ కల్నల్‌ రాం సింగ్‌ ఆధ్వర్యంలో భారత సేనలు జహీరాబాద్‌ చేరాయి. రజాకార్లు దారంతా మందుపాతరలు అమర్చారు. వాటిని నిర్వీర్యం చేసుకుంటూ సైన్యం ముందుకు సాగింది. సైన్యంపై రజాకార్లు మాటు వేసి కాల్పులు జరిపారు. సైన్యంలో కొంతమందిని అక్కడ ఉంచి, మిగిలిన వారు జహీరాబాద్‌ దాటి 15 కిలోమీటర్ల దూరం ముందుకు సాగారు.

సెప్టెంబరు 17

ఉదయం 5 గంటల ప్రాంతంలో భారత సైన్యం బీదర్‌ను స్వాధీనం చేసుకుంది. మరోవైపు, హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని చిట్యాలను కూడా భారత సేనలు సొంతం చేసుకున్నాయి. డకోటా విమానంలో దిగిన సైనికాధికారి జనరల్‌ చౌధురికి రెపరెపలాడుతున్న భారత పతాకాలు స్వాగతం పలికాయి. ఆరోజు సాయంత్రం 4 గంటలకు నిజాం తన ఓటమిని అంగీకరించాడు. దశాబ్దాల నిజాం పాలనకు, రజాకార్ల దుర్మార్గాలకు తెరపడింది. లక్షలాది మంది హైదరాబాద్‌ సంస్థానం ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. రజాకార్ల పీడ విరగడ అయినందుకు సంస్థానం ప్రజలు పండుగ చేసుకున్నారు. హైదరాబాద్‌ వీధులు జైహింద్‌ నినాదాలతో మారుమోగాయి.